వ్యక్తి వ్యవస్థ అయిన చోట!!!

నలుగురితో నారాయణలతో నిండిన లోకమిది
అయిదు వేళ్ళు ఒక్కచోట ఉన్నా
ఒక్కటిగా అవ్వటం రాని సంఘమిది
కళ్ళల్లో ఆశలని కలలుగా భ్రమించడం తప్ప
వాస్తవంలో కంటి మెరుపులు లేని మనుషుల బ్రతుకిది

అందరిలో ఒకరై నడిచే వాళ్ళే చాలా మంది
అందరి ముందూ ఒక్కడిగా తను నడుస్తూ
ఎందరినో నడిపించే వాళ్ళు ఒకరిద్దరుంటారు
మొదటిది బతకటం
రెండవది బతుకునివ్వడం
అతడే నాయకుడు

అవును నిజమే
తనకి బతుకు నేర్పడమే తెలుసు
లక్ష్యమే జీవితమైన వాడికి
బిగించిన పిడికిలే ఆయుధం
కత్తిలా చీల్చే మాటే ఒక యుద్ధశకటం
తను నడుస్తూ ఒక సామాన్య సమూహాన్ని
ప్రభంజనంగా మార్చడమే  నాయకత్వం
ఆత్మస్థైర్యాన్ని ఒక అదృశ్య ఆయుధంగా ధరించిన వాడు
ఎప్పుడూ
ఒక నిత్య నూతన స్ఫూర్తి
ఒక జీవితకాలపు విజేత
అసంఘటితాలని నిన్నటిలో పాతరేస్తూ
నేటికి పోరాటం నేర్పిన యోధుడతను

సూర్యుని జ్వలనాన్ని లీనం చేసుకున్న వాడికే
నరాలలో జ్వలనం పుట్టించడం తెలుస్తుంది
తనని చుట్టేసిన కారుమబ్బులని ఆవిరి చేసి
మెరుపు ఫలాలని లోకానికివ్వడమే తన నైజం
కాడికి కట్టిన ఎద్దులైనా కొమ్ము విసిరితే
మనిషి జంకుతాడని తెలియజెప్పే
స్ఫూర్తినివ్వడమే తన మార్గదర్శకత్వం  

అంకురాలన్నీ అంబరాన్ని కలగనవచ్చు
కలల్ని సాధించడం తెలిసిన అంకురమే
అధిపతిగా ఎదుగుతుందన్న నిజం
మనసు మనసుకీ చేరవెయ్యడమే నాయకత్వం
గొంతు దాటని ఘర్షణలు గుండెల్లో నింపుకున్నవాడికి
ప్రతి ధ్వనినీ ప్రతిధ్వనిగా చేసి ప్రపంచాన్ని మ్రోతెక్కించడం నేర్పి
కోట్ల ఘర్షణలని విజయ తీరానికి చేర్చడమే నాయకుడి నావికత్వం

మనిషికి మనిషి కంచె కట్టుకున్న చోట
రక్తమోడుతున్నా కంచెలని మెలిపెట్టి తీసెయ్యడమే
తన రణనినాదం  చేసుకున్న వాడే అధినాయకుడు

ఆతని పలుకులు
ప్రళయ భీకర నినాదాలు
ఆతని అడుగులు
చెరిగిపోని పాద ముద్రలు
ఒకటి తరువాత ఒకటి
ఒకదాని వెంట మరొకటి
ఒకటితో ఇంకొకటి
అడుగులు అడుగులుగా
ఒక వ్యవస్థ
ఒక ప్రపంచం
ఒక కొత్త బంగారులోకం
నేడు విశాఖ సముద్రం సాక్షిగా

అవును కొందరంతే
నది ప్రవహించినంతమేరా
భూముల్ని సస్యశ్యామలం చేసినట్లు
అడుగు మోపిన ప్రతిచోటా
చైతన్యపు నెగళ్ళని రగిలిస్తారు
బీళ్ళవంటి మెదళ్ళని సైతం
సారవంత మైదానాలని చేస్తారు

కొందరంతే
ప్రతిఘటనని పిడికిళ్ళుగా బిగించటం తప్ప
పరిస్థితులతో రాజీపడరు
మెరమెచ్చులకీ మొహమాటాలకీ తలఒగ్గరు
మాటల్ని ఫిరంగులుగా పేల్చడం తప్ప
వాటికి మలాము పూతలు పూయరు

కొందరంతే
ఎప్పుడూ ఒక నదిని మోస్తున్నట్లుంటారు
జలపాతపు ఉరవడితో పరిగెడుతుంటారు
తనని పొదుపుకున్న మట్టి చైతన్యాన్ని
తనని ప్రభావితం చేసిన మహనీయులు
పరిసరాలకి ప్రసరిస్తూ ఉంటారు  

కొందరెప్పుడూ అంతే
చీకట్లని చీల్చుకుంటూ దూసుకొచ్చిన వేకువ బాకుల్లా
వెలుగులని పంచడానికి పుట్టిన బాల భానుడిలా
చూపుల్లో, మాటల్లో, నవ్వుల్లో
కాంతి పుంజాలని వెదజల్లుతుంటారు

అవును కొందరంతే
విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకుని తాము నడిస్తూ
తన వారిని గెలిపిస్తుంటారు
ఎందుకంటే
చరిత్రని రాసే అవకాశమెప్పుడూ

విజేతకే వస్తుందన్న నిజం  తమకెప్పుడూ ఎరుకే కనుక


No comments