చిన్న సరళరేఖ చాలు...

వచ్చే వేకువలన్నీ ఉన్నవాళ్ళ పెరట్లో కుంపట్లుగా గోరువెచ్చని అనుభూతులిస్తూ లేనివాళ్ళ గుడిసెల్లో తమస్సుని తామరతంపగా అల్లేస్తూనే ఉంటాయ్. వేకువై పొద్దుపొడిచే వారసత్వం ఒకరిదైతే... స్వేదమై కారే నెత్తుటి ప్రవాహం మరొకరిది. అవును... ఇది నిజం... ఇదే నిజం ....
మన సౌకర్యం కోసం రకరకాల కులాలు మతాలూ తెచ్చి పెట్టుకుంటాం కానీ ఈ సమాజంలో ఉన్నవి రెండే కులాలు.
ఉన్న కులం
లేని కులం.
“ ధనవంతులకి వారసులు పుడతారు.
పేదవాళ్ళకి పిల్లలు మాత్రమే పుడతారు”
ఎక్కడో విన్న మాట ఇది. ఎప్పటికీ వాస్తవమనిపించే మాట
నిజమే కదా...
వారసత్వంతో వాళ్లకి అన్నీ అలవోకగా అందుతాయి. ఆఖరికి నడవాల్సిన మార్గంతో సహా. వాళ్ళకోసం సాఫీగా ఒక దారి పరిచే ఉంటుంది. అద్భుతమైన ఆశయాలు, కలలు, కోరికలు అన్నీ అలా అలా వాలిపోతుంటాయి.
అతను రెక్కల గుర్రం ఎక్కి తన కోసం వస్తాడని ఎక్కడో ఒక అద్భుత సౌందర్యరాశి ఎదురు చూస్తూ ఉంటుంది. తనకోసం పూదండ పట్టుకుని ఆమె వేచి ఉంటుందని అతను మురిసిపోతుంటాడు.
కానీ ఈ పేదవాళ్ళ పిల్లలున్నారే వాళ్లకి కడుపే కాదు మనసూ నిండదు. కలలూ కోరికలు ఆశలు ఆశయాలు ఏదైనా నేరమే. వీళ్ళు దేహాలుగా చెమటై కురవాలి కానీ... మనసులుగా ప్రేమని అల్లుకోకూడదు. ప్రేమన్నది తమ ఉనికికి భంగపాటని తెలిసీ ఆపుకోలేని మనసుల బట్వాడా అన్నదే అతిపెద్ద నేరమై కొంతమందిని ఉన్మాదులుగా మార్చేస్తుంది. మరి ఆ ఉన్మాదానికి అధికారమే అగ్గి... డబ్బే ఇంధనం.
అసలంటూ పేదవాడి ప్రేమ మొదలైనప్పుడే మృత్యువాకిలొకటి సిద్ధమై ఉంటుంది. అంతేనా ఆ మృత్యువొక అంతు చిక్కని రహస్యంగా ఆ కాష్ఠంతోనే కాలిపోతుంది. వాళ్ళ కుత్తుకలు తెగనరకటమన్నది అన్నది మల్లె మొగ్గను కోసినంత సులభం.
“ డబ్బున్నవాడిది ఎప్పుడూ న్యాయమే
వాడి డబ్బుకు అధికారం కాస్తుంది కాబట్టి”
 ఎవరన్నారు చావులో అందరూ ఒక్కటేనని?
కానే కాదు.
డబ్బున్న వాడి సమాధి మందిరాలు సందర్శనాలయాలవుతాయ్...
పేదవాడి అస్థికలు కాలికింద చెత్తలా తొక్కబడతాయ్.
ఇక్కడ ధనిక పేద అంటే కేవలం సంపదయే కాదు... అధికారం&బానిసత్వం, అగ్రకులం & నిమ్నకులం... స్త్రీ పురుష అసమానత. అన్నీ... అన్నీ... ఒకే కొమ్మకు పూసిన అంతరాలే.
మనిషి పుట్టుక ఏక కణం గా అని తెలిసీ... మనం సృష్టించుకున్నఅంతరాలు మనల్ని కబళిస్తుంటే... మానవత చిరునామా వధ్యశిలే అన్నది చారిత్రిక వాస్తవంగా కొనసాగుతూనే ఉంది.
అంతరాల పేరుతో హత్యలని యథేచ్చగా చెయ్యటం... అధికారం అండతో ఆత్మహత్యలుగా చిత్రించటం. లోకాన్ని రంగస్థలాన్ని చేసుకుని లేని అమాయకత్వపు ముసుగు వేసుకుని మహా నటులుగా కొనసాగడం.
“ చిన్న సరళరేఖ చాలు...
సరిహద్దు రేఖల్ని దాటెయ్యడానికి”
కానీ... ఎప్పటికి దాటుతాం???
దాటి చూద్దాం ఈ సారి... మరోసారి...ఇంకోసారి... మనిషిని మనీషిగా నిర్మించుకోవడానికి.


No comments