మహి 'మ్యూజింగ్స్' - 1

పుస్తక దినోత్సవం అంటే నాకయితే స్నేహితుల దినోత్సవం లాంటిది. ఎందుకంటే ఎప్పటికీ అవే నా గొప్ప నేస్తాలు.

ఇప్పుడైతే ఏ పుస్తకం కావాలన్నా కొనేసుకుంటున్నా. లేకపోతే డౌన్‌లోడ్స్ ఎలానూ ఉన్నాయి. కానీ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు లైబ్రరీ... తర్వాత డిగ్రీ కాలేజి, పి.జీ చదివేటప్పుడు. తిరుపతిలో యూనివర్శిటీ లైబ్రరీ ఇవే పుస్తకాలతో నన్ను కలిపిన మీటింగ్ పాయింట్స్. తిరుపతిలో అయితే ఎన్ని ఆదివారాలు పొద్దున్న నుంచీ సాయంత్రం వరకూ లైబ్రరీలో గడిపేసానో లెక్క లేదు. 

మా చిన్నప్పుడు నాన్నగారి ఉద్యోగరీత్యా ఒడిషాలో ఉండేవాళ్ళం. తెలుగు కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి.

ఎవరైనా వైజాగ్ వస్తే తెచ్చే వి.సి.డి లు, అవి కాక తెలుగు అసోసియేషన్ క్లబ్‌లో నెలకు ఒకసారి సినిమాలు వేసేవాళ్ళు.


అమ్మకోసం నాన్నగారు చాలా పుస్తకాలు పోస్ట్‌లో తెప్పించే వాళ్ళు.


అలా మొదలయ్యింది పుస్తకాలతో మా స్నేహం.


ప్రతీ శెలవలకీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేవాళ్ళం. కృష్ణాయపాలెం అని విజయవాడ పక్కన చిన్న ఊరు.
మా చిన్నప్పుడే పెద్ద లైబ్రరీ ఉండేది అక్కడ. క్రితం శెలవల నుండీ అప్పటిదాకా మధ్యలో వచ్చిన చంద మామలూ.. బొమ్మరిల్లులూ అన్నీ చదివేసాకే మిగతా ఆటలన్నీ..


అలా చందమామతో మొదలయిన ఆ ప్రస్థానం ఇప్పటి దాకా ఆగలేదు.


తాతయ్య పక్కన పడుకుని మధుబాబు షాడో పుస్తకాలు చదవడం.. వీధిలో పుల్ల ఐసు బండికి కూడా డిస్ట్రాక్ట్ కానంత ఆకర్షణ అప్పట్లో.


పుస్తకాలన్నీ ఒక దొంతరగా పెట్టుకుని వెళ్ళి అటక మీద కూర్చుని చదువుకునేవాళ్ళం.


ఆ తర్వాత రంగా చనిపోయాక జరిగిన అల్లర్లలో ఆ లైబ్రరీ తగల బెట్టేసారు.


ఎన్నో అమూల్యమైన గ్రంధాలూ.. వేదాలూ ఉపనిషత్తులూ తగలబడిపోయాయని మామయ్య చెప్పి భాద పడుతూ ఉంటారు.


చిన్నప్పటి రోజులంటే క్రిష్ణాయపాలెం ఊరు. పెద్ద లైబ్రరీ.. ఎదురుగా రామాలయం.. అక్కడి బాదాం చెట్టూ అవే అందమైన జ్ఞాపకాలు.


ఇప్పుడు ఆ ఊరికి ఆ అందం లేదు. ఆ పచ్చదనం లేదు. కొత్త రాజధాని కాంక్రీటు పునాదుల్లో కలిసిపోతోంది ఆ ఊరు.


ఆ తర్వాత రాజాం వచ్చేసాం. ఇంగ్లీష్ పుస్తకాలంటే మాత్రం మొదలయ్యింది ఆర్కే నారాయణ్ పుస్తకాలే.
కొత్త క్లాస్ మొదలవగానే తెలుగు, ఇంగ్లీష్, హింది మూడూ ముందు చదివేసేదాన్ని. నాండిటైల్స్ అయితే మరీ ఇష్టంగా. అలా చదివినవే టాంసాయర్ కధలు. 


ఆ తర్వాత కనీసం ఒక మూడేళ్ళ పాటు జెఫ్రీ ఆర్చర్ తో పాటు.. మిల్స్ అండ్ బూన్ నవలలు. మిల్స్ అండ్ బూన్స్ పుస్తకాలైతే లెక్క లేదు. చిన్న చిన్న నవలలు అవి. రొమాంటిక్ థ్రిల్లర్స్. చదవడం.. అమ్మేయడం.. కొత్తవి కొనుక్కోవడం. మళ్ళీ అమ్మేయడం. చార్లెస్ డికెన్స్ సిరీస్ అంతా అలానే మిస్ అయిపోయింది.


పగలంతా కళ్ళు అలసిపొయేటట్లు చదవడం... సాయంత్రం వళ్ళు అలసి పొయేలా ఆడుకోవడం.. రాత్రిళ్ళు బినాక గీత్‌మాల వింటూ నాన్న పక్కన పడుకోవడం..


ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా.. మైండ్ రిఫ్రెష్ అయ్యి వెయ్యేనుగుల బలం వచ్చేంత జ్ఞాపకాలివి.


అలాగే బోలెడు ఇంగ్లీష్ పుస్తకాలు మిస్ అయిపోయాయి. అవి దాచుకోవాలన్న విషయం అప్పుడు తెలిసేది కాదు. ఇప్పడు


ఎప్పటికయినా.. కనీసం రిటైర్ అయ్యేటప్పటికైనా నాకంటూ ఒక పెద్ద గది..


బోలెడు పుస్తకాలు


ఒక లైబ్రరీ...


ఇది చాలు జీవితానికి అనిపిస్తుంది.
No comments