#MeeToo


ఈ రోజెందుకో రాయాలనిపిస్తోంది.!!!
ఒక ముఖ్యమైన కాల్ ఎటెండ్ అవుతున్నాడు అతను. అతని ఎదురుగా కూర్చుని అవసరమైన డేటా అప్పటికప్పుడు అందిస్తోంది ఆమె. అవతలి వాళ్ళకి ఏదో కాంటాక్ట్ నంబర్ ఇవ్వవలసి వచ్చింది. యధాలాపంగా తన ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చి కాంటాక్ట్ నంబర్ తీయమని సైగ చేసాడతను. ఆమె తీసే లోపే అతని మెదడులో ఏదో మెరిసినట్లయి మెరుపు వేగంతో ఫోన్ వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నించాడు. 
అయితే..
అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆమె ఫోన్ తీసుకోవడం... అతను ఓపెన్ చేసి ఉంచిన గ్యాలరీలోకి చూడడం జరిగిపోయింది.
తనతో పాటు చేసే ఇంకో కొలీగ్ ఫొటో. క్లోజ్ అప్ లో క్రాప్ చేసుకుని కింద కొన్ని కాప్షన్స్ ఏడ్ చేసుకుని చూసుకుంటున్నాడు. నిర్ఘాంత పోయి బయటకి వచ్చేసిందామె.
ఎవరితో అయినా షేర్ చేసుకుంటుందేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నాడు అతను. ఒక వేళ చెప్తే ఏం చేయాలి. ఆమెని ఎలా ఎదుర్కోవాలి. నయానా?? భయానా??
ఆమె కూడా ఆలోచిస్తోంది. ఎలా చెప్పాలి? ఎవరికి చెప్పాలి? చెప్తే పర్యవసానాలు ఏమిటి? ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా తీసుకుంటుంది ఈ విషయాన్ని.
ఎవరికి.. ఎక్కడ.. జరిగింది అని అడగకండి.
ఇలాంటివి మనం ఎన్నో సార్లు వినే ఉంటాం కదా…
****************************************************************
ఏదో తోచీ తోచక నాలుగు ముక్కలు రాసి దానికి కవిత్వం అని పేరు పెట్టుకున్నప్పుడూ.. వెన్నెల గురించి, సముద్రం గురించి అందంగా చెప్పుకున్నప్పుడూ... అంతా బాగానే ఉంటుంది.
కానీ ఇదిగో ఇలా జెండర్ ఇస్స్యూస్ మీద రాసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. లోపలా బయటా కొంత రెసిస్టెన్స్.
ప్రత్యేకించి నా మిత్రులూ, సహోదరులూ, సహచరుడి నుంచి.
ఎందుకంటే Basically i am a protected women. ( may be from their angle... or may be true too.)
అద్భుతమైన తండ్రీ, అర్ధం చేసుకునే సహచరుడూ, బంగారం లాంటి కొడుకూ, మంచి స్నేహితులూ..
ఒక్క మాటలో చెప్పాలంటే I am a protected soul always.. అందుకే నేను ఎప్పుడైనా violence గురించి, harrassment గురించి రాస్తే వాళ్ళు కొంచం ఇబ్బంది పడతారు.
బహుశా మనం రాసే ప్రతీ అక్షరం మన అనుభవం లోంచే వస్తుందన్న ఒక Phenomenon దీనికి కారణం కావచ్చు.
కానీ ఈ రోజెందుకో రాయాలనిపిస్తోంది.
చాలా అవేదనగా. ఏంతో ప్రొటెక్టెడ్ జీవితం అనుకున్నా కూడా.. నేనిప్పటికీ చాలా సార్లు vulnerability Face చేసాను.
ఇంట్లో జరిగే హింస, అసమానత ఇవన్నీ పక్కన పెడితే... పని చేసే చోట జరిగే వేధింపులు మాత్రం చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయన్నది వాస్తవం.
సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఎలా ఉన్నా. వాస్తవంగా వచ్చేటప్పటికి, చాలా కేసుల్లో సంకోచాలు, Fear Of social Defeats దాటుకుని బయటకి వచ్చేవి దాదాపు సున్నా శాతం. ఒక వేళ బయటకి చెప్పినా ఆమె క్యారెక్టర్ గురించిన చర్చలు మొదలవుతాయింక.
అదే కదా వారికి అవకాశం. సొసైటీ లో వేళ్ళూనుకున్న జెండర్ డిఫరెన్సెస్… అందులో ఒక జండర్, శతాబ్దాలుగా కేవలం ఒక వస్తువులా చూడబడుతుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్లకి ఎటునుండి భయం వస్తుంది. అసలు భయమనేది వేధింపులకి గురయ్యే వారికో … లేదా భరించలేని నిజాలు తెలిసినవారు దాన్ని ఎలా వెల్లడి చెయ్యాలో తెలియని సందిగ్ధ స్థితిలోకి వెళ్ళినప్పుడో వస్తుంది.
ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి చోట స్త్రీ పురుషులు కలసి పనిచెయ్యవలసి రావటం చాలా మామూలు విషయం. జండర్ ఇష్యూ అనేది లేకుండా కేవలం సహోద్యోగుల్లా చూసే వారి మధ్య ఎలాంటి ప్రాబ్లం ఉండవు. కానీ అలా చూడటం ఒక నటన అయిన చోట, అది నటన అని ఏ ఒకరిద్దరికో అర్థమయి వారు ఆ వాతావరణంలో ఇమడలేక పోవడమూ అందరితో సోషల్ గా మూవ్ అవ్వక పోవడమూ వారి వ్యక్తిత్వలోపంగా ఎంచబడే చోట అసలు వారి బాధ ఎవరికని share చేసుకోగలరు?
అలా share చేసుకున్నా అవతలి వారు చేసేది తమ వ్యక్తిత్వ హననమే అని ముందే తెలిసివస్తున్నప్పుడు ఒక స్త్రీ తనకు తానుగా ఏమి చెయ్యగలదు? 
చాలా సార్లు ఎంత గందరగోళంగా అనిపిస్తుందంటే.. ఒకేలాంటి ఒకానొక సంఘటన.. ఆమె రియాక్ట్ అయినప్పుడు.. ఆమె ఒక సంకుచిత మనస్తత్వమున్న దానిగా.. నెగెటివ్ మైండ్ గా చిత్రీకరించబడుతుంది. అదే ఆమె మౌనంగా ఉంటే అర్ధాంగీకారంగా నిరూపింపబడుతుంది.
అన్నిటికన్నా పెద్ద సమస్య.. చాలా సార్లు ఆ crookedness ని నిరూపించలేకపోవడం.
శరీరాన్ని బాధలకి గురిచెయ్యడమే హింస అని పిలవబడే సమాజంలో… అడుగడుగునా... అడుగు పెట్టిన ప్రతి చోటా మనసు మీద చేయబడే గాయాలకి అసలు పేరేం పెట్టాలి?
పనిలో ఎంత సామర్ధ్యముండనీ, హోదాలో ఎంత గొప్ప దానివవ్వూ… నువ్వు ఆడదానిగా కాక సహోద్యోగిగా గుర్తించబడటం అన్నది జరగనంతవరకూ మనిషిగా స్త్రీ స్థానం ప్రశ్నార్ధకమే !

No comments