ఒక నవ్వుగా

కళ్ళనీ కదపలేనివ్వని 
ఈ క్షణాల ముట్టడిలో 
ప్రకృతిని నింపేటంత పచ్చదనాన్ని 
ఎండుటాకుల్నీ దాపెట్టుకునేటంత పసిదనాన్ని 
మబ్బు దుప్పట్లని కప్పుకుంటున్న 
చల్లగాలి రహస్యాన్ని 
వెలికితెచ్చుకునేటంత 
ఏకాంతపు వేకువ ఒకటి తలపు కొచ్చింది
రంగుల రాట్నమెక్కిన ఋతువుల్లా 
వలయంలా చుట్టుముట్టే సుఖదుఃఖాలుపారిజాతాల తోటలోని జ్ఞాపకాలన్నీ కలసి 
పెదవులపై చిలకరించిన మందహాసాలూ 
వెన్నెల్లో గంధాన్ని కలిపి 
రాసుకున్న మౌన వాక్యాలూ 
పరాకుగా మారి 
రెప్పల కింద అలసటని ప్రోది చేసుకుంటున్న 
ఇలాంటప్పుడే అనిపిస్తుంది

అప్పుడప్పుడూ సముద్రమంత విరామముండాలి 
ఆ విరామమంతా ఓ నిశ్శబ్దం నిండాలి అని
మరి… 
ఆ నిశ్శబ్దం నాలో చేసే అన్ని శబ్దాలని
మనసు పొత్తిళ్ళ నిండా పొదుపుకోవాలి 
ఆ శబ్దాలన్నీ సీతాకోకల రెక్కల కింద గాలిలా 
నన్ను కమ్ముకోవాలి 
నన్ను నేను 
ఒక నవ్వుగా సశేషం చేసుకోవాలంటే

No comments