రాము చెప్పిన జాతకం!!

రాము చెప్పిన జాతకం!!
"రామూ జాగ్రత్త! ఉమా అమ్మ జాతకం చూసి తీయి" హెచ్చరించాడతను.
అప్పటికే రెండు సార్లు రెండు వేరు వేరు కవర్లు ముక్కుతో పట్టుకుని, తీయనా వద్దా అని సంశయంగా ఉంది రాము. మాస్టర్ గొంతు పెంచి గట్టిగా చెప్పేసరికి కంగారు పడిపోయింది.
మెడ వంచి నావేపు చూసి ఒక కవరు అతని చేతిలో పెట్టి నిర్లిప్తంగా వెళ్ళిపోయింది లోపలికి.
కవరు లోపల చేయి పెట్టిన అతని మొహం చూసి మాకు నవ్వాగ లేదు.
ఎందుకనుకుంటున్నారూ... ఆ కవర్లో అసలు కార్డు ముక్కే లేదు.
(మీకు అర్ధం అయింది కదా. చిలక జోస్యం!!
మన ఏటిఎం పౌచ్‌ల్లాంటివి వరసగా పెట్టుకుని కూర్చుంటాడతను. రాము గారు మన అదృష్టాన్ని బట్టి ఒక పౌచ్ తీస్తారు. అందులో రాముడో, కృష్ణుడో, అమ్మ వారో ఉంటారు. సందర్భాన్ని బట్టి రకరకాల మాటలు చెప్పి మనల్ని కన్విన్స్ చేస్తారు ఆ కోయ దొరలు)
నిన్న ఈ కోయ దొర సముద్రం దగ్గర కనిపించాడు. భలే సరదాగా అనిపించి ఈ ఆట మొదలు పెట్టాం.
సరే ఇంతకీ అందులో కార్డు ముక్క లేదు అని చెప్పాను కదా. చాలా రేర్ గా జరిగే పొరపాటు అది. సర్దుకుంటున్నప్పుడు ఆ పౌచ్ లో కార్డు మిస్ అయి ఉంటుంది.
అసలు ఏ బొమ్మా లేనప్పుడు మనకి జాతకం ఏం చెప్తాడు??
నాకు కొంచం కుతూహలంగా అనిపించింది. బహుసా... "ఇంకో సారి తీయిస్తా" అంటాడేమో అనుకున్నా...
ఈ ఆలోచన ప్రోసెస్ గట్టిగా కొన్ని క్షణాలు కూడా జరిగి ఉండదు. మొహంలో మారబోతున్న రంగుల్ని చటుక్కున తిప్పుకుని..
" మీకు అసలు జాతకం లేదు" అన్నాడతను.
ఇంకా నయం భవిష్యత్తు లేదు అనలేదు. 
నవ్వలేక చచ్చిపోయాం. ఆ తర్వాత "మీరొక తెల్ల కాయితం" అన్నాడు. నేను ఆ సముద్రాన్ని అన్నాడు. ఆకాశం అన్నాడు. ఇంక అతని క్రియేటివిటీకి హద్దులేదు. చెప్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో నా నవ్వుని ఆపలేక హైరానా పడిపోయాడు పాపం.
అసలు వీటన్నిటి కన్నా నాకు బాగా నచ్చినదేమిటంటే. అతని సమయస్ఫూర్తి.
అతను ఏం చదువుకుని ఉంటాడు. ఏమీ చదివి ఉండడు. కానీ చెప్పిన మాట చెప్పకుండా, గుక్క తిప్పుకోకుండా అతను చెప్పిన మాటలు. అతనిలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన పద్ధతి భలే నచ్చాయి నాకు.
ఒక ఖాళీ పౌచ్ చిలక తీయగానే ఉలికి పాటు కప్పి పుచ్చుకుని అప్పటికప్పుడు అల్లిన కధ భలే ముచ్చటగా అనిపించింది.
అతను చెప్పిన వాటిల్లో నిజాలేమీ ఉండవు. ఏవో కొన్ని యాదృచ్ఛిక విషయాలు తప్పితే.
అయినా దాదాపుగా అతను చెప్పేవన్నీ మనం అన్వయించుకుంటే నిజాలే అనిపిస్తాయి. అంత సహజం గా ఉంటాయి వాళ్ళ మాటలు.
అతని పేదరికం, ఆకలి, అవసరం ఇవే కదా అతనికి ఇన్ని మాటలు నేర్పింది.
నిజమే! జీవితం నేర్పించిన పాఠాల ముందు.. ఏ మేనేజ్‌మెంట్ పాఠాలు సాటి రావు కదా!!

No comments