#She


ప్రతి దుర్మార్గపు భాషకూ 
పలకగా మార్చుకోబడుతున్న 
ఆమె దేహం చెబుతోంది 
తన జీవితమెప్పుడూ 
ఊపిరిని నింపుకుని నడిచే నిరర్థక యంత్రమేనని
తను ఆత్మని నమ్ముకున్నతనమే 
నీ నడకకు రాదారిగా 
తన ఉనికొక గాయంగా మారి 
నెత్తుటి వాసనని 
కాలం పొడుగూతా వెదజల్లుతూనే ఉంది
అవును...
ఆమె…అంటేనే దేహం...
బ్రతుకు పోరులో గాయాన్నే ఉనికి గా చేసుకున్న నిరంతర అస్తిత్వ పిపాసి ఆమె..
శత్రుత్వం ఎవరి మధ్య ఉండనీ 
యుద్ధమెలా మొదలవ్వనీ 
ప్రతీకారమంటూ మొదలయ్యేది 
ఆమె మానం మీద వేసే మరకలతోనే 
ఆమె దేహం మీదుగా సాగిపోయే మరణంతోనే
అప్పుడొక నిర్భయ...
ఇప్పుడొక ఆసీఫా…. 
ఆమె దేహం పేరు మారుతూనే ఉంటుంది 
కథ మాత్రం ఎప్పటిలా పాతదే
***
తనని ఛిద్రం చేసే యుద్ధానికి ఊపిరిచ్చి మరీ 
తన గర్భంలోనే భద్రపరచే రోజులు ఇక వద్దని 
ఒక్క అమ్మ అనుకుంటే చాలు 
ఇక నేలపై యుద్ధం చారికలు చెయ్యడానికి 
ఒక్క దేహమూ మిగిలి ఉండదు
చూద్దాం మరి 
ఏ అమ్మ మొదలు పెడుతుందో 
గర్భ విచ్ఛిన్న యుద్ధం 
మానవహరణ తంత్రం

No comments