అసలు ఈ అమ్మలున్నారే!!

ఈ రోజు పొద్దున్నే వంట గది లో అష్టావధానం చేస్తున్నానా!! ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు.. విసుక్కుంటూ వెళ్ళి చూద్దును కదా!!

మాంచి జరీ చీర కట్టుకునీ.. గాగుల్స్ పెట్టుకుని.. నవ్వుతూ ఒక పెద్దావిడ. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుండగానే.. కళ్ళజోడు తీసింది...

మా కాంతమ్మ!! మా ఇంటి పనిమనిషి కాంతమ్మ!!. నెల రోజుల క్రితం చెప్పా పెట్టకుండా మాయమైపోయి.. నా మార్చ్ నెల 
హడావుడి కి తన వంతు ఆజ్యం పోసిన కాంతమ్మ!! కోపం గా నేను ఎదో అనబోయే లోపే గడ గడా చెప్పడం మొదలెట్టింది. 
కంటి కి ఆపరేషన్ చేయించుకొందట!! ఈ మధ్యే తన కొడుక్కి గుట్కా లు ఖైనీ తిని నోటి కాన్సర్ వస్తే ఆపరేషన్ చేయించింది. ఆ కాసేపు ఆమె చెప్పిన అమాయకపు మాటల్లోనే .. ఆరొగ్యశ్రీ పధకం .. అందులో కార్పొరేట్ ఆసుపత్రుల అవినీతి అర్ధమై.. నా తల తిరిగి పోయింది. " మాయదారి కొడుకు గుట్కా లు తినొద్దంటే వినలేదు..పుట్టుకలోనే పోయిఉంటే ఇంత భాద ఉండేది కాదు" అని ఒకటే ఏడుపు.. డాక్టర్ గారు.. ఆ కొడుక్కి పత్యం గా జీడిపప్పూ , బాదం పప్పూ పొడి చేసి నీళ్ళ లో కలిపి పెట్ట మన్నారట!! 

నాలుగిళ్ళ లో నెలంతా పని చేస్తే మా కాంతమ్మ కొచ్చే జీతం నాలుగు వేలు. ఇవన్నీ ఎక్కడ భరిస్తుందీ.. మాయదారి కొడుకు మాట వినకుండా దురలవాట్లు కి పోయడని తిడుతుంటే నాకూ వళ్ళు మండి పోయి.. " ఆ జీడి పప్పూ బాదం పప్పు తో పాటు ఇంత గన్నేరు పప్పు కలుపూ " అందామనకున్నానా!!!

ఇంతలోనే తన ఆపరేషన్ అయిన కళ్ళని జాగర్త గా తుడుచుకుంటూ.. "ఎంతయినా వాడు నా కొడుకు కదమ్మా వాడే మారతాడు. కావాలంటే ఇంకో రెండు ఇళ్ళ లో పని చేస్తా " అంటూ చక్కా పోయింది మా కాంతమ్మ. ఇంకా నయం నా గన్నేరు పప్పు సలహా చెప్పాను కాదు..

అసలు ఈ అమ్మలున్నారే!! పేదా గొప్పా తేడా లేకుండా ఎక్కడైనా చూసెది కల్మషం లేనిది.. ఈ తల్లి ప్రేమ ఒక్కటేనేమో కదా!!

No comments