"పాపిలాన్" -- హెన్రీ చార్రియర్


కొన్ని నవలలు చదవడానికి భలే ఉంటాయి. ఆపకుండా చదివించగల శక్తి వాటికి ఉంటుంది. కానీ ఎవరికైనా పరిచయం చేయాలంటే కధా భాగం ఒక పట్టాన చేతికి దొరకకుండా తిప్పలు పెడుతుంది. పాపిలాన్ కూడా అలాంటిదే.
 
పాపిల్లాన్ అంటే 'సీతాకోక చిలుక' అని అర్ధం. కధా రచయిత హెన్రీ తన గుండెల మీద సీతాకోక చిలుక ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడం చేత అందరూ అతనిని "పాపిలాన్" అని పిలుస్తారు. అతని సాహసిక గాధే ఈ నవల. 

ఇది ఒక ఆజన్మాంత ఖైదీ జీవితగాధే కాదు, మనకి తెలియని ఒక కొత్త ప్రపంచపు లోతుల గురించిన కధ. మానవులలోని మహోన్నత మైన స్వేచ్ఛా ప్రియత్వానికి, మనిషిలోని అత్యున్నత మానవతా వాదానికి ఇది ఒక ప్రతీక. దొంగలు, ఖూనీకోర్లు, పచ్చి నెత్తురు తాగుతారు... అనిపించుకునే వారిలో కూడా ఒక ఆదర్శం, మహోన్నతమైన ఏకాభిప్రాయం, తమకి లభ్యం కాని స్వేచ్ఛకొరకై తోటి ఖైదీ ప్రయత్నిస్తున్నప్పుడు మిగిలిన వారందరూ ఏకతాటిపై నడిచి, మనస్ఫూర్తిగా సహాయం చేయడం....
ఇలాంటి అనేక అపురూపమైన మనస్తత్వాలు ఈ కధలో మనకి కనిపిస్తాయి. 


అట్టడుగుకి జారిపోయి, పతనమై పోయాడనుకున్న ఒక మనిషి... ఎంత ఉన్నతంగా ఎదగగలడొ మనకి చెప్తాడు హెన్రీ చార్రియర్. అప్పటికే దొంగగా సమాజంచే గుర్తింపబడ్డ హెన్రీ... తాను చేయని ఒక హత్యానేరంపై జైలుకి వెళ్ళడంతో కధ మొదలవుతుంది.
ఇక అక్కడ నుంచి.. జైలు లో ఖైదీల అవస్థలు... కారాగారం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు... ఇవన్నీ హృదయ విదారకంగా వర్ణిస్తాడు హెన్రీ. పదకొండు సంవత్సరాల భయానక అనుభవాల తర్వాత అతి కష్టం మీద స్వేచ్ఛ పొందిన పాపిలాన్ కొత్త జీవితం మొదలుపెట్టి... తన అనుభవాలను అక్షర బద్ధం చేయడం మొదలు పెట్టడంతో కధ ముగుస్తుంది. 


"మనిషిని -మనిషిగా బ్రతకనివ్వని సమాజమూ, ప్రభుత్వమూ- ఇవి కావు నాగరికతకు చిహ్నాలు. మానవునిలో అత్యుత్తమమైన దయ, జాలి, ఐకమత్యమూ- వీటిని చూడగలగాలి అంటే.... సమాజంలో అట్టడుగున ఉన్న అతి సామాన్యులని, సమాజం నుండి దూరంగా వెలివెయబడ్డ నిర్భాగ్యులనీ వెతకండి. అక్కడ కనిపిస్తాయి మనుష్యుల లోని అత్యుత్తమ గుణాలు.." అంటాడు పాపిలాన్ (హెన్రీ చార్రియర్). 


అందుకు బలమైన ఉదాహరణే పాపిలాన్ గాధ.

No comments