సముద్రం


అనంతానంత సూర్యుళ్ళ ఆవాసమై
కిరణ చెలమలతో సావాసం చేస్తూ 
వెలుగుని లయం చేసుకున్నఈ అఖండ జలరాశి
ప్రతి ప్రత్యూషంలో ఒక సూరీణ్ణి
భరోసాగా ఇస్తుందీ లోకానికి
ప్రతి ఉదయాన్నీ కొత్తగా ప్రతిధ్వనిస్తూ
ఆకాశానికి అద్దమవుతూ
మేఘమాలికలకి ఆర్ద్రతౌతూ
నదీమరాసులని ఒడిసిపడుతూ
జలచరాలకి అమ్మతనాన్నందిస్తూ
సముద్రమెప్పుడూ వేదాక్షరమే
అలలు అలలుగా మంత్రపుష్పాన్ని పఠిస్తూ
ఎప్పటికప్పుడు తీరంపై తడి స్వరాలని లిఖిస్తూ
సముద్రమో వర్ణ చిత్రం
ప్రకృతి రంగులని పరిమళిస్తూ
జీవిత బంధాలని తనలో ఉదహరిస్తూ
నిజమే…
తను కెరటాలుగా ఎగసినప్పుడల్లా
యుగాల అమ్మ ప్రేమని ఆక్కడే ప్రోది చేసుకుందేమో అనిపిస్తుంది
బడబాగ్నులని దాచుకున్న నిశ్చల గంభీరతని చూసినప్పుడల్లా
జీవితాగ్నులని దాచుకునే నాన్న హృదయమే స్పర్శిస్తున్నట్లు ఉంటుంది
నా గుండె లోపల చప్పుడైనప్పుడల్లా
సాగరంతో యుగళగీతం పాడాలనిపిస్తుంది
తన విశ్వ రూపాన్ని నా మనసారా హత్తుకుంటూ
తానే నేనైన అలౌకికతలోకి త్రుళ్ళి పడుతూ

No comments