వెలుగు గువ్వ


నువ్వొక గాజుగుడ్డ దాచిన గాయానివని తెలియక
స్నేహ సమీరంగా ఆస్వాదించా
స్నేహానికెప్పుడూ ఒకే పలుకుంటుదనుకున్నానిన్నాళ్ళు
ప్రతి పలుకుకూ మరో పార్శ్వం ఉంటుందని ఒక కొత్త పాఠం నేర్పావు
సాలీడువై నువ్వల్లిన వలని
ఇప్పటికైనా గుర్తెరగడం నాకో నిశ్శబ్ద అనుభవం
ఆలస్యం అయితేనేం ఇప్పుడే తెలుసుకున్నా
సరి కొత్త నిజం...
అప్పుడప్పుడూ
ఒక శూన్యం పలకరిస్తూ ఉండాలి
మళ్ళీ కొత్తగా నన్ను నేను పరిమళించుకోవడానికి
మంచో చెడో అప్పుడప్పుడూ కొన్ని పాఠాలు నేర్వాలి
జీవితం ఆటుపోట్ల సజీవ ప్రవాహమని గుర్తెరగడానికి
నువ్వొక అపవిత్ర జ్ఞాపకానివయ్యాక
ఇక వేదన లేదు... రోదన లేదు
నా హృదయానికి నేనే దీపాన్నై వెలుగు గువ్వనవుతా

No comments