భయస్థుడు (ఫోమా గార్డియెవ్) - మాక్సిం గోర్కీ
గోర్కీ సామాన్యుల ఉద్యమోజ్వల రూపం.
గోర్కీ వాక్యాల వెంట నడిస్తే చాలు అణువణువూ చైతన్య జలపాతాలు మనల్ని నిలువెల్లా ఉత్తేజంతో నింపివేస్తాయి.
ప్రపంచ సాహిత్యక్షేత్రంలో గొప్ప రచయితగా నిలిచిన వ్యక్తి మాక్సిం గోర్కీ. రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించడం కంటే సమాజపు అంతరాత్మగా ప్రతిధ్వనించడమే ముఖ్యమని నమ్మిన వ్యక్తి. అందుకే తన రచనల ద్వారా సాహితీ ప్రపంచాన్ని ఒక సునామీ లా చుట్టేసాడు. మాక్సిం గోర్కీ పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చే పేరు "అమ్మ" నవల. అయితే అతను మొట్టమొదట వ్రాసిన పుస్తకం " ఫోమా గార్డియెవ్ ". తెలుగులో రెంటాల గోపాల క్రిష్ణ " భయస్థుడు" గా అనువదించారు. బెల్లం కొండ రామదాసు గారు చేసిన అనువాదం కూడా ఉంది. 1901 లో రచించిన " ఫోమా గార్డియెవ్""ది మేన్ హు వజ్ ఎఫ్రైడ్ " గా ఇంగ్లీషులోకి అనువదించబడింది. ఆ తర్వాత రామదాసు గారి ద్వారా తెలుగులోకి వచ్చింది. ప్రపంచ సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ కలికితురాయి గా నిలిచిపోయింది. ఆనాటి రష్యన్ సమాజంలోని బూర్జువాల భూస్వాముల వర్గ ధృక్పధాన్ని యధార్ధంగా చిత్రీకరించిన నవల ఇది.
గోర్కీ సాహిత్యంలో అత్యంత సహజంగా హద్దులూ ఆనకట్టలూ లేని మానవ శక్తి ఒక సముద్ర ఘోషలా మనకు వినిపిస్తుంది. బ్రతుకులోని అపశృతులన్నీ నిర్భయంగా మీటుతాదు గోర్కీ. " భయస్తుడు " నవలలో ఫోమా గార్డియెవ్ ఉజ్వల మానవతను ఉరితీస్తున్న సమాజం గురించి ప్రపంచానికి తెలియ చెప్పాలని చూస్తాడు. సమాజంపై నేరం మోపుతాడు. కాని అతను భయస్తుడు. బలహీనుడు. ఏమీ చేయలేని అతని ఆవేశం అతనినే అగాధంలోకి తోసివేస్తుంది. ఒక్క మాటలో చెప్పలంటే ఫోమా గార్డియెవ్ ద్వారా ఒక విప్లవ కారుడు, ఒక ఆదర్శ మూర్తి ఎలా బ్రతక కూడదో చెపుతాడు గోర్కీ
పుస్తకం చివర్లో ఫోమా ఇలా అంటాడు. " నేను అర్ధం చేసుకున్నది ఇదీ ! కొందరు పురుగులు మరికొందరు పిచ్చుకలు. ఆ పిచ్చుకలే వర్తకులు. వీళ్ళు ఆ పురుగులని ముక్కులతో పొడుచుకొని తింటారు. వీళ్ళు పుట్టిందే అందుకు. మరి నాలాంటి వాళ్ళు ఎందుకూ కొరగారు. వ్యర్ధంగా అనాలోచితంగా జీవిస్తారు. మనం అ ప్రయోజకులం. మనం దుఃఖిస్తాం అంతే.. దుఃఖాన్ని తీర్చలేం.. సమస్యకి కారణం తెలిసీ స్పందించలేని నాలాంటి అప్రయోజకులే సమాజానికి నిజమయిన శతృవులు. "పుస్తకం చదువుతున్నంతసేపూ "ఫోమా గార్డియెవ్ కు స్పందించే ధైర్యం వస్తే బాగుండు" అనుకుంటాం..అతను నిస్సహాయుడిలా పిచ్చివాడైపోయినప్పుడు మనం వెక్కి వెక్కి యేడుస్తాం.
Post a Comment