నిగాహ్ - బాలగోపాల్
"ఎవరు?"
అన్న
ఒక ప్రశ్న తత్వ శాస్త్రానికి మూలమయ్యింది.
"ఎందుకు?"
అన్న
ఒక ప్రశ్న ఆవిష్కరణలకు బీజమయ్యింది.
"ఎలా?"
అన్న
ఒక ప్రశ్న సముద్ర యాత్రలకు., అంతరిక్ష అన్వేషణలకు కారణమయ్యింది.
"ఏమిటి?"
అన్న
ఒక ప్రశ్న విప్లవాలకు ఊతమిచ్చింది. ప్రశ్నే లేకపోతే మానవ జాతి
మనుగడే లేదు.
న్యూటన్ ప్రశ్నించకపోతే , ఎడిసన్ ప్రశ్నించకపోతే, మహాత్ముడు ప్రశ్నించకపోతే,
చేగువేరా ప్రశ్నించకపోతే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేది. ఇంకోలా చదువుకొనే వాళ్ళం. ప్రశ్నకు దూరం గా
ఉన్నవారు అజ్ఞానం లోనే మిగిలి పోతారు. ప్రశ్నించే ధైర్యం ఉన్నవారికే, ప్రశ్నించాలన్న వివేకం ఉన్నవారికే, ప్రశ్నను సృష్టించగల సత్యాన్వేషికే ఎప్పటికయినా జవాబు దొరుకుతుంది. ప్రశ్న పదునుగా ఉండాలి. అప్పుడే గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరుతుంది. రాల్చాన్సినవి రాల్చేస్తుంది. కూల్చాల్సినవి కూల్చేస్తుంది. మన హక్కులేంటొ చెపుతుంది.
మతం, న్యాయం, స్త్రీ-పురుష సమన్యాయం మొదలు ఆర్థిక ఉన్మాదం దాకా అన్నింటి పైనా ప్రశ్నలు సంధించి , సమాధానాలు శొధించిన ఒక ఉద్యమకారుడి వేదన, వాదన
ఈ నెల మీకు
పరిచయం చేయబోతున్న " నిగాహ్" పుస్తకం.సామాజిక స్పృహ ఉన్న
ఎవరికైనా బాలగోపాల్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
బాలగోపాల్ ని అభిమానులందరూ హక్కుల తత్వవేత్తగా పిలుచుకుంటూ ఉంటారు. అది పొరపాటేమో అనిపిస్తుంది.
తత్వవేత్తలు తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి పరి పరి
వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. మన టి.వి టాక్ షోలలో కనిపించేవారిలా,
పడకకుర్చీ మేధావులలా..
కానీ ఈ ప్రపంచాన్ని మార్చాలని ప్రయిత్నించరు. అందుకు విరుద్ధం గా బాల
గోపాల్ సామాజిక చలనం లో
ప్రతీ అడుగునీ, ప్రతీ మలుపునీ తనదైన రీతిలో విశ్లేషించి, వివేచించి మంచి-చెడులను ఎంచి చూపించడంతో పాటు,
మనం మంచి వైపు
ఎందుకు ఉండాలో చెప్తారు.
మంచి వైపు లేకుంటే జరిగే నష్టం ఎమిటో తూకం వేసి మరీ
వివరిస్తారు.
ఎవరి నిర్ణయం ఏదయినా తాను కడదాకా ప్రజా ప్రయోజనాల పక్షాన, సామాజిక న్యాయం పక్షాన నిలబడి హక్కుల జెండాని సమున్నతంగా నిలుపుతారు.
వీటి సాధనకొరకే
తాను ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నానని సగర్వంగా చెపుతారు.
బాలగోపాల్
"ప్రజాతంత్ర"
కోసం పదేళ్ళకు పైగా సమకాలీన రాజకీయ,
సామాజిక,
ఆర్థిక అంశాలపై పలు వ్యాసాలు రాసారు.
అందులో
1998-2003 మధ్యకాలంలో రాసిన 115 వ్యాసాలను దేవులపల్లి పబ్లికేషన్స్ "నిగాహ్" పేరిట వెలువరించింది. దైనందిన పరిమాణాలపై చేసే పత్రికా వ్యాఖ్యలకు సాధారణంగా కొద్ది రోజుల తర్వాత విలువుండదు.
కానీ,బాలగోపాల్ రాసిన వ్యాసాలు అలా కాదు. ఇప్పుడు, దశాబ్దం తరవాత చదివినా వాటికి వర్తమానం లోనే కాదు
భవిష్యత్తులోనూ ఉపయోగం ఉంటుందని మనకు అర్ధమవుతుంది. వీటిని అప్పుడే చదివినవారు మళ్ళీ చదివినా కొత్తగా చదివిన భావం కలుగుతుంది.
ఎవరినైనా పట్టుకుని కాల్చి చంపడం అన్యాయమని మనం అంటాం.
అదే ఆరు బయట
నిద్రిస్తున్నవారి చెరచి, చంపిన సీరియల్ కిల్లర్ని చంపితే మనగొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది.
వెనుకా ముందూ చూడాల్సి వస్తుంది.
కానీ బాలగోపాల్ మాత్రం ఆ ఉదాహరణనే తీసుకుంటారు.
ఎలాంటి నేరస్తుడినయినా పట్టుకుని కాల్చడం ఎంత నేరమో, అలాంటి చర్యల వల్ల సమాజం ఎక్కడికి దిగజారుతుందో విశ్లేషించడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడా "నేనిది చెపుతున్నాను. మీరు వినండి" అనే
అజమాయిషీ ఉండదు. పాఠకునితో సంభాషిస్తున్నట్టుగా ఉంటుందాయన వ్యాసం. తిరుగులేని తర్కం ఆయన
అస్త్రం.
ఆ తర్కం మార్క్సిజం నుంచి వచ్చినదే కావచ్చు.
మార్క్సిజాన్ని కేవలం రాజ్యాన్ని మార్చడం కోసం జరిగే పోరాటంగా కాకుండా సమాజంలో విలువల మార్పు కోసం జరిగే నిరంతర పోరాటంగా చూస్తారు బాలగోపాల్.
"నిగాహ్" లో
ఏముంది-
అని వెతికితే
పీడితప్రజల బాధ
కనపడుతుంది,
గొంతులేని ప్రజల
వాదన వినపడుతుంది.
ఆధునిక అభివృద్ధి, హింస-ప్రతిహింస,
పర్యావరణం,హిందుత్వవాదం, అమర్త్స్యసేన్, ఉద్యమాల విలువలు-ఆచరణ ఇలాంటి అనేకానేక అంశాలపై మన దృక్పధాన్ని విశాలం చేస్తాయి ఈ వ్యాసాలు.
"మనుషులకన్నా వేరే ఎది
ముఖ్యమన్నా అనుమానించాల్సిందే" అంటారు బాలగోపాల్ పర్యావరణం విషయాన్ని చర్చిస్తూ.
ఆయన ఆలోచనలకు మనిషే కేంద్రం. అందులోనూ అత్యంత బలహీనమయిన సమూహాలూ, అత్యంత అన్యాయానికి గురయిన ప్రజల
పక్షాన నిలవడం మన అతి
ముఖ్య బాధ్యత గా భావిస్తారు ఆయన
.
మన ఆలోచనలను ఒక సక్రమ మార్గంలో పెట్టగల సత్తా ఈ
పుస్తకానికి ఉంది. మార్క్సిజం తో ఆయనకు కొన్ని పేచీలుండవచ్చు, కానీ ఆయన
ప్రాపంచిక ధృక్పథం స్థూలంగా మార్క్సిజమేనని ఈ పుస్తకం చదివితే మనకు అర్ధం అవుతుంది.
అమర్త్స్యసేన్ ఆలోచనలు మనకు పూర్తిగా అనుసరణీయమా?కాదా? అని వామపక్ష ,ప్రజాతంత్ర వాదులకు చాలా మీమాంస ఉంది.
ఆయన ఆర్ధిక విధానాలలో సరళీకరణనూ, ప్రపంచీకరణనూ సమర్ధించడమే ఇందుకు కారణం. అయితే భారత
పాలకులు అనుసరిస్తున్న సరళీకరణ ప్రపంచీకరణ విధానాల గురించి అమర్త్స్యసేన్ విశ్లేషణ జాగ్రత్తగా చదివితే ఆయన ఆలోచనలతో మనం తీవ్రంగా విభేదించవలిసింది ఏమీ లేదంటారు బాలగోపాల్.
"ఒకరుపోతే వేలమంది పుట్టుకొస్తారు అని నినాదాలు ఇస్తాం.
అది వాస్తవం కాదని మనకూ
తెలుసు"
అంటారు బాలగోపాల్ ఒక వ్యాసంలో. బాలగోపాల్ మాటలు మనకు
కరుకుగా ఉండవచ్చు. ఆయన చెప్పే వాస్తవాలు అలాంటివి మరి.
చట్ట సభలలో చాలా
పట్టుదలగా స్త్రీ హక్కుల గురించి ఆందోళన చేస్తున్న పార్టీలు- తమ అధిష్టానంలో స్త్రీలకు ఒక్క శాతం స్థానాన్ని కూడా కల్పించకపోవడాన్ని తన వ్యాసంలో ప్రశ్నిస్తారాయన.
ఇది కాకతాళీయం కాదనీ, ఒక సామాజిక పోకడ అనీ బాలగోపాల్ అభిప్రాయం. సామాజిక న్యాయం అనే భావనకు సంబంధించి అందరూ మాట్లాడేది ఒకటీ,
చేసేది ఒకటీ అని
చెప్తూ
"హిపోక్రసీ" అనేది నేటి సామాజిక లక్షణమైపోయిందని అంటారు బాలగోపాల్.
"గోవధ
నిషిధ్ధమట,
కానీ గోవులు మేత లేక
చస్తే ఫరవాలేదట" అని ఎగతాళి చేస్తారు ఒక వ్యాసంలో. హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు బస్తీలను నిర్మూలించాలని ఆలోచనను చేసేవారిని వైస్రాయ్ హోటల్ సంగంతేంటని ప్రశ్నిస్తాడు. "మనమిట్లా ఎందుకైపోయాము అనే ప్రశ్నకు జవాబు వెదికేటప్పుడు సామ్రాజ్యవాదాన్నీ, పెట్టుబడిదారీ వ్యవస్థనీ నిందిచటం పరిపాటి. ఈ రకమైన విశ్లేషణ బాహ్య పరిస్థితులను వివరించడానికి బాగానే పనికి వస్తుంది. కాని మనుషులు బాహ్య పరిస్థితుల ప్రభావాన్ని అచేతనంగా స్వీకరించరు. మన వ్యక్తిత్వం, మన
సంకల్పం మనకుంటాయి పరిస్థితులెంతగా దిగజారుస్తే అంతగా దిగజారడానికి మనుషులేమీ మరబొమ్మలుకాదు.అయినా మనం
ఎందుకింత వికృతంగా తయారవుతున్నాం? వద్దని ఎందుకు అనుకోలేకపోతున్నాం?" అని వేదనతో ప్రశ్నిస్తారు ఒక వ్యాసంలో. బహుశా ఆయనకు తారసపడిన ఇలాంటి ఉదాహరణలే మానవ ప్రవృత్తి మీద దృష్టి సారించేందుకు దోహదం చేసాయేమో. ఒక
గతం నుంచి సార్వజనీనమైన విలువలకు వెళ్ళినా,
ఒక విలువను ప్రతిపాదిస్తూ ఒక ఘటనను చర్చించినా స్పష్టతలో మాత్రం ఎలాంటి లోటూ రాదు.
సామాజిక జీవిగా తాను దృష్టి పెట్టిన వివిధ అంశాలలో అసమ్మతివాదిగానే ఉంటూ వచ్చిన బాలగోపాల్ అభిప్రాయాలు ఈ వ్యాసాలలో వ్యవస్థ పట్లనే కాక విప్లవ వాదుల విషయంలో, పౌరహక్కుల గురించిన చర్చలో స్థానికం నుండి,అంతర్జాతీయం వరకూ అన్ని అంశాలలో కనిపిస్తాయి. ఈ వ్యాసాలలో అనేకం పూర్తి నిడివి వ్యాసాలుగా రాసి ఉంటే
బాగుండుకదా అనికూడా మనకు అనిపిస్తుంది. మనకి
తెలిసి,
చదివి రాసిన విషయాలను కొత్తకోణంలో విడమర్చి చెపుతాయి- ప్రశ్నలు వేసి ఆలోచింపచేస్తాయి ఈ
వ్యాసాలు.
"ఇందులో రాసేందుకేముంది" అని అనుకునె విషయాలలొ కూడా జీవితం, సమాజం పాత్ర ఎంతో ఉందని సమర్ధంగా తెలియచెప్పగలరు బాలగోపాల్.
ఇందులోని వ్యాఖ్యలన్నీ సమగ్రమైనవీ మనం తప్పక ఏకీభవించేవనీ కాదు. విషయ పరిశీలనా దృష్టీ,
పరిశీలించే పద్ధతీ,
తన పరిశొధనలో తేలిన ఫలితాలను నిస్సంకోచంగా ప్రకటించే విధానం, కొత్త ఫలితాలెదురైనప్పుడు భేషజం లేకుండా సవరించుకోగల సంసిధ్ధత అనే నాలుగింటిగురించీ మనమందరం తెలుసుకోవాలి.
ఇందులో ఉన్న వ్యాసాలు చాలా మంది వ్రాయలేనివీ, వ్రాయ సాహసించలేనివి కూడా.
సమానత్వం,
సామాజిక న్యాయం తప్ప ప్రమాణం లేకపోవడం వల్లా, స్వార్ధం, ఈర్ష్యా, భయం లేని
వారు కావటం వల్లా, ఎవరైనా ఎమైనా అనుకుంటారేమో, ఫలానా వారు
దూరమవుతారేమో ఇత్యాది తంటాలు లేని వారు
కావటం వల్లా మాత్రమే ఆయన ఇలా రాయగలిగి ఉంటారు బహుశా. ఏదయినా సంక్లిష్టమైన సందర్భం ఎదురయినప్పుడు "ఆయన ఈ
విషయమై ఏం మాట్లాడతారో చూద్దాం" అని
సమాజంలోని వివిధ శ్రేణులు ఎదురు చూసేంతగా తననితాను రూపు దిద్దుకున్నారు బాలగోపాల్.
ఆకలి కేకలలో వ్యాకరణం వెతకకూడదు. కడుపు మండి
అడిగే ప్రశ్నలు కరకు గానే
ఉంటాయి.
ఆయన వ్యాసాలు సూటిగా, నిర్భయంగా వక్ర నీతిని ఎండగడతాయి.
సమాజంపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి గొంతు వినాలనుకునే ప్రతీ ఒక్కరూ తప్పక చదివితీరాల్సిన వ్యాసాల సంకలనమే ఈ "నిగాహ్" అనే
పుస్తకం.
Post a Comment