అయామ్ మలాలా - మలాలా యూసఫ్జాయ్ విత్ క్రిస్టినా లాంబ్.

సింహాల గుంపుతో ఒక లేడి పిల్ల కత్తి యుధ్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా!!..
 తూటాలు గర్జించే తుపాకుల మధ్య ఒక శాంతి కపోతం రెక్కలు విప్పార్చి ఎగిరితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించారా?
       పాకిస్తాన్ స్వాత్ లోయలో ఎగిసిపడ్డ ఒక పదిహేనేళ్ళ విప్లవ కెరటం , ఆడపిల్లలు చదువుకోవాలంటూ అక్షర పోరాటం చేస్తోంది. ఇప్పుడా శాంతికపోతం వెన్నులో బుల్లెట్లు నాటుకున్నాయి. "మలాలా ఎవరు ?" అంటూ ప్రశ్నించి ఆమె పై బుల్లెట్ల వర్షం కురిపించిన తాలిబన్ల బారినుంచి ఆత్మస్థైర్యం తో  చావుని జయించి " నేనే మలాలా " అంటూ రెట్టించిన ధైర్యం తో ప్రపంచం ముందుకు వచ్చిన ఒక అద్భుత బాలిక జీవితం నెల మీకు పరిచయం చేయబోతున్న " అయామ్ మలాలా" పుస్తకం.
         స్వాత్ వ్యాలీ ! పాకిస్తాన్ లోకెల్లా అందమైన ప్రదేశం! ప్రశాంత జీవితం గడిపే ప్రజలుపచ్చదనం పరుచుకొన్న లోయలూ, హోరున జారే జలపాతాలకు నెలవునాణ్యమైన పచ్చలవంటి ప్రకృతి సంపదలకు నిలయం! కానీ ఇదంతా 2007 ముందు వరకే.  తాలిబాన్ల ఆధీనం లోకి రావడంతో అందమైన స్వాత్ లోయ మృత్యులోయగా మారిపోయింది.  2007 నుంచి  స్వాత్ లోయ బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. రాకెట్ లాంచర్ల  , తుపాకీ కాల్పుల మోతల మధ్య  క్షణాన ఏం జరుగుతుందో అర్ధం కాని అయోమయం.   అంతా భయం భయం. ఎటుచూసినా భీతావహ దృశ్యాలేఎప్పుడు ఎవరికి కాలం చెల్లుతుందో తెలియని పరిస్థితి వైనమంతా కళ్ళకు కట్టినట్టు అయామ్ మలాలా పుస్తకం లో మనకు వివరిస్తుంది మలాలా.
   "కఠినమైన షరియత్ చట్టాల మాటున నాగరికత ముడుచుకుపోయింది" అంటుంది మలాలాఅర్ధం పర్ధం లేని తాలిబన్ల ఆదేశాల నడుమ మానవత్వం మాయమైపోయిందిఆధునికత భయంతో పారిపోయింది. అక్కడ పాటలు వినకూడదు. సినిమాలు చూడకూడదుతాలిబన్లకేం తోస్తే అదే నిబంధన.   అన్నింటికంటే ముఖ్యమైన నిబంధన స్త్రీలకు స్వేచ్చ ఉండకూడదనేదిఅక్కడ  ఆడపిల్లలు చదువుకోకూడదు. మార్కెట్ కి వెళ్ళాలన్నా, అంతెందుకు అసలు  బయటికి వెళ్ళాలన్నా అడుగడునా ఆంక్షలు. ప్రజలంతా తాలిబన్లు ఆదేశాలు  శిరసావహించాల్సిందే . ఎవరైనా ఎదురు తిరిగితే అంతే సంగతులు. బహిరంగంగా తలలు నరకడం వంటి తాలిబాన్ల దురాచారాలు  మలాలా మాటలలో చదువుతున్నప్పుడు మన మనసు కన్నీరై కరిగిపోతుంది నిప్పురవ్వై మరిగిపోతుంది .
       తాలిబాన్ల అరాచకాలు, నిరంకుశత్వం రాజ్యమేలుతున్న సమయంలోనే స్వాత్ లోయలోని మింగోరా పట్టణం నుంచి ఒక లేత గొంతు తాలిబన్లకు వ్యతిరేకంగా నినదించింది. అమ్మాయిల హక్కుల పై గళమెత్తింది. " ఇది మా స్వాత్ లోయ, మా లోయ ని ఎందుకు పాడుచేస్తున్నారు? అమాయక ప్రజలను ఎందుకు హింసిస్తున్నారు? మా భవిష్యత్తుని ఎందుకు నాశనం చేస్తున్నారు? రాక్షస  పంజా ఇంకెన్నాళ్ళు?"  అంటూ ఆవేదనతో ప్రశ్నించిందిఆమే మలాలా యూసఫ్జాయ్.
       " సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. ఇప్పుడు నన్ను కాల్చిన తాలిబన్ నా ఎదురుగా వచ్చినిలబడినా అతడిని నేను క్షమిస్తాను" అంటుంది మలాలా. గాంధీజీ, మార్టిన్ లూథర్కింగ్, మదర్ థెరిసాలు ఆమెకి ఆదర్శం. చదువుకునే హక్కు కోసం తాలిబన్లనెదిరించి మరోజన్మ నెత్తిన మలాలా చరిత్ర పుటలకెక్కింది. అక్టొబర్ 9, 2012 వరకు పాకిస్తాన్ కి చెందిన మలాలా ఎవరో ప్రపంచానికి తెలియదు. రోజు తాలిబాన్లు ఆమెపై దాడిచేయడంతో ఒక్కసారిగా ఆమె పేరు వెలుగులోకి వచ్చిందిమలాలా అంటే అర్ధం బాధాసర్పద్రష్ట- పేరుకి తగినట్లే ఆమె చిన్న వయసులోనే కొండంత కష్టాన్ని భరించింది. గాయాలను తట్టుకొని ధైర్యం గా ప్రపంచం ముందుకి వచ్చి " అయామ్ మలాలా" అంటూ మనందరికీ స్ఫూర్తినిచ్చింది. స్వాత్ లోయకి చెందిన మలాలా తండ్రి ఒక అభ్యుదయ కవి. కుషాల్ పబ్లిక్ స్కూల్ పేరు తో ఆయనకు అనేక పాఠశాలలున్నాయి. ఆఫ్ఘన్ కి చెందిన ప్రముఖ రచయిత్రి మలాలాయి పేరుని ప్రేమతో తన కూతురికి పెట్టుకున్నారాయన. మలాలా ఆశయం డాక్టర్ కావాలని. కానీ తండ్రి కోరిక మేరకు సమకాలీన రాజకీయ అంశాలపై చిన్న వయసు లోనే పట్టు సాధించింది మలాలా.    
        ఒక రోజు అబ్దుల్ హైకాకర్ అనే ఒక బి.బి.సి. ప్రతినిధి మలాలా తండ్రిని కలుస్తాడు. తాలిబన్ల ఆంక్షల మధ్య స్కూల్ కి వెళ్ళే ఒక ఆడపిల్ల మనోభావాలు ఎలా ఉంటాయి - అన్న విషయం మీద ఒక కార్యక్రమం చెయ్యాలని అతని ఆలోచన. ఒక అమ్మాయి తన దైనందిన జీవితాన్ని డైరీ రూపంలో రాస్తే దాన్ని తమ బ్లాగ్లో పెట్టాలని బి.బి.సి. ఆలోచన. మలాలా తండ్రి తన స్కూల్లో చదువుతున్న విద్యార్ధినులనందిరినీ విషయమై అడుగుతాడు. అయితే తాలిబన్లకు భయపడి ఎవరూ అందుకు సాహసించరు. విషయం తెలుసుకున్న మలలా తన తండ్రి వద్దకు వెళ్ళి తానే రాస్తానని చెపుతుంది.   తండ్రి అంగీకరించడంతో మలాలా తన ఆశలకూ, ఆవేదనకూ అక్షర రూపం ఇవ్వడం మొదలు పెడుతుంది.
        అసలు పేరు తో రాస్తే ప్రమాదం కాబట్టి, "గుల్మకాయ్"(మొక్కజొన్న పువ్వు) పేరుతో బ్లాగ్ లో తన అనుభవాలను పంచుకుంటుంది. జనవరి తొమ్మిది 2009 మొదలైన డైరీ నెల రోజులలోనే ప్రపంచ వ్యాప్తంగా మేధావుల , సామాజిక కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తం గా సంచలనం సృష్టించింది. ప్రపంచంలో అనేక ప్రముఖ పత్రికలు దీనిని ప్రచురించడం మొదలు పెట్టాయి. డైరీ ఎవరు రాస్తున్నారనే విషయాన్ని తాలిబాన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. " నేను స్కూలు కి వెళ్ళే ప్రతీ రోజూ, ఇదే చివరి రోజు అనుకుంటూ వెళ్ళేదాన్ని , ఎందుకంటే నా  ఉనికిని ఎక్కువ రోజులు గుల్మకాయ్ తో కప్పిపుచ్చలేనని నాకు తెలుసు" అంటుంది మలాలా. చివరికి ఆమె అనుకున్న రోజు రానే వచ్చిందితాలిబన్ల కన్నా ముందు ఆమె ఉనికిని తెలుసుకున్న మీడియా ప్రపంచం తన వ్యాపార ప్రయోజనాలకోసం ఆమె ఉనికిని ప్రపంచానికి వెల్లడించేవరకూ నిద్ర పోలేదు.  
        దీనితో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. 2010 సంవత్సరం లో పాకిస్తాన్ దేశం మలాలా స్ఫూర్తి దేశ యువజనులకు ప్రేరణనివ్వలనే ఉద్దేశ్యంతో  యువజన శాంతి బహుమతిని మొట్టమొదటిసారిగా ప్రకటించింది. అవార్డుకు తొలిగ్రహీతగా ఆమెని ఎంపిక చేసింది. అంతే కాక అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి కి కూడా ఆమె నామినేట్ చేయబడింది. ఇది తాలిబాన్లకు మరింత కంటగింపు అయ్యింది. ఆమెను ఎలాగయినా హతమార్చాలనీ పన్నాగం పన్ని, ఆమె ఉన్న స్కూల్ బస్సు పై దాడి చేసి అతి సమీపం నుంచి ఆమెను గాయపరచారుతీవ్ర గాయాలపాలై పాకిస్తాన్ నుంచి మెరుగైన చికిత్సకోసం ఇంగ్లాండ్ వెళ్ళిన ఆమెను ప్రపంచ ప్రజానీకం ఆకాంక్ష , ప్రేమపూర్వక ఆశీస్సులు తిరిగి మన ముందు సజీవం గా నిలబెట్టాయి. ఆమె తన పదహారవ పుట్టిన రోజునాడు ఐక్యరాజ సమితి లో చేసిన ప్రసంగం ప్రపంచానికి అద్భుతమైన ప్రేరణ నిచ్చింది.
        ఇంగ్లాండ్ రచయిత్రి క్రిస్టినా లాంబ్ తో కలిసి మలాలా రాసిన "అయామ్ మలాలాపుస్తకం ప్రతీ పేజిలోనూ ఆమె ఆశలూ, కలలూ, అక్షరాలపై ఆమెకున్న అనురక్తీ అణువణువునా కనిపిస్తాయి. పాకిస్తాన్ చరిత్రా చెపుతూనే, తాలిబాన్లకు సంబంధించి ప్రపంచానికి తెలియని అనేక విషయాలు పుస్తకం తో వెలుగులోకి తెచ్చింది మలాలా. "Before the Taliban" అంటూ మొదలు పెట్టిన పుస్తకం  "Between Life and Death" అంటూ ముగుస్తుందివీటి మధ్య తాలిబాన్ల నిరంకుశత్వానికి బలయిన ఎందరొ మహిళల గాధలతో పుస్తకాన్ని నింపివేస్తుంది మలాలా.  ప్రేమించిన పాపానికి తాలిబాన్ల చే మరణ శిక్ష విధించబడ్డ మలాలా స్నేహితురాలు 'సీమకథ చదువుతుంటే మనకు కన్నీరు ఆగదు. స్వాత్ లోయలో " స్వర" అనే సాంప్రదాయముందిరెండుతెగల మధ్య తగవు పరిష్కారానికై ఒక తెగ వారి అమ్మాయిని మరొక తెగకు ఇవ్వాలి తెగలో పురుషులు అమ్మాయిని తమ సుఖాలకు వాడుకుంటారుప్రభుత్వం నిషేధించినా దురాచారం ఇప్పటికీ స్వాత్ లో కొనసాగుతోంది  అంటుంది మలాలా.

        ప్రపంచం అంతా అసహ్యించుకుంటున్నా తాలిబాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఎక్కడో ఒక చోట ఎదో ఒక రూపం లో మహిళా లోకాన్ని అణగదొక్కుతూనే ఉన్నాయి. విద్య, సాంస్కృతిక , సామాజిక రంగాలలో , ఎదగనీయకుండా చేస్తూనే ఉన్నాయి. ప్రగతిశీలమయిన భావ స్వేచ్చను అణచివేస్తూనే ఉన్నాయి. కానీ ప్రపంచం చూస్తూ ఊరుకోదుఅలాంటి వారి దురాగతాలకు చెక్ పెట్టడానికి వువ్వెత్తున ఎగసిపడే కడలి కెరటాల్లాంటి మలాలాలు పుడుతూనే ఉంటారు . సాటి మహిళలకు అండగా నిలుస్తూనే ఉంటారు.
                        స్వేఛ్ఛ కోసం పోరాటం,
                        చదువు కోసం ఆరాటం,
                        బురఖాల వెనుక అణుచుకున్న ఆవేశాలు,
                        నిత్య జీవితపు నరకాలు,
                        లోకానికి కనబడని కోణాలు,
                        వీటి మధ్య
లేత గుల్మకాయ్ విచ్చుకుంది.
మలాలా,
                        అడ్డంకులు చేధించు
                        వివక్షల సంకెళ్ళు తెంచు.
హక్కులకై ఉద్యమించు
                        రేపటి రోజు నీదే,
                        ఇందరి ఊపిరే నీ శ్వాస
మా కళ్ళలో పొంగే ఆశలే నీ ఆయుష్షు,
                        పదుగురి కోసం కొట్టుకునే నీ గుండె,
                        ఉద్యమాల మోతలో మోగే  డప్పు.
                        రోజు నువ్వు రాసిన మాట,
                        కావాలి ఎందరికో స్ఫూర్తినిచ్చే బాట..

No comments