మెలకువ సందర్భం --- కె. సత్యవతి
ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉంది అంటే- కొందరు కొన్ని వందల ఏళ్ళ పాటు కుట్రలు చేసి తమకు అనుకూలం గా మలుచుకున్నట్లు ఉంది. అడ్డం గా ఒక గీత గీసినట్లుగా, మెట్లు మెట్ల నిచ్చన లా ఉంది. అలాటి ఈ గీతల, నిచ్చెన మెట్ల సమాజాన్ని ఉన్నది ఉన్నట్లు గా పరిశీలించి, ఇలా ఉండడం పరమ తప్పు అని గ్రహించి సంస్కర్తలు, మేధావులు దానిని మార్చడానికి ప్రయత్నించారు. తెలుగు నేలపై అలాంటి గ్రహింపు తో ప్రారంభం అయిన స్త్రీవాద సాహిత్యోద్యమం కోసం, తన జీవితం లో అత్యంత విలువైన సంవత్సరాలను వెచ్చించిన, ఇంకా వెచ్చిస్తున్న రచయిత్రి కొండవీటి సత్యవతి. సాధారణంగా స్త్రీ వాదుల రచనలు అనగానే "ఫెమినిస్టు పాఠాలు చెప్పే పాత్రలు" అనే ఒక అపోహ చాలామందికి ఉంటుంది.. అయితే అందుకు ధీటైన సమాధానం సత్యవతి గారి రచనల్లో మనకు దొరుకుతుంది. సత్యవతి రచనల్లో పాత్రలు ఆమె చేయి దాటి ఎప్పుడూ నడవవు. కధ గాని పాత్రలు గానీ ఆమె ఎంపిక చేసుకున్న సిద్ధాంతాన్ని అనుసరించి ఆమె చెప్పిన మార్గంలోనే ప్రయాణిస్తాయి. కేవలం స్త్రీ ల గురించేకాక, సమాజం లో అన్ని సమస్యల గురించి వివిధ రకాల మనుష్యుల మధ్య వారి సంభందాల చుట్టూ అల్లిన భావజాలం తో చాలా స్పష్టం గా ఉంటాయి ఆమె రచనలు.
అలాంటి విశిష్టమైన విలక్షణమైన కధల సమాహారం... ఈ నెల మీకు పరిచయం చెయబోతున్న "మెలకువ సందర్భం " కధల సంపుటి. ప్రతీ మనిషి లోనూ నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని ఒక బలమైన సంఘటనా సృష్టి ద్వారా తట్టి లేపి మెలకువ తెప్పించే ప్రయత్నమే ఈ "మెలకువ సందర్భం " కధల సంపుటి. ఈ సంకలంనంలో మొత్తం 12 కధలు ఉంటాయి. ప్రతీ కధలోనూ
ఒకానొక సమకాలీన సమస్యని ప్రస్తావించి దానికి తనదైన శైలి లో పరిష్కార మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు సత్యవతి.
మొదటి కధ "విందు తర్వాత". కధ అంతా శ్రీనగర్ మిలిటరీ కేంప్ చుట్టూ నడుస్తుంది. తీవ్రవాదుల సమస్య గురించి, ఎన్‌కౌంటర్ లూ, కూంబింగ్ ఆపరేషన్లూ, కిడ్నాప్‌ల గురించి వివరంగా చర్చిస్తారు రచయిత్రి. రెండు దేశాల శతృత్వం మధ్య, తీవ్రవాదుల మధ్య సామాన్య ప్రజలు ఎలా నలిగి పోతున్నారో మనకి అర్ధం అవుతుంది. అలాంటి ఒక కూంబింగ్ ఆపరేషన్ లో ఒక అమాయక కుటుంబం మొత్తం చనిపోవడం , ఆ కుటుంబంలో మిగిలిన పసిపిల్లవాడు అన్వర్ని మిలిటరీ అధికారి తీసుకువచ్చి పెంచుకోవడం కధావస్తువు. అమాయకుల్ని పొట్టన పెట్టుకుని, అవే రక్తపు చేతుల్తో వాళ్ళ బిడ్డని పాప పరిహారం గా పెంచుకొవడం... తన అమ్మా, నాన్న, చెల్లెల్ని చంపిన వాడే తనను సాకుతున్నాడని ఆ పిల్లవాడికి తెలియక పోవడం ఎంత ఘోరం అనే ప్రశ్నతో కధని ముగిస్తారు సత్యవతి. ఈ కధ మనలో ఎన్నో ప్రశ్నల్ని లేవదీస్తుంది. తప్పొప్పులకి సంభందించిన సందిగ్ధం లోకి పాఠకుల్ని నెట్టివేస్తుంది.
రెండవ కధ "గూడు". వాస్తవానికి దగ్గరగా లేని ప్రభుత్వ పధకాలు, నిరుపేదల జీవితాల్లో సృష్టించే కల్లోలాన్ని మనసుని కదిలించేలా చెప్తారు ఈ కధలో. ఇందిరమ్మ పధకం కింద ప్రభుత్వం ఒక తండాకి ఇళ్ళు శాంక్షన్ చేస్తుంది. అయితే ముందు పునాదులు వేస్తే కదా ప్రభుత్వం మిగిలిన డబ్బులు ఇచ్చేది. ఆ పునాదులు వేయడానికి ఆ నిరుపేదలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలా అని వదిలేద్దాం అంటే కళ్ళముందు ఊహల్లో కదలాడే పక్కా ఇల్లు.... వీటి మధ్య నలిగిపోయే నిరుపేదల జీవితాలను చదువుతుంటే మన మనసులు బరువెక్కుతాయి. ఆ నిరుపేద తండా కష్టాలు మనల్ని ఆశాంతం కదిలించేస్తాయి. దరిద్రం భీకర రూపాన్ని, ఆకలి నగ్నత్వాన్ని మన కళ్ళకు కట్టినట్లు నిలబెడతారు సత్యవతి. ప్రభుత్వ పధకాలు సచివాలయం లోని కొందరు అధికారుల బుర్రల్లోంచి కాక అట్టడుగు స్థాయి ప్రజల వాస్తవ జీవితాల లోంచి రూపు దిద్దుకుంటే బాగుండని మన అందరికీ అనిపిస్తుంది ఈ కధ చదివాక.
మరొక అద్భుతమైన కధ పాలపుంత. ఇందులో మధుర పాత్రని నిర్మించిన శైలి అద్భుతం గా ఉంటుంది. "సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది. దాన్ని గుర్తించడం లోనే ఉంటుంది మన తెలివంతా" అంటుంది మధుర ఒక సందర్భం లో. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల్ని కూడా మరిచి పోయేంత అనుకూల దృక్పధం మదుర పాత్రలో తొణికిసలాడుతూ ఉంటుంది. అందువల్లే తనలాగే ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన, వయసులో తనకంటే చిన్నవాడైన యువకుడితో సహజీవనం చేయడం కోసం సన్నద్ధమవుతుంది. ఆత్మ విస్వాస ప్రతీక గానే కాక జీవితపు ఆర్ద్రమైన కోణం కూడా ప్రతిబింబించేటట్లు సృష్టించిన మధుర, నందూ పాత్రలు మన మనసుల్ని ఒక పట్టాన వదిలి పెట్టవు. "ఎగసి పడిన కెరటం " కధ మొత్తం ఉద్వేగ భరితమే. రచయిత్రి స్వగతం తో మొదలు పెట్టిన ఈ కధ.... అందులో కధానాయకి వసంత కళ్ళు చెమర్చినప్పుడల్లా మనం కూడ అప్రయత్నం గా కళ్ళు తుడుచుకునేటట్లు చేస్తుంది. అంతగా మన మనసుని కట్టి పడేస్తుంది ఈ కధ. మనకి తెలియకుండానే మనం కూడా అనసూయత్త జీవితం లోకి వెళిపోతాం.. సంఘర్షణ కి లోనవుతాం. పరిష్కార మార్గం కోసం తెలియకుండానే వెతకడం మొదలుపెడతాం...
మరో కధ "సౌదర్యీకరణ హింస". ఇందులో విశాల మానవత్వం.. మనిషితనం పై లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యం గా అనిపించినా సామాన్యమైనవి కానే కాదు. కనీస వసతులు కరువైన జీవితాల వైపు దృష్టిసారించమనే విషయాన్ని చర్చకు పెట్టడం తో పాటు, అభివృద్ధి నినాదం తో ముందుకు సాగుతూ ప్రభుత్వాలు ఏ వాస్తవకోణాల్ని విస్మరిస్తున్నాయో స్పష్టం గా చెప్తారు రచయిత్రి మనకి. మన లక్ష్యం కోసం గొత్తెత్తడం మినహా వేరేమార్గం లేదని నిర్ణయించుకున్న విశాల తన భర్తని సైతం ఎదిరించడం తో కధ ముగుస్తుంది. "నగరాన్ని సౌందర్యీకరిస్తున్న వాళ్ళ దృష్టికి ఆనని వాళ్ళు.. రోడ్ల వెడల్పుల్లో ఇళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు.. గుడిసెలోళ్ళు.. సౌందర్య హింసకి బలవుతున్న ఈ జనం మనుష్యులు కాదా.. అద్భివృద్ధి జరగాలంటే బుల్డోజర్ వీళ్ళ గుండెల మీదనించి నడవాల్సిందేనా " అని సూటిగా ప్రశ్నిస్తారు సత్యవతి. "చీకట్లోంచి చీకట్లోకి " లో ఊర్మిళ పాత్ర ఆచారవ్యవహారాలను.. వ్యవస్థలోని లోపాలను తప్పని సరై కప్పిపుచ్చుకుని జీవిస్తూ ఉంటుంది. పైకి నోరెత్తక పోయినా లోలోపల ఆమెలోని సంఘర్షణ నేటి కుటుంబ వ్యవస్థలోని చాలామంది స్త్రీ ల జీవితాలతో మన సరి పోల్చుకోవచ్చు. ఏ భర్త క్షేమం కోసం అయితే తాను అనారోగ్యం గా ఉన్నా వ్రతం చేస్తుందో అదే నాగలచ్మి భర్త చేతుల్లో చనిపోవడం మనల్ని కదిలించి వేస్తుంది..
"మెలకువ సందర్భం" కధ... ఇదే ఈ సంకలనం కి శీర్షిక కూడా. ఈ కధ మనలో రేపే సంఘర్షణ అంతా ఇంతా కాదు. పెళ్ళికి ముందు ఎన్నో ఆదర్శాలని ఉదాత్తమైన జీవితాన్ని కలగా చూపించిన రమేష్, పెళ్ళి అయ్యాక తననో వ్యక్తి గా కాక కేవలం భార్యగా చూడడం తట్టుకోలేక పోతుంది అరుణ. ఈ కధ చదివినప్పుడు "అభ్యుదయం ముసుగులో అణాకానీ బుద్ధులు.. ఏ విప్లవాలు తెస్తారో, ఈ ఫ్యూడల్ ప్రభుద్ధులు.." అన్న పద్మలత కవిత మనసులో మెదులుతుంది. ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యులైన ఎందరో మహిళలు తమని తాము అరుణ పాత్రలో ఐడెంటిఫై చేసుకునేంత గొప్పగా ఉంటుంది ఈ కధ.
"ఐతే" కధలో జానకి పాత్ర స్త్రీవాద ప్రతీక. ప్రేమ రాహిత్యంలో బతుకు వెళ్ళమార్చలేక పెనుగులాడుతున్న స్త్రీలకు ప్రతీక. తాను ఇష్టపడిన బాలసుబ్రహ్మణ్యం తో 60ఏళ్ళ వయస్సువచ్చినా, జీవితం పంచుకోవడానికి సిద్ధపడుతుంది. ఆ నిర్ణయం వెనుక ఆమె జీవితం అంతా పడిన సంఘర్షణ అంతా మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు కొండవీటి సత్యవతి. కధ చదివాక.. పురుషుడి వైపే అన్ని వేళలా మొగ్గు చూపే సమాజ వ్యవస్థ మనకి అర్ధం అవుతుంది. పురుషుడి లోపాలను కూడా సహించగలిగిన ఈ వ్యవస్థ, స్త్రీ కి మాత్రం నీతి సూత్రాలను వల్లించడానికి ఎందుకు సిద్ధపడుతుందో అర్ధం కాక మన మనసు వేదన పడుతుంది. పరిస్థితులను ఎదిరించే తెగువ జానకి ప్రదర్శించి, దానివల్ల ఎదురైన కష్టాలను ఎదుర్కొని, ఒక్క కూతురు తప్ప తనకు ఎవరూ అండ నిలవని పరిస్థితి లో సైతం ఆత్మవిస్వాసం తో తాను కోరుకున్న జీవితం లోకి అడుగు పెడుతుంది.. స్త్రీ వాద ఉద్యమం లేవనెత్తిన అంశాలు, ఉద్యమించిన సందర్భాలు, స్త్రీ స్వేచ్చ కోసం ఎడతెరిపిలేకుందా జరుగుతున్న చర్చల నేపధ్యం "ఐతే" కధ.
"హం చలేంగే సాథ్ సాథ్.." కలిసి జీవించడానికి ముందే చర్చించుకోవడం, జీవన సాఫల్యాన్ని సాధించుకున్న దిశగా పయనించడం స్పష్టం గా కనిపిస్తుంది.
" మెలకువ సందర్భం " సంకలనం లో ప్రతీ పాత్రా.. సానుకూల దృక్పధం తో ఉవ్వెత్తున ఎగసిపడే చైతన్యం తో మన కళ్ళముందు నిలపడినట్లు ఉంటుంది. ప్రత్యేకంగా స్త్రీ పాత్రని సత్యవతి సృష్టించిన తీరు అపురూపం. ఈ కధల్లోని స్త్రీలు పిరికి గా ఉండరు. సర్దుకుపోయే తత్వం కాక ప్రశ్నించడడం నేర్చుకున్న నవయువతులు. సామ్యవాదాన్ని నమ్మి నెత్తిన పెట్టుకుని తిరిగి, ఆశ నిరాశ అయిన తర్వాత విడివడి మొత్తం గా ఏకమైన ఉద్యమాలు దళిత, స్త్రీవాద ఉద్యమాలు. మహిళలలో అస్తిత్వ చైతన్యం మొదలవగానే అనేకమంది తీవ్రస్థాయిలో గొంతెత్తారు. అలాంటి సమయం లో స్త్రీల నుంచి విరివిగా రచనలు వెలువడ్డాయి. అయితే మిగిలిన అస్తిత్వ వాదుల లాగే స్త్రీ వాదం లోనూ, వస్తువుదే పై చేయి అయి, శైలీ, శిల్పాలు వెనక పడ్దాయి. అయితే కొందవీటి సత్యవతి గారి కధలకి ఈ విషయం లో సంపూర్ణం గా మినహాయింపు ఇవ్వవచ్చు. అందుకు నిదర్శనం గా "మెలకువ సందర్భం " లో ప్రతీ కధనీ మనం చెప్పుకోవచ్చు. ఆమె కధల్లో స్త్రీ పాత్రలు ఆత్మ వశ్వాసం తో, ఆత్మగౌరవం కోసం, స్వేచ్చ కోసం, తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలిగే తెలివైన స్త్రీలు.
ఈ కధలు చదివేటప్పుడు, ఈ సంఘటనలన్నీ మన చుట్టూ రోజూ జరుగుతున్నవే అనిపిస్తుంది. అరే! మనం ఇలా ఎదిరించలేకపోయామే అనే సంఘస్ర్షణ ప్రతీ ఒక్కరి లోనూ మొదలవుతుంది. ముఖ్యం గా ప్రతీ కధనీ ముగుంచిన తీరు అద్భుతం గా ఉంటుంది. ప్రతీ కధలో ముగింపూ మన ప్రతీ ఒక్కరిలో నిద్రాణం గా ఉన్న శక్తినీ తెగింపునీ నిద్ర లేపుతుంది. మనం ఆత్మవిమర్శ చేసుకునే అవసరాన్ని కలుగచేస్తాయి. సమాజం లో నేడున్న పరిస్థితుల్లో మన జీవితాలు బాగుచేసుకోవడమె కాదు. తోటి స్త్ర్రిల బ్రతుకుల్లో కూద ఆత్మవిశ్వాసం తొంగి చూదాలనీ.. అందుకు మనం అంతా ఏదో ఒకటి చెయాలనే తృష్ణ ను మనలో కలుగ చెసే ఈ కధలు ప్రతీ ఒక్కరూ చదివి తీరవలసినవి
Post a Comment