ఒండ్రు మట్టి - ఓ తీర గ్రామం - యేభై యేళ్ళ కధ - నల్లూరి రుక్మిణి
ఏ కాలం లో అయినా సామాజిక పరిమాణాలను సాహిత్యకరించరడం రచయితకు పెద్ద సవాలు. అయినా నిత్య చలలనశీలమయిన సమాజ పరిణామాన్ని పట్టించుకోని , వ్యాఖ్యానించని రచయిత ఉండరు. ఒక చారిత్రక గతిలో ముఖ్యమయిన మలుపుల వద్ద ఒక నిర్దిష్ట కాలపు చారిత్రక , రాజకీయార్ధ పరిణామాలను చిత్రించిన ' మాలపల్లి ' ' ప్రజల మనిషి ' వంటి గొప్ప నవలలు అందించిన సాహిత్య నేపధ్యం మనకి ఉంది. ఎన్నో సంచలనాలకు కేంద్రమయిన తెలుగు సమాజం అంతే అద్భుతమయిన సాహిత్యాన్ని సృజించింది. అలాంటి ఒక సమకాలీన సామాజిక రాజకీయ నేపధ్యంలో నడిచే నవల నల్లూరి రుక్మిణి వ్రాసిన 'ఒండ్రుమట్టి ' .
" ఒకప్పుడు ఊరికి ఇప్పుడు ఊరికి తేడా ఉందిరా ! అప్పుడు భూములున్నాయి కానీ డబ్బు లేదు. అందరూ ఆ జొన్న సంకటే.. కాక పోతే వాళ్ళు రెండు పూటలా తిన్నారు. మేం ఒకపూట టిన్నాం. అప్పుడందరూ ముతక గుడ్డలే. ఇప్పుడు ఊరు అట్టా ఉందా? వాళ్ళకు ఒక్క వరన్నమేనా.. అందులోకి ఎన్ని రకాలొచ్చినయ్! వాళ్ళ ఆడాళ్ళు రకానికొక కోక కడుతున్నారు. మనం ఇప్పటికీ అదే గంజి అన్నం. అదే చాలీ చాలని గుడ్డలు." ఇదీ ఈ నవలలో తాత తన మనవడకి చెప్పే ఒక మాట. ఒండ్రుమట్టి నవలలో రచయిత స్థూలంగా చర్చించే విషయమిదే. గత శతాబ్దంలో మన దేశంలో చాలా అభివృద్ధి జరిగింది. కానీ అది ఎలాంటి అభివృద్ధి అంటే ఉన్న వాళ్ళను మరింత ఉన్నవాళ్ళను లేని వాళ్ళను మరింత దిగజార్చిన అభివృద్ధి.
నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి? కాలం చెల్లిన సాంప్రదాయాలను దురభిప్రాయాలను కుల దురహంకారాన్ని తొలగిస్తూ సమ సమాజం స్థాపింపబడాలి. అదీ అభివృద్ధి అంటే. కానీ ప్రస్తుత సమాజం మరింత వెనుకబాటుతనం లోకి వెళ్తోంది. ఒక వర్గం వారు కింద వర్గం వారిని ఊచకోత కోయడానికి ఈ అభివృద్ధి ఎలా ఆయుధంగా పని చేసిందో మనం కారంచేడు ఘటనలో చూసాం. అసలు అభివృద్ధికి మూలం ఏమిటన్న ప్రశ్నను అన్వేషించుకుంటూ కారంచేడు లాంటి అనేక ఊర్లకి ప్రతీక అయిన కృష్ణాపురం అనే ఊరిని నేపధ్యంగా తీసుకుని సాగిన కథనం ' ఒండ్రుమట్టి ' నవల .
కృష్ణాపురం ఒక తీర గ్రామం. అన్నీ మెట్ట పంటలే. జమీందారు ప్రాభవాలు తగ్గుతున్న రోజులవి. కోటయ్య , గంగమ్మ ముగ్గురు సంతానం . తిరుపతయ్య, పరమయ్య, వెంకయ్యలు. నవలంతా ఈ కుటుంబం చుట్టూ ఏభై సంవత్సారలపాటు తిరుగుతూ "క్విట్ ఇండియా" ఉద్యమం నుండి నేటి ప్రపంచీకరణ ఫలితాల వరకూ మన కళ్ళముందు పరిచేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కుటుంబం జరుగుబాటు కష్టమై ముందుగా పరమయ్య ఆ వెనుకాల తిరుపతయ్యలు తెలంగాణాలో ఒక పల్లె రాకూరు వెళ్ళి అక్కడి అటవీ భూములు సాగులోకి తెచ్చుకుంటారు. ఇంక ఇక్కడ ఊర్లో కూడా వెంకయ్య పొలంలో సాగు నీటి వనరులు అందుబాటులోకి రావడం, పొగాకు కొత్త పంటగా రావడం కొంత అభివృద్ధికి దారి తీస్తుంది.
కాలవల కింద వ్యయసాయం , ఆదాయంలో మిగులుని సృష్టించడం మొదలు పెట్టి , క్రమంగా మార్కెట్ విస్తరణ మన సమాజాన్ని సమూలంగా కదిల్చివేసిన క్రమం మనం ఈ నవలలో గమనించవచ్చు. బకింగ్‌హాం కాలువ రావడం.. బండ్లు ఓడలైనట్లు పంటలు బాగా పండడంతో ఆ చిన్న గ్రామానికి విశాల ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటాయి. మరోవైపు జాతీయోద్యమ రాజకీయాలు, కమ్యూనిస్టు చైతన్యమూ ఆ ఊరిని తాకుతుంది. జమిందారీ కోటలు బీటలు వారి వాటి స్థానంలో కొత్త ఆధిపత్య వర్గం బుసలు కొట్టడం మొదలు పెడుతుంది. ఫలితంగా సమాజపు అన్ని పొరల్లోనూ ప్రకంపనలు మొదలౌతాయి.
ఒకప్పుడు కాణీలు కనపడని రోజుల్లో కృష్ణాపురం లో కనిపించిన సమిష్టితత్వం.. 50 సం..లు గడిచేటప్పటికి కాలక్రమంలో సంపద ప్రదర్శనగా ఎలా తయారయ్యిందో రచయిత రుక్మిణి మనకు కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు. అందుకు ఉదాహరణగా ఊరిలో ఏటా జరిగే ఏరువాకను ప్రస్తావిస్తారు ఆమె. అంతా సవ్యంగా గడచినా ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన ఏరువాక ఇప్పుడు పతనమైన జమిందారీ వ్యవస్థకు, ఎదుగుతున్న ఆధిపత్య వర్గానికి మధ్య ఎలాంటి పోటీ అయ్యిందీ మనకి అర్ధం అవుతుంది. కాలక్రమంలో చితికిపోయిన జమిందారు జనతా పార్టీకి, మార్కెట్ అవకాశాల్ని డబ్బుగా మార్చుకుని భూస్వామి అయిన వెంకటాద్రి నాయుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారు. జాతీయోద్యమంతో ప్రభావితులైన మధ్య తరగతి యువకుల్లో మన కోటయ్య రెండో కొడుకు పరమయ్య ఒకడు. పురోగామి రాజకీయాల వైపు నడచిన యువకుడు పరమయ్య. తరువాతి కాలంలో అతను గొప్ప కమ్యూనిస్టు అవుతాడు. ప్రపంచ యుద్ధం ఫలితంగా పొగాకు ధరలు పడిపోవడం.. అతివృష్టి రైతుల కష్టార్జితాన్ని నీళ్ళపాలు చేసి అప్పులు మిగల్చడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణా లో నిజాం సాగర్ డ్యాం కింద కారు చౌకగా దొరికే పొలాలౌ ఇక్కడి రైతులలో ఆశలు కలిగిస్తాయి. సాహసం చేసి వలస వెళ్ళిన రైతులలో పరమయ్య కూడ ఒకడు. కుటుంబాన్ని ఒడ్డున చేర్చడం కోసం రాత్రంబగళ్ళు గుట్టలు చదును చేసి కండలు పిండి చేసుకుంటాడు. ఇక పరమయ్య తమ్ముడు వెంకయ్య కొడుకులను బాగా చదివిస్తాడు. పరమయ్య పంపిన డబ్బులతో వెంకయ్య కొడుకు విదేశాలకి వెళితే, చిన్న కొడుకు భాస్కరం ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చిన ధనిక రైతుల ప్రతినిధిగా అవతారం ఎత్తుతాడు.
పరమయ్య మాత్రం తెలంగాణా రైతాంగ పోరాటానికి సారధ్యం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో భాగమౌతాడు. రాజ్యహింసను అనుభవిస్తాడు. ప్రజల మనిషిగా రాటు తేలుతాడు. అతని కొడుకు చంద్రం అతని చైతన్యాన్ని అందిపుచ్చుకుంటాడు. ప్రజల కోసం బతకడంలో ఉన్న తృప్తిని ఆ తండ్రీ కొడుకుల పాత్ర చేత చక్కగా చెప్పిస్తారు రచయిత్రి. మొదట కేవలం బతుకు తెరువు కోసమే నిజాం పోయిన రైతులు కాల క్రమంలో దొరికినంత భూమిని సంపాదించుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడూ చూడనంత డబ్బు పోగు పడడం మొదలయ్యి కృష్ణపురం రైతుల్ని నడమంత్రపు సిరి ముంచివేస్తుంది. అనాయాసంగా పోగడుతున్న సంపద ఆధిపత్య పోకడకు అరాచకత్వానికి దారితీస్తుంది. తమ ఆధిపత్యాన్ని కింది కులాలపై అవకాశం కల్పించుకుని మరీ ప్రదర్శించడం మొదలవుతుంది.
ఇటుపక్క మార్పు అగ్రవర్ణాల వారినే కాదు.. మట్టి మనుష్యులని వారు భ్రమ పడుతున్న వారినీ ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు ఆధిపత్య వర్గానికే పట్టణం దారి తెలిసేది. కాలక్రమంలో కూలీ నాలి కోసం వెళ్ళిన బలహీన వర్గాలకి కూడా విశాల ప్రపంచపు పోకడలు అర్ధం అవుతాయి. వాళ్ళూ పిల్లల్ని చదివించుకోవడం, వారికీ కొంత భరోసా.. మరికొంత ధైర్యం మొదలవుతాయి. తమ అవ్వ తాతల్లాగా.. తమ తల్లి తండ్రుల్లాగా మట్టి ముద్దల్లాగా కాకుండా మనుష్యులుగా బతకాలనే తపన నవతరం లోనూ మొలకెత్తుతుంది.
ఒక వైపు కొత్తగా వచ్చిన ఆధిపత్యాన్ని అనుభవించాలని దూకుడుగా ఉన్న నయా భూస్వామ్య వర్గాలు, మార్పులు తమ జీవితాల్ని సుఖమయం చేయడానికే తప్ప అణగారిన ప్రజల జీవితాల్ని సుఖపెట్టడానికి కాదనుకునే ఫ్యూడల్ శక్తులూ.. మరో వైపు గతంలో మాదిరి అవమానాల్ని సహించి ఊరుకోలేని జ్ఞానం పొందిన పీడిత వర్గాల కొత్త తరాలు.... ఇంకేముంది!! అసలు ఘర్షణ మొదలవుతుంది. ఈ నేపధ్యం లో కృష్ణాపురం లో కూడ కమ్యూనిష్టు రాజకీయాలు ప్రజల్ని సంఘటితం చేసి నిమ్న వర్గాలకు అండగా నిలుస్తాయి. జీతగాళ్ళ వ్యవస్త రద్దవుతుంది. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా అట్టడుగు కులానికి చెందిన వారు అగ్రకులాల అహంభావంపై మొదటి దెబ్బ కొడతారు. దళితులకు భూమి పంచడంలో కమ్యూనిష్టు ఉద్యమం సఫలీకృతం అవుతుంది. అయితే ప్రజలను మహోజ్వల పోరాటాల వైపు కదిలించిన కమ్యూనిష్టు పార్టీ కాలక్రమంలో పోరాటాల్ని పక్కన పెట్టి ఎన్నికలలో దిగడం... పీడిత ప్రజలకు నాయకత్వం లేకుండా పోవడం ఇవన్నీ రచయిత చాలా కన్విన్సింగ్‌గా చర్చిస్తారు.
ఈ క్రమంలోనే కొత్త తరానికి దిశానిర్దేశం లేక వారి మనసులు లేవనెత్తే ప్రశ్నలకు పోరాట రూపం లేకుండా పోతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన కమ్యూనిష్టు పార్టీ ప్రజా ఉద్యమ క్షేత్రం లోనూ నీరసిస్తుంది. అదే సమయంలో పీడిత వర్గాలలో అణుచుకున్న సంఘర్షణ రాడికల్స్ రూపంలో భగ్గుమంటుంది. అది ఆత్మగౌరవ చైతన్యంతో పాటుగా ఆయుధం పట్టిచ్చే తెగువనూ ఇస్తుంది. నిత్యం అవమానాలతో వేగిపోతున్న అత్యంత పీడిత వర్గాల పిల్లలు అన్యాయాన్ని ఎదిరించి దెబ్బకి దెబ్బ సమాధానం ఇవ్వాలని అనుముంటారు. ఇటు పక్క తూలలేని సంపదతో ఏదైనా కొనగల భూస్వాములు ఈ సంఘర్షణ మొగ్గలోనే తుంచేయాలనుకుంటారు. ఇంకేముంది... కృష్ణాపురం మాదిగపేట బూడిద కుప్పవుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కృష్ణాపురం కధగా చెప్పబడిన కారంచేడు కధ. కారంచేడులాంటి అనేక గ్రామాల కధ. అభువృద్ధి వికృత రూపాన్ని మన ముందు ఉంచే కధ. చివరిగా రచయిత్రి రుక్మిణి చంద్రం పాత్ర చేత మనకి ఇలా చెప్పిస్తారు. "ప్రవాహ సదృశ్యమైన సమాజాన్ని, కాలాన్ని ఏ వ్యక్తీ ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దానికింద నలిగి పోవాల్సందే. ఇప్పటికి వారిదే పై చేయి కావచ్చు. కానీ భవిష్యత్తు ప్రజలదే".. ఆ తరువాత ఏం జరిగింది? ప్రపంచీకరణ.. ఉదారవాద ఆర్ధిక విధానాలు ఎలాంటి మార్పుల్ని తీసుకువచ్చాయి? వర్గ పోరాటాలు ఏదారికి వెళ్ళాయి?. సమాజం ఎలాంటి మార్పు దిశగా పోతోంది? ఇలాంటి ఆశక్తి ఈ పుస్తకం చదివాక అందరికీ కలుగుతుంది.
సరుకుల మార్కెట్ మన సమాజంలో తీసుకొచ్చిన మార్పులను, రాజకీయ సంచలనాలు కూల్చివేసిన సామాజిక సంబంధాలను, అనేక పరిణామాలు ఇముడ్చుకున్న కీలకమైన ఒక అర్ధశతాబ్దపు కాలాన్ని నాలుగు వందల పేగీలలో రక్తమాంసాలతో సజీవంగా మన ముందు ఉంచే ప్రయత్నం చేసారు రచయిత నల్లూరి రుక్మిణి. ఒక స్పష్టమైన శాస్త్రీయ దృక్పధంతో సంవత్సరాల తరబడి గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ప్రతీ ఊరినీ పరిశీలించి వ్రాసిన అరుదైన నవల "ఒండ్రుమట్టి".
ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో "లేమిజరబుల్స్" నవల ముందుమాటలో ఇలా అంటారు- " ఈ లోకంలో అన్యాయం, అక్రమం, పేదరికం, దోపిడి ఉన్నంత కాలం.. అలకాపురుల లోని కుబేరుల పక్కనే నరక కూపలలో నరులు నివసించినంత కాలం.. ఇలాంటి పుస్తకాల అవసరం ఉంటుంది." ఒండ్రుమట్టి నవల ముందు మాటలో జి.కళ్యాణ రావు గారు కూడా ఇవే మాటల్ని ప్రస్తావిస్తారు. నవల చదివాక మనల్ని కూడా ఇవే ఆలోచనలు చుట్టు ముట్టేస్తాయి. భూమి చుట్టూ అల్లుకున్న జీవితం, చరిత్ర ఒకదానితో ఒకటి పెనవేసుకుని చెప్పిన వర్తమానం ఈ "ఒండ్రుమట్టి " కధ. నిజం... ఇది బతుకు కధ. బతుకు చెప్పిన కధ.
Post a Comment