#ZindagiNaMilegiDobara

జిందగీ లంబీ నహీ, బడీ హోనీ చాహియే బాబూ మొషాయ్!!!.. అంటాడు రాజేష్ ఖన్నా ఆనంద్ సినిమాలో. 
ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు. ఎలా జీవించామన్నదే అసలు విషయం.
కొంత తాత్వికత మనస్సుని తాకినప్పుడల్లా... ఇవన్నీ అందరికీ అనుభవం అయ్యే ఆలోచనలే.
అయినా ప్రాపంచిక విషయాలు, అందులో హాయిలు, నొప్పులూ... వెలుగు నీడలంత సహజంగా మనల్ని కమ్మేస్తున్నప్పుడు, ఈ "ఉన్నదొకటే జిందగీ" కాన్సెప్టుని ఎడం కాలితో తన్నేస్తాం.
ఎంత చిన్న కష్టమైనా, అదే ఇంక ఆ జీవితానికి అత్యంత అవసరమైన విషయంలా... అదే మన జీవన్మరణ సమస్యలా కృంగి పోతాం. కానీ చిన్నా పెద్ద కష్టానికీ.. ప్రపంచం ఆగిపోదు.
అసలు ఆ మాటకొస్తే.. మన కష్టమే మనకి శాశ్వతం కాదు. అలాంటిది ఈ ప్రపంచానికి ఏమూలకి !. నిజం చెప్పండి.. బయట జరుగుతున్న అనేక రకాల సుఖదుఃఖాలకి మన స్పందన ఎంత కంటిన్యుటీతో ఉంటోంది.??
అంటే ఈ ప్రపంచపు ఏ సమస్యా మనకి శాశ్వతమైనది కానప్పుడు... మన సమస్య మాత్రం ఎదుటి వాళ్ళకి అంత శాశ్వతమైనది ఎలా అవుతుంది !!
మూవ్ ఆన్ యారా... 
ఏడుస్తూ.. నవ్వుతూ.. అడ్డం వచ్చిన ముళ్ళని పక్కకి నెట్టుకుంటూ... మన దారి మనమే వేసుకుంటూ…
మై తెరేలియే హీ సాత్ రంగ్ కి సప్నె చునే.. 
.. అంటూ ఎవరూ కలలు పరుచుకుని కూర్చోరు నీకోసం.
ఇక్కడ నీ కలలు నువ్వే కనాలి.
ఒకటో రెండో అడుగులు నీ దుఃఖం తో కదులుతాయ్. ఆ తర్వాత నీ భుజం ఓదార్పుగా ఒక మారు తట్టేసి ఇంక ఆగిపోతాయ్.
ఆ తర్వాత నీ జీవితం నీదే. ఏడుస్తూ కూర్చున్నా... తట్టుకుని ముందుకు వెళ్ళినా.. అదింక నీ జీవితమే.
అందుకే బాబూ మొషాయ్!!
జిందగీ లంబీ నహీ, బడీ హోనీ చాహియే. ప్రతీ క్షణం జీవించు. అనంత సంభ్రమాశ్చర్యాల అనుభూతులూ.. అలజడులూ నువ్వే అనుభవించు. ఎవరూ అనుకరించడానికి సాధ్యం కానంత గొప్ప జీవితం జీవించు. నీ జీవితాన్ని ఒక దీపంలా రెండు చేతుల్లో పొదుపుకుని నెత్తి మీద పెట్టుకుని.. ఆ వెలుగులో నీ ముందున్న దారిని నువ్వే సరి చూసుకో..
నీకంటూ ఉన్నది ఒక్కటే జీవితం… మరి నీ సంతోషానికి నెలవుగా ఉండే అవకాశమూ నీకు మాత్రమే సొంతం. జీవితాన్నే ఒక దాహంగా మార్చుకుని చూడు… దప్పిక తీర్చడానికి నీకు నువ్వు సన్నద్ధమై ఉన్న సంగతి తెలిసి వస్తుంది.
నీకు నువ్వే ఒక పూలతోట. అక్కడ రాలే ఆకులే కాదు. పూసే పువ్వులూ ఉంటాయ్… మరి స్వచ్ఛపరిమళమంటే కష్టాన్ని దాటి వచ్చిన సుఖానిదే.

No comments