ఇంటి వైపు - Afsar Mohammed

నీలి నీలి చాయలో మాయ చేయని మబ్బుల్లో
నిటారుగా నిలబడి 
ఆకాశంలో వొక్కటంటే వొక్కటే సారి బిగ్గరగా ఏడ్చుకొని
వచ్చేయ్
ఆ వచ్చే దారిలో నువ్వుంటావ్
...
యెవరినీ వంచించని నువ్వు
మరీ ముఖ్యంగా
నిన్ను నువ్వు వంచించుకోలేని
నువ్వు-
Afsar Mohammed
"ఇంటి వైపు"
పుస్తకం అట్టమీద ఒక పిల్లవాడు. చిన్నవాడో పెద్దవాడో అర్ధం అయికానట్లు..
ఆ భుజాలమీద రెండు సీతాకోక చిలుకలు.
మనకి చెప్పకుండానే చెప్పే అందమైన పసి జ్ఞాపకాలు.
పుస్తకం తెరవగానే Rumi వాక్యాలు.
I am the mountain.
What i say is an echo of what you say
పుస్తకం చదవడం అయిపోయాక కూడా నాకదే ఫీలింగ్. మనలాంటి ఎంతోమంది.. పుట్టిన ఊరు. నడచిన దారులు వదిలి.. ఎక్కడెక్కడికో వెళ్ళి శరీరాన్ని అక్కడ, మనసుని మాత్రం మూలాల్లో వెదుక్కునే ప్రయత్నం చేస్తే ఎలాంటి కవిత్వమవుతుందో ఇక్కడ పరిచయమవుతుంది.
ఇక్కడ నువ్వూ... నేనూ... తనూ... ప్రతిదీ కవిత్వమైపోవటమే పరిచయమవుతుంటే...
ఇదిగో.. ఆ ఇంటి వైపు నడుస్తున్నా...
నడుస్తూ నడుస్తూ... పోగొట్టొకున్న అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నా...
ప్రతీ అక్షరంలోనూ పసితనం లాంటి స్వచ్ఛత. అంతలోనే "మన్ను తిన్నావా" అని అడిగిన యశోదమ్మకి చిన్ని కృష్ణుడు బుజ్జి నోరులో విశ్వాన్ని చూపించినట్లు అంత సామాన్యమైన అంత అందమైన పదాల్లో జీవితాన్ని మొత్తం చూపించి...
వాహ్.
పుస్తకం అంతా అఫ్సర్ అన్నయ్య సంభాషణే.ఎక్కువసార్లు తనలో తాను.. కొన్ని సార్లు "తనతో" కొన్ని సార్లు మనతో.
తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు.. తాను ఎంతగానో మిస్ అవుతున్న బాల్యం వీటన్నింటినీ మించిన ఒక అస్తిత్వ వేదన, ఒక నిరాకార తత్వం.. ప్రతీ అక్షరంలోనూ కనిపించి, కురిపించి అంతలోనే ఉధృతమైన ప్రవాహంలో మనల్ని ముంచేసి లాక్కుపోతుంది.
ప్రతి వాక్యంలో ఒక సూఫీ తత్వం... 
ఒక తీవ్రమైన సంవేదన....
మన ఇంటిని మనం వెదుక్కుంటూ వెళ్ళేలా చేసే మృదువైన అమృతం లాంటి అక్షరం... 
సూటిగా మనసులోకి దూసుకుపోయేటంత పదునుగా పదం వెంట పదం...
ఒక్క మాటలో చెప్పాలంటే.. "ఇంటివైపు" అంతా సర్వైవలెన్స్ గురించిన ఒక వేదన. కొన్ని చోట్ల ఒక డైలమా.. వదులుకోలేని ప్రేమ.
మూలానికి దూరమైన ఒక మనిషి మనసుని మెత్తగా.. కర్కశంగా కోసిపారేసే ఒక లాంటి దిగులు. హోం సిక్‌నెస్...
ఒక్క సారి పుస్తకం పట్టుకుంటే చాలు... మన చేయి పట్టుకుని ఈ 'ఇంటివైపు' కి లాక్కుని వెళుతుంది.
అవును... ఇది తెలుగు కవిత్వపు లోగిలి... లోపలంతా జీవితపు లోతుల్లోకి నెమ్మదిగా నడిపించుకుని తీసుకుని వెళ్ళే అనంత తత్వం
అసలు చెప్పాలంటే ప్రతీ కవిత గురించీ చెప్పాలి.
రేగిపళ్ల వాసనలోంచి
దూరాల్ని కొలిచే మాటలు వెతుక్కుని , యెటో చెదిరిన పడవల్ని కలుపుకుని...
ఆ "ఇంటివైపు" ప్రేమగా ప్రయాణం చేసి.. 
ఒక తీవ్రమైన దుఃఖం మనతో సంభాషణ చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఒక్కసారి మీరూ చదవండి.


No comments