నా లాంటి నీ కోసం

ఒక్క దీపం చాలు 
దీపావళిని సృష్టించవచ్చంటూ 
నువ్వెంతయినా చెప్పూ… 
ఒక్క అగ్గిరవ్వను రాజేయ్యటానికీ 
నీకంటూ చెకుముకి రాళ్ళనూ ఇవ్వదు ఈ లోకం
ఎందుకంటే 
ఇదిగో… 
ఇప్పటి వరకూ నువ్వు చదివింది 
సగం మాత్రమే తెరువబడిన లోకాన్ని 
అవును… 
ఇది మిణుగురులు మాత్రమే ఆడుకునే లోకం 
నువ్వు నడిచే దారులన్నిటిలో 
మిణుగురు రెక్కలను పరిచేస్తూ 
వెలుతురంటే ఇదేనంటూ 
నమ్మించిన లోకమే ఇది
దీన్ని మార్చటానికి 
నీ శక్తీ మేరా చేసే యుద్ధంలో 
దేహంగా ముగుస్తూ 
దేశంగా మేల్కోవటం వరకే చూస్తే 
నీకు బాగానే ఉండి ఉంటుంది.
మరి ఆ తరువాత? 
మేల్కొన్నాక నిద్రపోవాల్సిందే 
అని రాసుకున్న దేశంలో 
కొన్ని రోజుల కొవ్వొత్తుల కాంతిలో 
మెరుస్తున్నానని తృప్తిపడాల్సిందే
ఎన్ని రక్తపు చుక్కలుగా కారావో 
చెప్పటానికి నువ్వుండవు కానీ 
నీ గురించి నువ్వెన్నడూ వినని కథలు 
వినటానికి లోకం తనను తాను సిద్ధం చేసుకుని 
ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటుంది
అవును మరి 
కథ లైతేనే కంచికి పంపించేసి 
తాను తన ఇంటిదారి పట్టవచ్చు కదా !


No comments