మోక్షం
తెలిమబ్బులతో దాగుడుమూతలాడుతున్న
వెన్నెల రేకల మీదుగా
సౌందర్యపు అపరిమితత్వాన్ని ప్రణవిస్తూ
నక్షత్రాల తమకాలలో జారిపడిన సవ్వడిలో
ప్రకృతికి మెత్తని చలనాన్నిస్తూ
రేయి చిక్కబడింది
పగలంతా ఎండ దుప్పటి కప్పుకున్న
దిగంతాల దివ్వెలన్నీ
తిమిర సాగరంలో కార్తీక దీపాల్లా వెలుగులీనుతూ
ఊహకందని ఊర్పులని
ప్రతి మనసులో లయం చేస్తున్నాయి
ఆనందపు కొలతలని కొత్తగా లిఖిస్తూ...
కొన్ని దూరాల దగ్గరితనపు శబ్దాలని
మృదువైన మౌనాలుగా అనువదించుకుంటూ
సుషుప్తిలోకి నడచివెళుతున్న నిరీక్షణగా
అనంత ఆకాశపు రహస్యాన్ని
వెల్లడి చేస్తుందీ రాత్రి
మోక్షమంటే ఇదేనేమోననిపిస్తూ
Post a Comment