If I had a hammer...


ప్రతి విప్లవానికి ఏదో ఒక మొదలు ఉంటుంది. ఇంతకూ ముందు ఏమీ అనలేదు కాబట్టి… మనసులో ఏమీ అవమాన పడలేదు అని కాదు.  లోలోపల లావా ఉడుకుతూ దాని సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చి మొత్తాన్నీ మసి చేసేస్తుంది. అప్పుడెప్పుడో ఏమీ అనలేదు కాబట్టి ఈ రోజున మాట్లాడ కూడదు అనుకుంటే… ఈ ప్రపంచం ఈ రోజున ఇలా ఉండేదే కాదు.

ఇప్పుడైనా మొదలు పెట్టినదుకు సంతోషిద్దాం. ఈ ఒక్క మనిషితో ఆపేది కాదు ఇది. పాతవీ కొత్తవీ అన్ని లెక్కలూ సవరిద్దాం. ఏం? చెయ్యలేమా? ఎందుకు చెయ్యలేం. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఫియర్ ఆఫ్ సోషల్ డిఫీట్ ?   మన వ్యక్తిత్వాలకీ… మన స్త్రీత్వాలకి ఎవరో కొలమానాలిచ్చే స్థితిలో మనం లేము ఇప్పుడు.

ఏదైనా ఒక ఇష్యూ రాగానే, మేమన్న ఉద్దేశ్యం వేరు మా ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు అనే ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాల్సింది ఒక్కటే… మీలో ఎంత మంది స్త్రీని కూడా (కనీసం మీ ఇంట్లో స్త్రీ ని అయినా) మీలాంటి ఒక మనిషిగా చూస్తున్నారు?

అసలు గత 80 ఏళ్లుగా ఎంటర్టైన్మెంట్ కి పవర్ఫుల్ మీడియా అయిన సినిమాల్లో జండర్ ఈక్వాలిటీ ఏ మేరకు ఉంది? భావ స్వేచ్ఛ పేరుతో హీరోయిన్ ని నలుగురి మధ్యలో   ఏమే… ఒసే… అంటూ పిలిచే హీరోయిజం సమాజానికి ఏమి నేర్పుతున్నట్లు?

ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నటుడేమో… ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి… కడుపన్నా చెయ్యాలి అంటాడు. ఆ తరువాత అసెంబ్లీ లో క్షమాపణ చెప్తాడు. ఇంకొకరేమో పబ్లిక్ గా అడ్డమైన వాగుడూ వాగుతాడు. తరువాత తప్పుగా అర్థం చేసుకున్నట్లు ఉన్నారు క్షమించండి అంటాడు. ఎన్నాళ్ళు ఈ  క్షమాపణలని  విని విజయం సాధించాం అని మురిసి పోతాం?   ఈ క్షమాపణ లే విజయమా? సమాజం మనల్ని రిసీవ్ చేసుకునే పధ్ధతి మారాల్సిన అవసరం లేదా?

ఇక రోజువారీ టీవీ కార్యక్రమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అనిపిస్తుంది. కామెడీ పేరుతో అసహ్యమైన బూతు స్కిట్స్,  ప్రతి స్కిట్ లోనూ అవమాన పడేది ఆడవాళ్లే. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్లే విలన్స్.

ఒక నటుడని కాదు… కీర్తి శేషులైన లెజండరీ నటుల నుండి… ఈనాటి పిల్ల నటుల వరకూ ఇదే వరస. ఏ ఆడియో ఫంక్షన్ చూసినా లేడీ యాంకర్స్ మీదనో, హీరోయిన్స్ మీదనో ఏదో ఒక సెటైర్. ఏమైనా అంటే వాళ్ళతో ఉన్న చనువుకొద్దీ అంటుంటాము అంటూ ఉంటారు. చనువు ఎంతైనా ఉండవచ్చు. కానీ పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్ ఫంక్షన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మాటలు సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఎవరైనా ఆలోచిస్తున్నారా? సినిమాల్లో 2 గంటల సేపు అడ్డమైన సంభాషణలూ రాసి...తీసి… చివరి 10 నిమిషాల్లో ఆడది దేవత అన్నంత మాత్రాన మహనీయులైపోతారా ఎవరైనా?

ఆడవాళ్లంటే గౌరవం అని చెప్పే ఈ నటులు ఎవరైనా కానీ, వాళ్ళ వాళ్ళ సినిమాల్లో ఆడవాళ్ళని కించపరిచే సంభాషణలు కానీ, వాళ్ళని అసభ్యంగా చూపించే దృశ్యాలు కానీ ఇంతవరకూ లేవని చెప్పగలరా? ఇక ఆడవాళ్ళు కూడా, తమని కించ పరిచేలా ఉన్న  టీవీ షోస్ కి ఆడియన్స్ గానో పార్టిసిపెంట్స్ గానో వెళ్లి, వాటిల్లో పాల్గోవటం వల్ల తమ ప్రోగ్రామ్స్ కి మహిళల ఆదరణ ఉందని చెప్పుకునే అవకాశం ఇచ్చినట్లు అవ్వదా?

నటులనే కాదండీ… మన జనాలు జనాలు కూడా ఎలా తయారయ్యారంటే… మనవాడు చేస్తే ఒప్పు… పరాయివాడు చేస్తే తప్పు. ఇదే వరస ప్రతీ చోట. ఈ ‘మన' అనేది ఉందే ఇంతకంటే సమాజానికి చెరుపు చేసేది ఇంకొక్కటి లేదు. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు రాయాల్సిందే. అది మన చేతుల్లోనే ఉంది. అది సినిమానే కానీ, టీవీ సీరియల్ యే కానీ ఆడవారిని కించపరుస్తున్న ప్రతి దాన్నీ చూడకుండా బహిష్కరించలేమా? సినిమాకి కలక్షన్స్. టీవీకి టీఆర్పీ రేటింగ్స్… ఇవి లేకుంటే అవి ఎందుకూ పనికి రావు. వాటి నిర్మాతలకి చిప్పే గతి. అందరూ చూడటం మానేసాక డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి… అవే రాకుంటే  అలాంటివి తీసే సాహసాలు చేసేదెవరు?

సినిమా వాళ్ళవి, టీవీ వాళ్ళవి బాగా సెన్సేషనలైజ్ అవుతాయి కానీ ప్రతి ఇంట్లో మొదలై ఆఫీస్ లో / పని చేసే చోట కొనసాగే అఘాయిత్యాలకి… మృగత్వ పైశాచిత్వాలకి అసలు అంతూ పొంతూ దొరుకుతుందా?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్క ఉద్యమం మొదలయ్యింది. ఇది ఇక్కడ ఆగితే… ఇలాంటివే మరెన్నో పునరావృతం అవుతాయ్. అలా జరగకుండా ఉండాలంటే… స్త్రీని మనిషిగా గౌరవించని ప్రతి దాన్నీ బహిష్కరించాలి. స్త్రీ అంటే వినిమయవస్తువు కాదు.

ఇలాంటి వాటికి కేసులు పెట్టటంతో ఆగిపోకూడదు. ఈ రోజు కేసు పెట్టాక… మరో రెండు రోజులు పోయాక ఈ వార్త ఎవరికీ గుర్తు ఉండదు. అదే జరుగుతుంది. కేసుల సంగతి కోర్టులు చూసుకుంటాయి. ఈలోగా మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి. సాటి మనిషిగా స్త్రీకిచ్చే విలువ ఇవ్వని ప్రతిదాన్ని ప్రతిఘటించాలి. అది ఏ మీడియా లో అయినా సరే.

ప్రింట్… ఎలక్ట్రానిక్… సినిమా… టీవీ… మనమంటూ చూడటం ఆపేస్తే…? ఇంట్లో… ఆఫీస్ లో సహాయ నిరాకరణ మొదలు పెడితే? చూసేవారు లేక... చేసేవారు లేక ఎవరికీ వారు తమ పంథాని మార్చుకోవాల్సిందే. అదుపులో ఉండాల్సింది  మాటే కాదు  మనిషి… తన ఆలోచనలు కూడా. స్త్రీ అవ్వనీ పురుషుడవ్వనీ ఒకరి గురించి అనుకున్నామంటే నీకు నువ్వు ఇచ్చుకునే విలువ తనకూ ఇవ్వాల్సిందే. 
No comments