మృగత్వం

మృగత్వాన్ని ఆవాహం చేసుకున్న
మదాంశ సంభూతుడొకడు
లోకాన్నలా చుట్టేస్తూ ఉంటాడు
తన స్వాభావిక స్వరూపంపై
నవ్వుల కవచమేసుకుని

మృగ తృష్ణ అలవాటయిన ప్రవృత్తి
మనిషి రూపులో పోతపోసుకున్నప్పుడు
మన మాటకంటిన తృణీకారం
తరుముకొస్తున్న దండనలూ
ఏదీ తనకడ్డు కాదని విర్రవీగుతూ
వీరంగమాడే వెర్రి నమ్మకాన్ని వెంటేసుకుని
సంవృద్ధమైన వింత జంతువలా
ఘీంకరిస్తాడు తనకెదురే లేదని

తను తడుతున్న ఏ తలుపు మాటునో
ఒక మారణ శాసనం  ఎదురవ్వటం
యుగ యుగాల చారిత్రిక సత్యం
అవును మరి...
పుట్టుకలోనే మదమున్న చోట
కాలమెప్పుడూ తోడుగా ఉంటుందనుకుంటే...
ఊపిరిని ఊడ్చి పారేయ్యడానికి  
ఉరికొయ్యే ముందుకొచ్చేస్తుంది

మృగత్వం చిరంజీవమనుకున్న ప్రతి చోటా
మరణం మరింత ముందుగా మేల్కోవటం
కొత్తేమీ కాదు...
చరిత పుటల్లో అదెప్పుడూ చర్విత చరణమే !



No comments