మహార్ణవం


తనలో తాను నిర్మించుకున్న అంతఃపురంలో
రాణివాసపు లెక్కల తీరులో
బంధాలన్నీ తారుమారవుతూ 
ఒక స్వార్థం రెక్కతొడుగుతున్న సవ్వడిలో
 విలువల విధ్వంసపు చప్పుడు
మిళితమవుతున్నసమయపు తేమ అలికిడిది

ఒక కొత్త బాంధవ్యం పలకరించినప్పుడు
కాలం పొడుగూతా
తనను అల్లుకుపోయిన
ఒక్కొక్క బాంధవ్యాన్ని తెంచేసుకుంటున్నప్పుడల్లా
లోలోన ఆవిరవుతున్న తడి స్వరం
మొత్తంగా పొడిబారేసరికి
మనదైన మనిషి ఆచూకీ దారితప్పిపోతుంది

అప్పుడెందుకో గుర్తుకొస్తుంది సముద్రం
ఎప్పుడు కలసినా
ఎక్కడ కలసినా `
ఎన్ని నదులుగా ఉరకలెత్తివచ్చినా
అమ్మగా అక్కున చేర్చుకుంటూ
ప్రతీ వేణిని అంతర్వాహినులుగా
తనలో ఆత్మైక్యం చేసుకుంటూ
ఏకాత్మగా మారిన అఖండ అద్వైతమై ....

నిజమే కదూ.
కొత్త ప్రవాహమొచ్చిందని పాత ప్రవాహాన్ని
వెలివేసిన చరితని రాసిన మహార్ణవమింకా
పుట్టలేదన్న నిజంలో
మనిషి విలువల చరిత కాలిపోతూనే ఉంది

No comments