మరల సేద్యానికి - శివరాం కారత్


సాహిత్యం ఎలాంటిదైనా సరే.. అది కాలాన్ని అధిగమించాలి. అప్పుడే ఆ సాహిత్యం కలకాలం నిలుస్తుంది. అలాంటి కాలాతీత నవలే "మరల సేద్యానికి".

గతించి పోతున్న భారతీయ గ్రామీణ మూలాలను మన ముందుంచి, దేశభవిష్యత్తుకి ఒక గమ్యాన్ని నిర్దేశించే నవల ఇది. పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ ఏ సమాజానికైనా ఎంత అవసరమో చెప్తుంది. 
దాదాపు వందేళ్ళలో జరిగిన మూడు తరాల కధ ఇది. మొదటి తరం రామవైతాళుడు. పౌరోహిత్యం చేస్తూనే వ్యవసాయం కూడా తన ప్రధాన వృత్తిగా జీవిస్తాడు.

రెండవ తరం లచ్చడు. చదువుకోవడానికి పట్నం వెళ్ళి అక్కడి నాగరికతను నరనరాన వంటపట్టించుకుని చెడుసావాసాలకు దగ్గరై దిగజారిపోతాడు. మూడోతరానికి చెందిన, మన కధానాయకుడు రాముడు తల్లి ప్రేమతో పెరిగి చక్కగా చదువుకుని పెద్దవాడవుతాడు.


తన మూలాలను, ఉనికిని వెతుక్కుంటూ గ్రామానికి చేరుకుని ఆ పల్లెలోనే ఉండాలని తిరిగి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకోవడం క్లుప్తంగా కధాంశం. 


ఈ నవలలో ప్రకృతి వర్ణన, బిభూతి భూషణ్ వనవాసిని గుర్తుకు తెస్తుంది. 


రాముడికి సముద్రానికి మధ్య అనుభంధాన్ని శివరాం కారత్ వర్ణించిన తీరు అద్భుతంగా ఉంటుంది. తిరుమల రామ చంద్రగారి అనువాదం కూడా చాలా సహజంగా ఉంది. 


 రాముడు తన స్నేహితురాలు నోవాకి " సముద్ర సౌందర్యాన్ని" తన పెయింటింగ్ ద్వారా చూపిస్తానని ప్రామిస్ చేస్తాడు. అయితే మంగళూరులో , చెన్నై లో ఎక్కడ చూసినా రాముడికి ఆ సముద్రం తృప్తినివ్వదు.
ఎలాంటి హడావుడి లేని, ప్రశాంతమైన, ప్రకృతి నగ్నసౌందర్యాన్ని నింపుకున్న తమ ఊరి సముద్రంతో పోల్చుకుని అసంతృప్తికి గురవుతాడు. 


చివరికి తమ ఊరు వెళ్ళాక..


తన సొంత పొలంలో తాను పంచుకున్న శ్రమ.., తాను నీళ్ళుతోడిన పొగాకు తోట, తాను పండించిన పంట, అక్కడి బెస్త వాళ్ళతో సాహచర్యం....


అలాంటి ఒకానొక ప్రశాంత సాయంత్రం..


ఒక వాన కురిసి వెలసిన సాయంత్రం ..


ఒక వైపు రౌద్రం.. మరో వైపు ప్రశాంతత నిండిన "కోడి గ్రామపు" సముద్ర తీరంలో కూర్చుని.. తన స్నేహితురాలికి ప్రామిస్ చేసిన అద్భుత సముద్ర సౌందర్యాన్ని చిత్రం గా గీసి పంపిస్తాడు.


రాజధానుల పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయ భూములన్నీ కాంక్రీటు అడవుల్లా మారిపోతున్న కాలంలో, చదువుకుని, పట్నంలోని శూన్యాన్ని అనుభవ పూర్వకంగా అవగతం చేసుకుని "మరల సేయానికి" పల్లెకు తరలిన రాముడి కధ ఇది.




No comments