ఆనందానికి ఒక అడ్రస్ ఇదిగో ఇక్కడ!

“ప్రపంచమంతా ఆనందం పొంగి పొర్లి పోతోంది. దాన్ని అందుకోగలిగిన హృదయాలు వుండాలి. లోకం అంతా కాంతి వుంది. కాని కన్ను వుంటే కాని ఆ కాంతి అర్ధం కాదు. ఎంత శక్తి కలిగిన కన్ను వుంటే అంత కాంతి ఉపయోగపడుతుంది. లోకమంతా శక్తి నిండి వుంది. ఆ శక్తి ని వుపయోగపరచుకునే యంత్రాన్ని బట్టి ఆశక్తి వ్యక్తమవుతుంది. అట్లానే ఆనందం. ఆకాశం, సముద్రం, గాలి, ఇసిక, స్నేహం, తోటలు, నదులు,, కీటకాలు, పసిపిల్లలు, నవ్వు అన్నీ ఆనందమే. తెలుసుకునే హృదయం వుండాలి. ఆ హృదయానికి ఎంత శక్తి వుంటే అంత ఆనందాన్ని తీసుకోగలదు.
వెన్నెల అందరికి కాస్తుంది. వెన్నెల రాకుండా కిటికీలు మూసుకునే వాళ్ళు వున్నారు. వెన్నెల చాలదని ఎలక్ట్రిక్ లైట్లు పెట్టుకునే వాళ్ళు వున్నారు. వెన్నెలలోని ఆనందాన్ని భరించలేక గీతాల్లోకి ఆ అనందాన్నిపొల్లేట్లు చేసే వాళ్ళు వున్నారు. ఆ ఆనందం అతీతమై వాళ్ళకే తెలియని పిచ్చి బాధ లో పడిపోయే ఆత్మలూ వున్నాయి.”
అంటాడు తన “ఆనందం” వ్యాసంలో చలం.
‘నా రక్తంలో ఒక ధిక్కారం ఉంది.
దేనినీ సహించని ధిక్కారం.
ఎవరికీ భయపడని ధిక్కారం.
భయమంటే తెలియని ధిక్కారం.
ఈ ధిక్కార స్వభావమే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.’  ఇది అమ్మ మాట… ఇదే అమ్మ బాట…
అవును ఆ ధిక్కారమే మహిళల పాలిట ఆనందహేతువు అయ్యింది.
ఒక ధిక్కారం నుండి ఆనందాన్ని ఎలా విశ్వవాప్తం చెయ్యవచ్చో అమ్మ నిరూపించింది.
చలం అన్నా… అమ్మ అన్నా … వర్షం… వెన్నెల అంత ఇష్టం నాకు.
మనలో అణగారిపోయిన ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని మనకే కొత్తగా పరిచయం చేసి, లోకానికి ఒక సరికొత్త దృక్పధాన్ని ఇచ్చిన ఉత్ప్రేరకాలు వీళ్ళు.
***
“తుపాకి మొనపై వెన్నెల” పుస్తకం అందిందా అని ఫోన్ చేసినప్పుడు మొదటి సారిగా తన గొంతు విన్న క్షణం…
విజయనగరంలో కలిసినప్పుడు.. “మహీ” అని నవ్వుతూ రెండు చేతులూ చాపి నన్ను దగ్గరకి తీసుకున్న ఆత్మీయ ఘడియలూ..
04.09.2014 న తన భుజం మీద తల పెట్టుకుని అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకున్నాక ” ఇదిగో నా డైరీ ఇప్పటిదాకా ఎవ్వరికీ ఇవ్వలేదు. నీకే ఇస్తున్నా” అంటూ.. ఆనందార్ణవాన్ని నాకిచ్చిన ఆ చేతులూ…
నా జీవితంలో మర్చిపోలేని అత్యంత అద్భుతమైన జ్ఞాపకాలివి.
అలా నాదగ్గరకి వచ్చిన “ఆనందార్ణవం” ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.
దాదాపు తొమ్మిది నెలల పాటు ఆ డైరీ నాదగ్గరే ఉంది.
సంతోషంలో దుఃఖం లో ఎప్పుడూ నాతోనే ఉంది.
సంతోషం అంటే ఏంటి?  ఎలా ఉంటుంది ?  ఎక్కడుంటుంది ? ఎందులో ఉంటుంది ? ఎవరికి దక్కుతుంది ?
సంతోషాన్ని ఎలా నిర్వచించాలి ?  ఎక్కడ వెతకాలి ?
అసలెందుకు సంతోషం? సంతోషం లేకపోతే ఏమవుతుంది ?
అది దొరక్క పోతే దుఃఖమేనా ?
సంతోషానికీ దుఃఖానికి తేడా ఏమిటి ?
పుస్తకం నిండా  ఎన్నో ప్రశ్నలు.
సమాధానం అమ్మ చెప్పిందా… అంటే.. ఉహూ… లేదు… ఎక్కడా చెప్పదు. సంతోషం అనే పదానికి నిర్వచనంగా తన జీవితం చూపిస్తుది. తనెక్కడ పొందగలిగిందీ మనకి చెప్తుంది.
తనతో పాటు గోదావరి గట్ల వెంట వెన్నెల రాత్రుల ప్రయాణాలు చేయిస్తుంది.
అనియమిత ప్రేమ (అన్ కండీషనల్ లవ్) ఎలా ఉండాలో చెప్తుంది.
ఇవ్వడంలో ఉన్న సంతోషం
వదులుకోవడంలో ఉన్న ఆనందం.
ఇవన్నీ తను చెప్తే తెలుసుకోవాల్సిందే.
అసలు ఆనందం ఎక్కడ ఎలా దొరుకుతుందంటే.. మనమైతే  ఏం చెప్తాం.
పదహారేళ్ళప్పుడు ఆకర్షణలో ఊహించుకుంటాం…
పాతికేళ్ళొచ్చాక ఉద్యోగంలో ఉందనుకుంటాం..
నలభైలలో సంపాదనలో వెతుక్కునే ప్రయత్నం చేస్తాం..
యాభైలలో ఆస్తిపాస్తుల్లో చూసుకోవాలనుకుంటాం..
అరవై వచ్చేసరికి విశ్రాంతితో ముడిపెడతాం..
ప్చ్.. ఎక్కడా కనిపించదు!!!
ఆనందమా నువ్వెక్కడున్నావు??
ఆనందం ఎక్కడుంది?
మద్యంలోనా, డబ్బులోనా, భోజనంలోనా,
శృంగారంలోనా, లేక…
మన రాజకీయ నాయకులు చెప్పినట్లు పదవిలోనా..
ఈ ఒక్క ప్రశ్నకి జవాబు దొరికితే, మరే ప్రశ్నకీ జవాబు వెతుక్కోనక్కరలేదు..
ఇంతకీ ఆనందాన్ని వెతికి పట్టుకోవడం ఎలా…
దాని ఉనికి.. అడ్రస్.. కధా కమామీషు ఏమిటి…
అంత వెతకక్కరలేదు..
ఆనందం మజ్జిగలో వెన్నలాగా..
పాలలో మీగడలాగా..
మనలోనే .. మన మనసులోనే కలిసిపోయి ఉంది..
చిలికి చిలికి వెలికి తీస్తామా..
వృధాచేసి పారేస్తామా…
అది మనమే నిర్ణయించుకోవాలి…
ఎనీ.. డౌట్స్????

సత్యవతి అమ్మ రాసిన ఈ  “ఆనందార్ణవం” లో ఒక్కసారి మునిగి చూడండి.
ఇరుకు భావాల్లోంచి.. విశాల ప్రపంచంలోకి ఎలా నడవాలో అమ్మ చెప్తుంది.
ప్రేమించడం అంటే ఏమిటో చెప్తుంది.
ఈర్ష్యా.. అసూయా.. ద్వేషం లేని ప్రపంచం ఉంటే అది ఎంత అందంగా ఉంటుందో కూడా మనకి చెప్తుంది.
పౌర్ణమితో పాటు అమావాస్యని ప్రేమించడం..
వెలుగుతో పాటు చీకటిని ఆహ్వానించడం…
ప్రకృతి మనకు ఇచ్చిన దాన్ని యధాతదంగా…
ప్రేమగా స్వీకరించడం….

విలువైనదేదీ సులువుగా దక్కదు.
అదే అమ్మ కూడా అంటుందిక్కడ “సంతోషాన్ని వెతికి పట్టుకోవాలంటే.. ప్రమాదాల వెంట ప్రయణం చెయ్యాల్సిందే”
ఎంత గొప్పనిజమిది. సహజ అనుభూతిలో ఒదగనిదేదైనా ఆనందాన్ని తన వెంట తీసుకుని రాదు కదా మరి.
‘ ఒక చోట ఆగిపోవడం అంటే నూతనత్వం లేకపోవడం’ అంటుంది అమ్మ మరో చోట.
అందుకే ప్రవహించాలి… నిరంతర ప్రవాహం గండుశిలల్నీ ఎంత నునుపుగా మారుస్తుందో మనకి తెలియని సంగతా యేమి?  ఒక్కసారి ప్రవాహం మొదలయ్యిందా అది చేరుకునే తీరం ఆనందార్ణవమే అనటంలో ఎలాంటి సందేహం లేదు.   అది చదివాక ప్రవహించాలనిపిస్తుంది. అలా అనిపించటమే ఇది అక్షరాలు పొదిగిన పుస్తకం కాదు జీవితం వొదిగిన కావ్యం అనుకోవడానికి ఋజువు.
పసితనంలో తనకిష్టమైన టీచర్ కోసం 30 కిలోమీటర్ల దూరపు గమ్యంతో మొదలైన తన అడుగులు ఇప్పుడు సప్తసింధువులనీ ఆనందార్ణవాలుగా మార్చే మహాక్రతువులో విశ్వవ్యాప్తమవుతున్నాయ్.
అమ్మ ‘ఒక నిలువెత్తు పసితనం… సాగరమంత ధీరత్వం… విశ్వమంత స్వచ్ఛతా పవనం’. అక్షరాల వెంట నడచి చూద్దాం రండి. ఎక్కడిది అవసరమో అక్కడ అది మనకి దొరుకుతుంది.
చివరిగా ఒక్క మాట మనం ఈ పుస్తకం చదవటం వల్ల తనకు కొత్తగా వచ్చేది ఏమీ లేదు కానీ మనకి మాత్రం మన జీవితాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోగలమన్న నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.
*

No comments