అసమర్ధుని జీవయాత్ర - గోపీచంద్.



ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే నవల. 

 ఇందులో నాయకుడు సీతారామారావు. నాయకుడంటే చాలా నవలల్లోలా ధీరోదాత్తుడూ.. సకల సుగుణాభిరాముడూ కాదు. అంతర్ముఖుడు., గోరంతలు కొండంతలు చేస్తాడు. పరిసరాలనూ.. భార్యాపిల్లలను పట్టించుకోకుండా ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే చేతకానివాడు. అసమర్ధుడు... భార్యాపిల్లలకి, సమాజానికి ఉపయోగపడే ఏ ఒక్క లక్షణమూ లేని వాడు.

అయితేనేం..!


సీతారామారావు పాత్ర మన మీద చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. 


గోపీచంద్ రాసిన "అసమర్ధుని జీవయాత్ర" కు తెలుగు నవలా సాహిత్యంలో తొలి మనోవైజ్ఞానిక నవలగా సుస్థిరమైన స్థానం ఉంది. ఈ నవలలోని ప్రధాన పాత్ర సీతారామారావు అనాటి ఫ్యూడల్ పెట్టుబడిదారి వ్యవస్థల సంధికాలం లోని వ్యక్తి.


సీతారామారావు తండ్రి, చావు మంచం మీద ఉండి, "బాబూ మన వంశం పేరు నిలబెట్టు" అంటూ కన్ను మూస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది అతని జీవన యాత్ర. మిగిలిన వాళ్ళకు మల్లే కాకుండా.. తాను ఉన్నతుడనీ, అన్నిటికీ అతీతుడననీ భావించడం మొదలుపెడతాడు. 


మామూలు జీవితంతో రాజీ పడలేకపోతాడు. 


పరిస్థితులకు అనుగుణంగా జీవించడానికి మానసికంగా సిద్ధం కాలేనప్పుడు ప్రతీ మనిషిలోనూ ఆత్మన్యూనతాభావం తొంగిచూస్తుంది. ఈ నవలలో సీతారామారావు అసమర్ధుడవడానికి దారితీసిన అనేక కారణాల్లో ఈ ఆత్మన్యూనతా భావం ప్రధానమైనది.


విభిన్న సామాజిక దార్శనికతల నడుమ ఘర్షణ సహజమనీ... వాటిని ప్రగతిశీల దృక్పధంతో అర్ధం చేసుకోవాలని... అలా కానప్పుడు సమాజంలో సీతారామారావులు తయారవుతారనీ ఈ నవల ద్వారా గోపిచంద్ హెచ్చరిస్తాడు.


నవల పొడుగునా సీతారామారావు జీవన యాత్ర ఒక ఎత్తయితే, అతని అంతిమ యాత్ర ఒక ఎత్తు. అతని తెలివి తక్కువతనం మీద, అహంకారం మీద, మౌఢ్యం మీద అతని అంతరంగమే ఎదురుతిరిగినప్పుడు... తట్టుకోలేక సీతారామారావు ఆత్మహత్య చేసుకుంటాడు. గోపీచంద్ మాటల్లో చెప్పాలంటే అతని అంతరంగం చేత అతను హత్య గావింపబడతాడు.


ఈ చివరి పేజీల వర్ణన, గోపీచంద్ తప్ప మరెవరూ రాయలేరనిపిస్తుంది.


అద్భుతమైన పుస్తకం. 


దాటెళ్ళిపోయేవాటిని ఒక కంట చూస్తూ...
అంతరించిపోతున్న వాటిని కాపాడుకోలేక
అరవలేక... అరుపులతో గొంతు కలపలేక..
ప్రేక్షక పాత్ర వహిస్తూ.. అందుకు సంజాయిషీ ఇచ్చుకోలేక
మధన పడి.. ముగిసిపోయిన ఒక "అసమర్ధుని జీవయాత్ర" ఈ పుస్తకం.

No comments