ఏమయ్యా అక్షయ్…

ఏమయ్యా అక్షయ్…
భలేవాడివే నువ్వు !
గుంపులు గుంపులుగా విలన్లూ, విశ్వపు భారం మొత్తాన్ని తమ భుజం మీద మీద మోసే హీరోలూ… తిరుగాడే వెండితెరమీద, శానిటరీ నాప్కిన్స్ ప్రధానంగా సినిమా ప్రదర్శిస్తావా? 
అసలు ఏమిటట నీ ధైర్యం? 
అసలు ఇండియన్ వెండితెర ఈ దారుణాన్ని ఒప్పుకుంటుందా?
ముగ్గురు హీరోయిన్లూ... ఆరు పాటలుగా సాగిపోతూ ప్రపంచానికి ఒక వింత వినోదపు మార్గదర్శకత్వం వహిస్తున్న ఇండియన్ సినిమా మీద నెలసరి మరకలు చిమ్మటంలో నీ విద్వేషం పాలెంత?
ఇండియన్ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ చూపించాలని నీకు ఎలా అనిపించింది?
షష్ఠి పూర్తి వయసు వచ్చేసినా ఒక్క గుద్దుతో ముల్లోకాలనీ చూపించే సూపర్మెన్లూ, బాట్ మెన్లూ, స్పైడర్ మెన్లూ పాలన చేసే రాజ్యంలో పాడ్ మాన్ అంటూ నువ్వు బయలు దేరి ఏమి ఏలదామని అనుకుంటున్నావ్?
అసలు నీకో సంగతి తెలుసా. ప్రభుత్వం దృష్టిలో శానిటరీ నాప్కిన్ ఒక లగ్జరీ. అందుకేగా వాటి మీద 12 శాతం GST వేసింది. మరి నువ్వు ప్రభుత్వం కన్నా గొప్పా ఏమిటి?
ఇంట్లోని కుటుంబ సభ్యులే పట్టించుకోని సమస్యని నువ్వేమో ప్రపంచమంతా బహిర్గతం చేసేసి ప్రపంచదేశాల ముందు ఇండియా పరువు తీస్తావా? హమ్మా!
ఎక్కడో కోయంబత్తూర్ లో ఎవరో అరుణాచలం మురుగనాథం ఆడవారి నెలసరి ఇబ్బందిని స్వయంగా అర్థం చేసుకోవడానికి ఫుట్ బాల్ ని గర్భాశయంగా చేసుకుని అందులో మేక రక్తాన్ని నింపి చేసిన ప్రయోగాలలో నీకు ఏ బాక్సాఫీస్ ఫార్ములా కనిపించిందని మీ ఆవిడనే నిర్మాతని చేసేసావ్?
***
Hats off Akshay Kumar saab!!
Big man
Strong man 
not making country strong!!
Women strong 
Mother Strong 
sister strong, 
then country strong!!
పొడి పొడి ఇంగ్లీష్‌లో మీరిలా చెప్తుంటే... 
Heart is Swelling with emotion!!
కేవలం ట్రైలర్ చూసే… గ్రామ గ్రామానా నాలుగు గోడల మధ్యన నలిగిపోతున్న ఒక సమస్య ఈ రోజున ప్రతి ఒక్కరి నోళ్ళలో నానుతుందంటే ఆ క్రెడిట్ పూర్తిగా మీదే. స్టార్ డం ని పక్కన బెట్టి మరీ మీ లాంటి ఒక సూపర్ స్టార్ ఇలాంటి సోషల్ ఇష్యూ మీద తమ స్పందనని సినిమా మాధ్యమం ద్వారా బలంగా చెప్పగలిగితే సమాజాన్ని పట్టి పీడుస్తున్న ఎన్నో సామాజిక రుగ్మతలు తగ్గిపోయే అవకాశం ఉంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. 
అక్షయ్ కుమార్ సాబ్
A big salute to you.


No comments