మహీ మ్యూజింగ్స్- 5
ఇప్పుడంటే సోమ వారం నుంచి మళ్ళీ శని వారం వచ్చేటప్పటికి కళ్ళు కాయలు కాసి ఎదురు చూసీ చూసీ నీరసం వస్తోంది కానీ చిన్నప్పుడు దీపావళి పండక్కి కొన్న టపాసులు ఆ తరువాత వచ్చే కార్తీక పౌర్ణమి దాకా కాల్చిన వాళ్ళం కాలుస్తూనే ఉండేవాళ్ళం. ఈ లోపు ఏదో అలా అమ్మ బాధపడుతుందని హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయ్యాయనిపించేలోపు సంక్రాంతి సంబరం మొదలయ్యేది.
అసలు ధనుర్మాసం రాగానే సంబరాలు మొదలు. మార్గశిరం సగాన పడుతుండగానే రేగి పళ్ళ హడావిడి.
చిత్రకొండలో మాకూ, పక్కన మూర్తి మామయ్య వాళ్ళింటికీ మధ్య పెద్ద రేగి చెట్టు ఉండేది. పొద్దున్నే దూరంగా కొండ మీద గుళ్ళో భజగోవిందం మొదలవ్వగానే ఆ చీకట్లోనే నేనూ అక్కా బయటకి పరిగెత్తే వాళ్ళం, ఇడ్లీపాత్ర ఒకరు, కుక్కరు గిన్నె ఒకరూ పట్టుకుని. ఆ మసక వెలుతురు లోనే కింద పడ్డ కాయలు రెండు
గిన్నెలు నిండా ఏరే వాళ్ళం. మళ్ళా తెల్లారేటప్పటికి ఇంకో రెండు గిన్నెల కాయలుండేవి చెట్టు కింద.
గిన్నెలు నిండా ఏరే వాళ్ళం. మళ్ళా తెల్లారేటప్పటికి ఇంకో రెండు గిన్నెల కాయలుండేవి చెట్టు కింద.
ఇన్ని ఏరినా... పగలు మళ్ళీ దోర కాయల కోసం రాళ్ళుచ్చుకుని చెట్టుకేసి చూస్తూ ఉండేవాళ్ళం.
అసలు ఏ రోజు కాయలు ఆ రోజు తినడం కన్నా... మగ్గిన కాయలతో మిశ్రో మౌసీ చేసిన వడియాలే బాగుండేవి. పుల్లపుల్లగా.. కారం కారంగా... మౌసీ చేసిన వడియాలు... హ్మ్మ్మ్మ్...
ప్రకాష్ రాజ్ లా... " ఈ జన్మమే రుచి చూడడానికి కలిగెరా..." అని పాడుకోవాలి.
ప్రకాష్ రాజ్ లా... " ఈ జన్మమే రుచి చూడడానికి కలిగెరా..." అని పాడుకోవాలి.
అసలు శీతా కాలం అంటే ఆ ఏజెన్సీ ఏరియానే.
ఎక్కడ ఏ క్వార్టర్ లొ చూసినా రంగు రంగుల చేమంతులు, డాలియా పూలు విరగ పూసేవి. ఆగస్ట్ లోనే డాలియా దుంపలు, చామంతులు బార్టర్ సిస్టం లో పంచుకునే వాళ్ళు అమ్మా, అత్తయ్యలు.( అంటే అమ్మ ఫ్రెండ్స్. ఇప్పటిలా ఆంటీలు లేరుగా అప్పుడు). చిట్టి చామంతులు, దమ్మిడీ చామంతులు… రెండు కళ్ళూ చాలేవి కాదు చూడడానికి. బంతి పూలు, చామంతులు, కారబ్బంతి పూలు… ఇవన్నీ ధనుర్మాసం కోసమే ప్రత్యేకంగా తయారయ్యి వస్తాయేమో అన్నట్లు ఉండేవి. అసలు వీటికి ధనుర్మాసమే ఆ అందాన్ని, పరిమళాన్ని తెస్తుందో లేదా ఇవే ఆ ధనుర్మాసానికి అందాన్ని ఇస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
ఇవి కాక పున్నాగ పూలు కాలనీ అంతా అటూ ఇటూ విరగ పూసేవి. సాయంత్రం అయ్యేటప్పటికి అన్నీ ఏరుకుని వచ్చి మాల కట్టడం ప్రాక్టీసు చేసేవాళ్లం. పున్నాగ పూల వాసన ఎంత మత్తుగా ఉండేదంటే... అసలు ఆ వాసన కోసం వాటికిందే కూర్చుని ఆడుకునేవాళ్లం.
అసలు ఇప్పుడా పూలు ఎక్కడున్నాయ్. ఆ వాతావరణం ఎక్కడుంది?? మొక్కలకి పూసే పువ్వులు కూడా ప్లాస్టిక్ పువ్వుల్లా జీవం లేకుండా కనిపిస్తున్నాయి.
మేం చిత్రకొండ నుండి, సీలేరు స్కూల్ బస్ లో వెళ్ళేవాళ్ళం. అడవి ప్రాంతం కదా. విపరీతమైన మంచు ఉండేది. పొద్దున్న 8 గంటలకి సూర్యుడు కొంచం వేడి చూయించడం మొదలు పెట్టగానే కొండ మీద మంచు కరిగి పెద్ద పెద్ద బంతులలాగా జారి రోడ్డు మీద పడుతూ ఉండేది. తెలతెల్లని పువ్వుల్లాగా ఆ మంచు కనిపిస్తుంటే ఎప్పటికీ ఈ శీతాకాలమే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉండేది.
స్కూల్ కి వెళ్ళే దారి పొడుగునా... పెద్ద పెద్ద చెట్లని ఒక్కొక్కళ్లం.. ఇది మాది.. అని అనుకునేవాళ్లం. ప్రతీ రోజు మన చెట్టు రాగానే.... హే నా చెట్టు అని అరవడం. దానికి ఒక పువ్వో.. కాయో... ఒక కొత్త కొమ్మో.. ఏది జరిగినా వింతే. అదో పెద్ద పండుగ.
చలి కాలంలో అన్నిటికన్నా పెద్ద పండుగ ముగ్గులు. చలికి పొద్దునే కష్టం అని అమ్మ వాళ్ళు ఇంకా అత్తయ్యలు రాత్రే ముగ్గులు పెట్టేసే వాళ్ళు. వేసిన ముగ్గు కాలనీలో రిపీట్ అవ్వకూడదు. ఏ రోజూ రిపీట్ అవ్వకూడదు. ఎంత కష్టం మరి. అమ్మ దగ్గర పెద్ద నోటు పుస్తకం ఉండేది. దాని నిండా పెద్ద ముగ్గులు. ఇవి కాక కొత్త కొత్తవి మా పలకల మీద ప్రాక్టీసు చేసేది.
శీతాకాలంలో అన్నిటికన్నా గొప్ప ఆకర్షణ.. వన భోజనాలు. నవంబర్ డిసెంబర్ రెండునెలలూ.. దాదాపుగా ప్రతీ ఆదివారం అడవిలో ఏదో ఒక మూలకి వెళిపోవడమే.. నాన్నగారూ, మామయ్యలూ పేకాటతో బిజీ. అమ్మ, అత్తయ్యలూ వంటలతో బిజీ. ఇంక మా హుషారుకు హద్దు ఉండేది కాదు. పెద్ద పెద్ద టవల్స్ అటూ ఇటూ పట్టుకుని చేపలు పట్టడం.. వాటిని చెంబుల్లో వేసి తెచ్చి ఇంట్లో నీళ్ళ కుండీల్లో వేసి పెంచడం ఒక ఎత్తయితే...
అడవిలో కోసుకొచ్చిన ఉసిరి కాయలు ఎక్కడ దాచేవాళ్ళమో.. ఎవరికీ తెలియకుండా వాటికి ఉప్పూ, కారం పసుపూ వేసి ఎక్కడ ఊర బెట్టేవాళ్ళమో.. మా అమ్మలకి ఇప్పటికీ తెలీదు. అదంతే ఒక పెద్ద రహస్యం.

ఒడిషాలో ఇన్ని సందళ్ళు ఉన్నా... ఎప్పుడు శెలవలిస్తారా... ఊరెళ్ళి కృష్ణాయ పాలెంలో ఏం చేయాలీ... గడ్డమణుగు వెళ్ళి కోడి పందాలు ఎలా చూడాలి... ఇవే కదా మన వయసుకి అప్పటి పెద్ద పెద్ద టెన్షన్లు. ఇప్పట్లా ఇన్ని చదువులూ.. ఇన్ని వ్యాపకాలూ ఎక్కడున్నాయ్.
ఆ శెలవుల కబుర్లు.. గొబ్బెమ్మలూ, అరిసెల ముచ్చట్లూ
Post a Comment