వాకిలి


అనుకున్నప్పుడల్లా
పురివిప్పి నేల మీద నాట్యమాడేలా
వర్షమొకటి స్వేచ్ఛని రాసుకునే
పచ్చందం అలముకోవాలి

తెలిమంచు అభిషేకంలో సేద తీరి  
నిదానంగా మబ్బుని కరిగిస్తూ
దివి రాసిన తడి స్పర్శ తెలిసిన గాలిలా
ఈ లోకానికంతా శ్వాసని పంచాలి

ఎప్పటికప్పుడు కావాలనిపించే
ఇంకొన్ని రంగుల్లో
నిర్లజ్జగా నిదురించే రాత్రి దేహంపై
అసలు రంగంటూమారని నీడలల్లిన
ఆనందాన్ని కప్పాలి

గాలి పూసిన ఊపిర్ల చివర
ఒక చిన్ని మొక్క నవ్వే నవ్వులో విరిసే
మనకంటూ తెలియని
జీవపు పట్టుని దొరికించుకోవాలి

ఎక్కడికక్కడ కాలాన్ని గడ్డ కట్టిస్తూ  
ప్రతి ఖాళీ క్షణంపై
మనదంటూ ఒక్క సందేశాన్ని రాసిపోవాలి
ప్రకృతి వాకిలి ముంగిట
రేపటి రోజుకి మనల్ని శాశ్వతం చేస్తూ

No comments