సముద్రం అంచుల్లో

నువ్వొదిలెళ్ళిన నా ఊపిరి  కోసం...
ఇదిగో ఇలా కూర్చున్నా సముద్రం ఎదుట.
ఇటు చూడు అలలు ఎలా ఎగిసి పడుతున్నాయో.
నావేపు వస్తున్న ప్రతీ అలనీ చూస్తున్నా..
నిన్న నువ్వు పల్లవించిన ఒక ఆత్మగానాన్ని నాకోసం మోసుకు వస్తుందేమో అని ఆశ.


ఇలా సముద్రం అంచుల్లో కూర్చుని దూరంగా అస్తమించే సూర్యుడిని చూడడం భలే ఉంది. కాసింత బంగారు వర్ణాన్ని అద్దుకున్న అలలు తీరాన్నలా కలేస్తూ  నా పాదాలని తడుముతుంటే, సముద్రమే పేరంటాలుగా పసుపు పారాణిని రాస్తున్న అనుభూతి.  తలచుకుంటే ఎంత బాగుందో తెలుసా?
మరి నిన్నటి రోజున నిన్నూ ఇలాగే పలకరించాయా ఈ అలలు…? పలకరించే ఉంటాయిలే. ఎందుకంటే,  ఇంకా నీ శ్వాసల పరిమళం ఇక్కడిక్కడే తచ్చాడుతుందిగా మరి.


చలం ప్రేమలేఖలు రెండో భాగంలో ఏమంటున్నాడో తెలుసా...


What care i for the world's desire and pride
For my glad heart is drunk and drenched with thee..
O inmost wine of living ecstasy...
ఇన్ సాల్యుయేషన్ టు ది ఎటెర్నల్ పీస్ అని సరోజిని నాయుడు పద్యంలో భాగాలివి.


చలం ప్రేమోద్వేగంలోంచి... కొంత స్థిమిత పడ్డాక రాసాడా ఇవి?


ఏమో నా మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది.


ఈ అనంత జలధ్వని నాలో రాస్తున్న ఒక నిశ్శబ్దం నీకూ అనుభవమే కదూ.  అవును ఒక నిశ్శబ్దపు లోతు అనుభవమైనప్పుడు, మనకోసమే రాయబడ్డ ఒక స్వర రచన అనుభూతిలోకి వస్తూ ఒక యోగత్వాన్ని పరిచయం చేస్తుంది.


ఈ సముద్రంలా
ఈ కాంతిలా
ఈ గాలిలా
నీ ప్రేమ కూడ ఇక్కడ వదిలి వెళ్ళావా..

ఈ రోజెందుకో మరింత స్వచ్ఛంగా... తేజోవంతంగా ఉన్నాయీఅలలు. బహుశా నిన్న తామద్దుకున్న నీ ఊపిరి స్పర్శవల్లనేమో.


ఇక్కడ ఈ తడి ఇసుక ఏదో రహస్యాన్ని చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. అదేమిటో తెలుసా మరి?


“ నా పాదం నిన్నటి  నీ గతిని అనుసరించి పడుతుందట
ఒకానొక దివ్యశక్తి  ఇచ్చిన ఆహ్వానాన్ని అంది పుచ్చుకున్నట్లు”


భలే చెప్పింది కదూ.  వింటుంటే ఎంత బాగుందో !  

ఈ సముద్రాన్ని చూస్తున్న ప్రతిసారీ ఇది నాకోసమే కూర్చబడ్డ తడి శబ్దమేమో అనిపిస్తూ ఉంటుంది. నా కోసమే వాగ్దత్తం చెయ్యబడ్డ దగ్గరితనంలా అనిపిస్తుంది.


ఎందుకంటావా?

రెండు విలోమాలని దగ్గరగా చూపటం తనకి కాక మరెవ్వరికి తెలుసని !  అవును… నిజం, నాకైతే సముద్రం  ఆకాశానికి అగాధానికి ముడి వేస్తున్న తేమ సరిహద్దులా అనిపిస్తుంది.  
No comments