ఈ కూడలే నీ నిజం

ఈలోకంలో ఎవరు ఎవర్నీ మోసం చెయ్యరు..
బదులుగా ఒక అద్దాన్ని తోడుగా ఇచ్చి వెళతారు..
అందులో చిత్రంగా.. నీకు నువ్వు కనపడవు..
ఇన్నాళ్ళూ నువ్వు వాళ్ళకెలా కనిపించావో అది కనపడుతుంది..
అది నీ చిత్రమే సుమా..
కానీ నువ్వు లేనప్పుడు గీసినది..
 
నీకు జవాబు చెప్పలేని మోహం.. వ్యామోహం..
నిన్ను సమాధాన పరచలేని స్వార్ధం..
ఆఖరుకు తామే ఒప్పుకోని తమలోని మరొక పార్శ్వం..
కలగలిపి గీసిన చిత్తరువది..
 
అది నీ చిత్రం కాదని నువ్వు అనుకోవచ్చు..
కానీ దాని కొలమానమూ వాళ్ళు నీకు చేసిన బాసలే కదా..
అందుకే బయటపడు నేస్తం..
సాగిపో వీలయితే విశ్వప్రేమ దిశగా..
లేదంటే అంతర్ముఖత దిశగా..
కానీ...
ఈ రోజు నువ్వు నిల్చున్న ఈ కూడలే నీ నిజం..

-      18.08.15

No comments