వైకుంఠపాళి


క్షణం తీరిక లేకుండా నిరంతరం సాగే
పరుగు పందెంలో ఓటమీ లేదు...
గెలుపూ రాదు
రాత్రంతా ఆశల్ని కని అలసిన కలలు
సూర్యోదయం తలుపు తట్టగానే మాయమై పోతాయి
బహిరంగాన్ని బహిష్కరించి 
ఏకాంతాన్ని ఆశ్రయిద్దామంటే
అంతస్సంఘర్షణల అగాధాల్లో
 
అంతరాత్మ కలవరం
నిజమే ...
ఎంత వింతైనది ఈ జీవితం!!
పరీక్షించాకే పాఠం నేర్పుతుంది.
నేర్చుకున్నది పాటించే వరకూ
 
పరీక్షిస్తూనే ఉంటుంది.
వెలుగూ చీకటీ రోజూ కదులుతూనే ఉంటాయి..
 
తెలియని మలుపుల్ని ముందుకు తెస్తూ
అనుభవించు పొమ్మంటూ
ఎవరి కోసం.. ఎందుకోసం 
అర్ధంకాని నిరంతర వెతుకులాట!
ఎటువైపో తెలియని పరుగుపందెం
నిచ్చెనే ఎక్కుతామో..
పాము నోట్లో పడతామో
 
తెలియని వైకుంఠపాళి ఆటలా ..
రేపు జీవితం మళ్ళీ మొదటిగడిలో పడితేనేం 
నిచ్చెనలూ ఉన్నాయిగా విజయాన్నెక్కించటానికి
 
విజయాలే కాదు వైఫల్యాలూ
 
జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి
 
గెలుపుతో నడిచే ప్రేరణనిస్తూ..
చివరి నడక గెలుపుతోనే అవ్వాలన్న
 
ఆశని బ్రతికిస్తూ....

-      16.08.15



No comments