చెరి సగం.. ఆపై సగం

భాగాలూ.. శేషాలూ మాకు తెలీదు
కూడికలూ తీసివేతలు మా జీవితం కాదు..
లెక్కలూ.. ఎక్కాలూ మేం నేర్చుకోలేదు!!
నువ్వు సగం.. నేను సగం..
చెరి సగం.. ఆపై సగం
చూసారా చూసారా..
అక్కడ కొందరు తమ ఆధిపత్యం
అభిజాత్యం చూపిస్తున్నారట..
ఇక్కడ కొందరు తమ న్యాయమైన హక్కుల గురించి..
ఎక్కువ తక్కువల సమాజపు తక్కెడ గురించి
 
ప్రశ్నిస్తున్నారట!!
కానీ ఒక నువ్వూ.. ఒక నేనూ
మనిద్దరం....
ఇలా క్షణాల్ని లెక్కిస్తూ
కాలాన్ని నిలబెట్టుకుంటూ
ఆకలి తీర్చే దన్ను కోసం
దేహాల్నిలా ఐక్యం చేస్తున్నాం!!
నువ్వో సగం నేనో సగం..
ఇది రెండు సగాల నిండుతనం!
ఇదే మా దేహ పటం..
అసలైన జీవిత చిత్రం...

-      30.08.15


No comments