ఎన్నాళ్ళిలా ?


అవ్యక్త గా
పరిత్యక్తగా
అహల్యగా
అయోనిజగా
స్త్రీత్వపు కొలమానంగా
వంచిత శాకుంతల వారసురాలిగా
ఎన్నాళ్ళిలా?
ధరణంత సహనమన్నారు!!!…
నిజమేననుకుని మురిసిపోయా
తరువాతే అర్ధమయ్యింది
సహనమంటే!
బంధాల్ని భరిస్తూ బాధ్యతల్లో తూగుతూ
ఎక్కడెక్కడి అవమానాలని మనసులో కప్పెట్టుకోవటమేనని
అనుమానాగ్ని తడపిన సీతని భూమాతగా దాచేసినట్లుగా....
సున్నిత హృదయమన్నారు!!!
అది నా సహజత్వం కదా మరి అనుకున్నా.
అయినవారైన మానవ మృగాలు పోతే,
కంటి చివర్లలో సానుభూతిగా కురవమన్నప్పుడు తెలిసింది
నయనాల తడులన్నీ సహజత్వం కాదని..
భావప్రకటనలకీ సంకెళ్ళుంటాయనీ,
సున్నితత్వమంటే అంతరాంతాలలో మౌనంగా రోదించటమని....
వీధి కూడళ్ళలో చూపుల అత్యాచారాలకి
సిగ్గుతో చీలిపోయిన భూమిని నేనే..
ఇంటి గోడల మధ్య మాటల హత్యాచారాలతో
ధారాపాతమై కురుస్తున్న ఆకాశాన్నీ నేనే 
మది పొరల అరల్లో విషాదపు వత్తిడికి నవ్వుల ముసుగేసి
అతిధి సత్కారాలతో ఆనంద’పునీత’లా భ్రమని ఒంపేదీ నేనే
మనసారా నవ్వితే... మౌనం విడిచి మాట్లాడితే
ఏకాంతనై చరిస్తే... పవిత్రతకు లెక్కలు కడుతూ
అదే అపార్థం
పతితంటూ మరో అర్ధం
చదువుసంధ్యల్లో .. ఉద్యోగపర్వాల్లో
తలిదండ్రుల ఆస్తుల్లో ..చట్ట సభల్లో కాలిడటానికో 
సమానపు హక్కుల లెక్కలు కడుతూ
మమ్మల్ని ఉద్ధరించేస్తున్నామంటున్న పెద్దలూ!!!
ఈ అతివ మనసుకర్ధం కానిదొక్కటే
ఈ హక్కుల లెక్కల సమీకరణాల్లో
మీరెందుకు చిక్కుకోలేదా అని
మీకు మీరుగా బతకుతున్నప్పుడు
మాకు మేముగా మనలేమా అని
ప్రగతంటే చదువూ ఉద్యోగం కాదు..
ప్రగతంటే చట్టసభల్లో మీతో కూర్చోవటం కాదు
ప్రగతంటే..
సమానత్వం.. విశాలత్వం.. స్వేచ్ఛ..
స్వేచ్ఛంటే
మీరు మీరుగా మేము మేముగా బతకటం కాదు
‘మనం’గా జీవించటం
కనిపించని గాయాలతో సాక్ష్యమిప్పించలేను కానీ
ఓ మనిషీ…
నీకూ మనసుందిగా.. దానిలో తడి ఉందిగా
గాయపడిన గుండెలో జారుతున్ననెత్తురులో
కలాన్ని ముంచి కొత్త చరిత్రను రాద్దాం.. తోడై రావూ..
మనం చూస్తాం..
మనమూ చూస్తాం..
మనం కలలు కన్న ప్రపంచాన్ని..
మన ప్రపంచాన్ని..
పొద్దు వెచ్చగా పొడుచుకొస్తున్నప్పుడూ..
పువ్వు స్వేచ్ఛగా విచ్చుకుంటున్నప్పుడూ..
రెక్కలతో పక్షులు ఆకాశాన్ని కొలుస్తున్నప్పుడూ..
ఒకే ఒక్క సారి 
మనసు మొత్తంగా తెరిచేద్దాం
మౌనాన్ని బద్దలు కొట్టే మాటల్ని పెళ్లగిస్తూ 
ప్రకృతి నేర్పాలనుకున్న స్వేచ్ఛాగీతాన్ని స్వాగతిస్తూ..

No comments