అంపశయ్య - అంపశయ్య నవీన్.
సామాజిక బాధ్యత కలిగిన రచన అంటే ఎలా ఉండాలి! చదివిన తర్వాత మన మనసు మీద చెరగని ముద్ర వేయాలి. పాఠకుడిలో ఒక సంఘర్షణ రేపాలి. ఏదో చేయాలన్న ఆరాటం.. ప్రపంచాన్ని మరమ్మత్తు చేసేయాలన్న తపన, ఆవేశం కలిగించాలి. ఒక్క మాటలో చెపాలంటే "అంపశయ్య" లా ఉండాలి. అంపశయ్య!!దాదాపు 45 సంవత్సరాల క్రితం మొదటి సారిగా ప్రచురింపబడి ఇప్పటికి 8 సార్లు పునర్ముద్రింపబడి... వెలువడిన ప్రతీసారి మరల మరల చదివించి, ఆలోచింపచేసే నవల.
2000 సంవత్సరం లో వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో అత్యంత ప్రభావం కలిగించిన పుస్తకాలు గుర్తించడానికి ఆంధ్ర జ్యోతి పత్రిక ఒక బృహత్తర కార్యక్రమచేపట్టింది. హేమా హేమీ ల్లాంటి రచయితలైన అబ్బూరి ఛాయాదేవి, రావూరి భరధ్వాజ, నండూరి రామ మోహన రావు మొదలైన వారితో ఒక కమిటీ వేసింది. కన్యాశుల్కం, చివరకు మిగిలేది, మహా ప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి.. మైదానం... పుస్తకాల వరుస క్రమంలో 49వ ఆణిముత్యం గా "అంపశయ్య" గుర్తింపబడింది.
తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతి (స్ట్రీం ఆఫ్ కాన్షియస్‌నెస్) అనే నూతన సాహితీ ప్రక్రియ వాడుకలోకే రాని రోజుల్లో అటువంటి శైలిని ఒక పూర్తి స్థాయి నవలలో సమర్ధవంతంగా వాడుకుని పాఠకుల మనసుల్ని దోచిన నవల అంపశయ్య. చైతన్య స్రవంతి ప్రక్రియ అంటే రచనలో పాత్ర యొక్క అంతశ్చేతన కనబడడం(సబ్కాన్షియస్నెస్).. పాత్ర మనసులో జరిగే మధనం పాత్ర మాటల్లోనే వెలువడడం.
1969 వెలువడిన ఈ నవల పేరే ఆ తర్వాత రచయిత నవీన్ ఇంటి పేరుగా నిలిచిపోయింది.
అంపశయ్య నవీన్ కధనం, శైలి ఎంత గొప్పగా ఉంటాయంటే, పుస్తకం చదివినంత సేపూ ఏదో భారమూ- తేలికతనమ, నిర్వేదమూ- ఆనందమూ ఒకే సారి అనుభవంలోకి వస్తాయి. ఈ పుస్తకం మొదటి సారే కాదు, చదివిన ప్రతీ సారీ ఇదే అనుభూతి కలగడం ఒక గొప్ప విషయం.
అంపశయ్య కధలో నాయకుడు రవి. ఒకానొక తెల్లవారుఝామున యూనివర్శిటీ హాస్టల్ గదిలో రవికి ఒక కల రావడంతో కధ మొదలవుతుంది. ఆ కలకు అర్ధమేమిటో రవికి బోధపడదు. ఆ కల నుంచి మేలుకున్న రవిలో మొదలైన ఆలోచనల ప్రవాహం నిరంతరంగా పరిగెడుతూ 18గంటల పాటు నడిచి చివరికి అదే గదిలోఆరాత్రి ముగుస్తుంది. 18 గంటల పాటు మాత్రమే నడిచ ఈకధ మనల్ని ఒక 20ఏళ్ళ యువకుడి అంతరంగ ఘోషలో ముంచేస్తుంది. తెరలు తెరలుగా పొరలు వీడి నగ్నంగా పరిగెత్తే అతని ఆలోచనలు, అతని ఊహలు, పశ్చాత్తాపం, అతని ధర్మాగ్రహం, పరిస్థితుల పట్ల అతని నిస్సహాయత, జీవితంలో ఓటమి, అవమానం.. చిన్నిచిన్ని గెలుపులు.. అప్పటి అతని హృదయోల్లాసం, మోహం, అశాంతి, అతని ఆకలి, ప్రేమ .... ఇంకా అతనిలో స్నేహం, అభిరుచులు.. అతని దుఃఖం, అంతే....
అన్నీ అతడివే. నవల అంతా రవిదే రవి మనసుదే. నవల చదివాక మాత్రం అతనికి సంబధించిన ఈ భావాలన్నీ మనవౌతాయి. రవి మన మనసులో ఒక భాగం అయిపోతాడు. అంపశయ్యలో గొప్పతనం ఇదే.
కధ లోకి వస్తే, రవి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ విద్యార్ధి. తల్లితండ్రులు చెమటోడ్చి పంపే డబ్బులతో ఉస్మానియాలో ఎమ్మే చదువుటుంటాడు. తెలివైన వాడే అయినా పరీక్షలు దగ్గర పడే వరకూ చదవకుండా తిరిగేసి అవి ముంచుకొచ్చిన తర్వాత కొంచమైనా చదవలేకపోయాననే అపరాధభావనలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. దానికి తోడు ఇంటిదగ్గర రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు పంపే తల్లి తండ్రులు, వాళ్ళ కష్టాలు గుర్తొచ్చి కలవర పెడుతూ ఉంటాయి. ఒక పక్క చుటూ కనిపిస్తున్న రంగుల ప్రపంచం, మరో పక్క విషాద నేపధ్యం... ఈ రెండిటి మధ్య ఆశ నిరాశల ఆలోచనల్లో రవి ఈదుతూ... మనల్నిముంచెత్తుతాడు.
రవి ఆలోచనా స్రవంతి ద్వారానే మిగిలిన పాత్రలను మనముదు ప్రవేశ పెడతారు రచయిత. డబ్బుతో మిడిసి పడే రెడ్డి, అతని మిత్ర బృందం, అభ్యుదయ వాదంతో మన రక్తం వేడెక్కించే వేణు, ప్రతినాయక ఛాయల్తో శ్రీశైలం, యూనివర్శిటీ చదువు అయిపోగానే అమెరికా ఎగిరిపోవాలనుకునే అందమైన డబ్బున్నఅమ్మాయి కిరణ్మయి.. రవి గత జీవితంలో అతనిపై ఆశలు పెంచుకుని నిరాకరింప భదిన అమాయకురాలు రత్తి... వీళ్ళందరినీ మన కళ్ళముందు సజీవంగా నిలబెడతారు రచయిత నవీన్. రవి, రత్తి ఒకరిని ఒకరు కోరుకుంటారు. అయితే ఆమెని వివాహం చేసుకునే ధైర్యం రవి చేయడు. వేరే వివాహం చేసుకున్నా రత్తి భర్తతోఉండలేక పోతుంది. భర్తని వదిలేసి వచ్చిన రత్తి ఊఅర్లో గౌరవం నిలుపుకోలేక పోతుంది. ఆర్ధిక పరిస్థితులు వెంటబడుతుంటే ఒకానొక రోజు కన్న తండ్రే ఆమెని గోవిందరావనే ఒక భూస్వామికి ఆమెపై మనసుందని తెలిసి అతని దగ్గరకి పంపిస్తాడు. పరిస్థితులకు లొంగిపోయిన రత్తిలో సమాజం పట్ల ఒక ధిక్కారం మొదలవుతుంది.ఊరంతా ఆమె గురించి హేళనగా మాట్లాడుతుంటే ఆమె పరిస్థితికి తనే కారణమని రవి కృంగిపోతాడు. అయినా ఆమెకి న్యాయం చేయాలని అనుకోడు. చివరికి ఆమెని ఒకరోజు తాను కూడా అనుభవిస్తాదు. అందరిలాగే ఆ తర్వాత తాను కూడా ఆమె చేతిలో ఒక ఆఠణా పెడతాడు. అప్పుడు అరచేతిలో ఉన్న డబ్బుతో రత్తి అతని వైపుచూసిన చూపు.. అతనిని అగాధంలోకి తోసేస్తుంది. చివరికి రత్తి ఊరినుంచి బహిష్కరింపబడినపుడు అతనిలో మొదలైన అంతర్మధనమే కల రూపంలో నవల మొదట్లో కనిపిస్తుంది. ఊరంతా చిరిగిన బట్టల్తో ఉన్న రత్తిపై రాళ్ళు విసురుతుంటే ఒక పక్క జాలి పడుతూనే తాను కూడా ఒక రాయి వేసినట్లు వచ్చిన ఆ కల అతనివాస్తవ మానసిక పరిస్థితిని మన కళ్ళముందుంచుతుంది. మంచి చెడులు తెలుసుకునే విజ్ఞత అతనిలో ఉన్నా.. పరిస్థితులకు లొంగిపోయే అతని మానసిన దౌర్బల్యం అతని అంతశ్చేతనలో ఉండి ఈ సంఘర్షణకు కారణం అవుతుంది.
రవికి కొంత మంది మంచి మిత్రులూ ఉంటారు. ధనమదం ప్రదర్శించే మరికొంత మంది విధ్యార్దులూ ఉంటారు. రవికి వాళ్ళంటే తగని అసహ్యం. కాని వాళ్ళతో తల పడలేని బలహీనత అతడిది. ధనం, అంగ బలం తెచ్చిన పొగరుతో వాళ్ళ వర్గం ఎప్పుడూ పై చేయిగా ఉంటుంది. న్యాయం తమ వైపు ఉందని తెలిసినా గట్టిగాఅడగలేని పరిస్థితి రవి బృందానిది. రవి అంతర్మధనం రచయిత వర్ణించే తీరు మాటల్లో చెప్పలేం చదివి తీరాల్సిందే. ఒకానొక దుర్భల క్షణంలో వాళ్ళు మెచ్చేలా ఉండి తన డబ్బు అవసరాలు తీర్చుకుందామనీ అనుకుంటాడు. కానీ ఆత్మాభిమానం కల వ్యక్తిగా ఆపని చేయలేడు. ఇలా ప్రతీ విషయంలోనూ ద్వైదీ భావంతో కొట్టుమిట్టాడుతూ మనల్నీ సంఘర్షణలో ముంచి లేపుతాడు రవి. కిరణ్మయితో ఒక్క సారైనా సినిమా చూడాలన్న క్షణికమైన ఆనందం కోసం అప్పు చేసి మరీ వెళ్ళన రవి అక్కడ జరిగిన ఒక అవమానంతో జ్ఞానోదయమై యూనివర్సిటీకి తిరిగి వస్తాడు. ఆ రోజు ప్రతి నాయక బృందంతో జరిగిన ఘర్షణలో బలహీనులంతా ఏకమై రవితోపాటు వారిని ఎదుర్కోవడంతో కధ ముగుస్తుంది. అప్పటిదాకా తప్పొప్పుల సంఘర్షణలో ఉన్న రవి ఒక విశ్వాసంతో ముందడుగు వేయడంతో అతని ప్రయాణం గమ్యం దిశగా మొదలైందని మనకి అనిపిస్తుంది.
ఇదీ క్లుప్తంగా అంపశయ్య కధ.రక రకాల మనస్తత్వాల మధ్య, ఆశ నిరాశల మధ్య కొట్టు మిట్టాడే రవి జీవితంలో జరిగే కొద్దిగంటల కాలం ఈ నవల. కానీ చైతన్య స్రవంతి అనే ప్రక్రియలో సాగే ఈ నవల విశ్వరూపం మనకి చదివాక గాని అర్ధం కాదు.
లక్ష్యశుద్ధి లేని విద్యా విధానం, చిత్తశుద్ధి లేని బోధనా పద్ధతులు , భవిష్యత్తుకి ఏమాత్రం గ్యారంటీ లేని పాలన, సమస్త జీవన రంగాన్నీ కలుషితం చేసిన కృత్రిమ విలువలు విద్యార్ధులను ఏ విధం గా నిర్వీర్యులుగా మార్చి పెడదారులు పట్టిస్తున్నదీ సమర్ధవంతం గా చెప్పిన నవల ' అంపశయ్య ' ..
నవీన్ ఈ నవలని 1969లో రాసారు. దాదాపు 45 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పూ రాలేదు. యూనివర్సిటీ జీవితాలను కళ్ళకు కట్టిన నవల " అంపశయ్య".
మార్క్స్ నూ, మావోను, వియత్నాం పోరాటాన్ని అభిమానిస్తూనే, నెహ్రూ సోషలిజాన్ని , ప్రణాళికల్నీ బలపరచడమే వీటన్నిటికీ విరుగుడుగా భావించే అభ్యుదయ వాదులు ఇందులో మనకి పరిచయమై మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. అయితే కధా కాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మనకు సంశయనివృత్తి కలుగుతుంది.
మనసును కదిలించే ఎన్నో సన్నివేశాలు ఈ కధలో ఉంటాయి . ముఖ్యం గా హాస్టల్ జీవితం. రవి ఫ్లాష్‌బ్యాక్ ఎంతో సహజంగా ఉంటుంది. మొదట్లో భయస్తుడూ ప్రతీ చిన్న విషయానికీ ఊగిసలాడే రవి చివరలో ఇలా అనుకుంటాడు, ” తనమీద దెబ్బ పడటం, తను కూడా శతృవుని దెబ్బకొట్టటం, తనలోని అత్మస్థైర్యాన్నిపెంచుతున్నది. తను నమ్మిన భావం కోసం తను నమ్మిన ఆదర్శం కోసం , తన స్వాతంత్ర్య పరిరక్షణ కోసం ముందు ముందు ఇలాంటి దెబ్బలు ఎన్ని తినటానికి అయినా వెనుకాడడు. అందులో ఇవాళ్టి సంఘటన తనను పూర్తిగా సంసిద్ధుడిని చేసింది.” రవిలో ఇలాంటి పరివర్తన తీసుకుని రావడానికి రచయిత చైతన్య స్రవంతినిఎంతో చక్కగా వాడుకున్నారు. నవల చదివాక అలాంటి పిరికితనముంటే మనలో కూడా పరివర్తన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
అంపశయ్య చదివిన సాహితీ మిత్రులకు ఎవరికయినా ఒ.యు కాంపస్ లో ఏ మూలో నిలబడి ఆ 18 గంటలూ రవిచే మనకు చెప్పించే విధానం కళ్ళ ముందు కదులుతుందంటే అతిశయోక్తి కాదు. రవి పాత్రతో పాటు మనం కూడా ఒక సిటీ బస్సెక్కి తార్నాకా , మౌలాలీ చుట్టి వచ్చేస్తాం. ఆ పరిసర ప్రాంతాలలోనే రవి,వేణు, సాగర్, రెడ్డి కిరణ్మయి, గోపీలు కనిపిస్తారామో అని వెతుకుతాం. బయటకు వచ్చేసాక అక్కడెక్కడయినా రత్తి నిలబడి ఉందేమో అన్న ఆశతో చుట్టూ వెతుకుతాం. ఇది అంతా ఒక నోస్టాల్జిక్ ఊహ.
Post a Comment