నిజం చెప్తున్నా- ఒక హిజ్రా ఆత్మ కధ - రేవతి.
కులం పేరుతో మనల్ని ఎవరైనా కించపరిస్తే కళ్ళెర్ర చేస్తాం. ప్రాంతం పేరుతో అపహాస్యం చేస్తే తిరగబడతాం. మతం పేరుతో అవమానిస్తే అగ్గిలా మండుతాం. కానీ మనలోనే.. మనతో పాటే పుత్తిన కొన్ని జీవితాలు ఇంతకు మించిన అవమానాల్ని పొందుతూ సమాజపు అంచుల్లోకి నెట్టివేయబడుతున్నారు. వాళ్ళూమనలాంటి మనుష్యులే.. కాకపోతే చిన్నపాటి అసహజత్వం. మనసుకీ శరీరానికీ ఫ్రీక్వెన్సీ కుదరకపోవడం.. సర్దుబాటు చేసుకోలేని మనసు.. అర్ధం చేసుకోని సమాజం, అవమానాల్ని దిగమింగుకుంటూ తెచ్చిపెట్టుకున్న ధిక్కారం.. తమ చుటూ ఉన్న సమాజం పై ధిక్కారం, శరీరంపై అంతులేని మమకారం....
ఈ జీవితం ఏ ఒక్కరో ఇద్దరిదో కాదు. ఈ ప్రపంచంలో దాదాపు ఒక కోటిన్నర మంది దురదృష్టవంతుల పరిస్థితి ఇది. వాళ్ళని "ఆమె " అనలేం..
"అతడు" అనలేం అసలు ఏమీ అనుకోకుండా ఉండలేం. అలాంటి ఒక మేల్ మనిషి... ఫిమేల్ మనసూ కలగలిపి...
తన జీవితంతో తనే యుద్ధం చేసి..
తన జీవితంతో తనే ఇన్స్పైర్ అయ్యి..
తన లాంటి వాళ్ళకు ఒక "గ్రేట్ హ్యూమన్" గా గుర్తింపు తెస్తున్న రేవతి అలియాస్ దొరైస్వామి జీవితం ఈనెల మీకు పరిచయం చేయబోతున్న "నిజం చెప్తున్నా- ఒక హిజ్రా ఆత్మ కధ".
ఈ సమాజం స్త్రీలనూ గౌరవిస్తుంది. పురుషులనూ గౌరవిస్తుంది. కానీ పుట్టుకతోనే ఈ రెండు లక్షణాలను కలబోసుకున్న వారిని మాత్రం చీదరించుకుంటుంది. అసాధారణ నిష్పత్తిలో ఎక్స్, వై క్రోమోజోములు కలవడం వలన ఏర్పడిన ఒక వైద్య పరమయిన విపత్తుపట్ల సమాజం సరయిన రీతిలో స్పందించకపోతే బలైపోతున్న జీవితాలివి. హిజ్రాలకు తల్లి తండ్రి కుటుంబ సభ్యుల నుంచే జీవితంలో మొదటి సారిగా చీత్కారపు రుచి తెలుస్తుంది. సామాజిక చీత్కారానికి గురయ్యే శరీరం తమ కుటుంబం లో భాగమై ఉంటే మొత్తం తమ కుటుంబమే సమాజ చీత్కారానికి , వేధింపులకు గురవుతుందని భయపడ్డ కుటుంబ సభ్యులు వీరినివదిలించుకోవాలనుకుంటారు. మరో వైపు వీధిలోకి వెళ్ళినా , పనికి వెళ్ళినా, స్కూలుకు వెళ్ళినా సాటి మనుషుల నుంచి సాధింపులు .ఒక వైపు కుటుంబం వారిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు ఈ సమాజంలో స్వేఛ్ఛగా, గౌరవం గా తాము జీవించలేమన్న అధైర్యం వారిని తమదైన ప్రపంచం లోకి దారివెతుక్కునేలా చేస్తుంది.
"నిజం చెప్తున్నా - ఒక హిజ్రా ఆత్మ కథ" పుస్తకం మగపిల్ల వాడిగా పుట్టి అంతర్గతంగా స్త్రీ లక్షణాలున్న ఒక వ్యక్తి ఆత్మ కథ. ఇది వ్యక్తి ఆత్మ కథ అనటం కంటే ఆ సమూహం బయట ప్రపంచానికి సమర్పించుకొన్న సంవేదన అనవచ్చు. అవయవ మార్పిడి చేసుకుని హిజ్రాలుగా పిలవబడుతున్న వారు మానసికంగాపడిన సంఘర్షణల స్థాయిలను, సమాజంతో చేసిన యుద్ధాలను సాధారణీకరించి , సంగ్రహిస్తే దానిసారమే "నిజం చెప్తున్నా - ఒక హిజ్రా ఆత్మ కథ".
తమిళనాడులోని సేలం జిల్లా, నమక్కల్ తాలూకా పుట్టిహళ్ళీలోని ఒక సాంప్రదాయ రైతు కుటుంబం లో ముగ్గురు అన్నలు, ఒక అక్క తర్వాత దొరైస్వామి పుట్టారు. పెరుగుతున్న కొద్దీ దొరైస్వామి నడక, నడతా-ఆహార్యాలు అమ్మాయినే పోలి ఉండేవి. అది గమనించిన తల్లితండ్రులు దొరైస్వామిని తిట్టారు. కొట్టారు.వినకపోయేప్పటికి గదిలో పెట్టి బంధిస్తారు.
"తన మనసు ఎందుకు అమ్మాయిలా ఉండాలని కోరుకుంటోంది? శరీరం ఎందుకు అబ్బాయిల పట్ల ఆకర్షితమవుతోంది?" ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మొదటా ఢిల్లీ, అక్కడనించి ముంబయి చేరుతారు దొరైస్వామి.
ముంబైలో తనలాగే ఆలోచించే వర్గంలో ఒకరిగా జీవితాన్ని ప్రారంభిస్తాడు దొరైస్వామి. తనను తాను మార్చుకోవడానికి తన శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తాడు. ఆడబ్బుతో శస్త్రచికిత్స చేయించుకుని రేవతిగా మారిపోతాడు. ఆ శస్త్రచికిత్స చేసే పద్దతి ఆమె మాటల్లో వింటే వళ్ళు గగుర్పొడుస్తుంది.
రెండేళ్ళు ముంబైలోనేగడిపిన తర్వాత కన్న వారిని చూడాలనే ఆశతో ఇంటికి వచ్చిన రేవతిని కన్నతల్లితండ్రులతో పాటు తోడబుట్టిన వారు కూడా చేరదీయరు. దీనితో రేవతి మళ్ళీ బెంగళూరు చేరుకుంటుంది. జీవనం కోసం పగలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ రాత్రి సమయాన్ని పడుపు వృత్తిలో గడిపేది. ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఈక్రమంలో జరిగిన ఒక సంఘటన రేవతి ధృక్పధాన్ని పూర్తిగా మార్చేసింది.
ఒక రోజు రాత్రి బెంగళూరు కొబ్బన్ పార్కు పోలీసులు రేవతిని పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. స్టేషన్ లోనే తనను వివస్త్రను చేసి తోటి ఖైదీలతో పాటు పోలీసులూ పైశాచికానందం పొందుతారు. దీంతో ఆమె మనసు పూర్తిగా మారిపోతుంది.. " జీవితం అంటేఇంతేనా .. నేను హిజ్రాను అయినంత మాత్రాన ఈ శరీరం మరొకరి కోరికను తీర్చటానికేనా.. నా వల్ల ఎటువంటి ప్రయోజనం జరుగదా..
" అంటూ పరిపరి విధాల ఆలోచించిన రేవతి అంతవరకూ చేస్తున్న వృత్తిని మానేసి సమాజం నుంచి దూరంగా ఉన్న అనాధలు., వేశ్యలు ముఖ్యంగా హిజ్రాల సంక్షేమంకోసం పనిచేస్తున్న " సంగం"అనే సంస్థ కోసం పనిచేయడం మొదలు పెట్టింది.
ఇదే సూక్ష్మంగా రేవతి అలియాస్ దొరైస్వామి కథ. మనచుట్టూ ఉన్న సమాజం స్త్రీలకు, దళితులకు, మైనారిటీలకు, బలహీనవర్గాలకు, మొత్తంగా మెజారిటీ జనసందోహానికి బాగాలేదని మనకు తెలుసు. కానీ సమాజం మొత్తం మీద కుల మత వర్గాలకు అతీతంగా స్త్రీ పురుషులందరిచేత ఏహ్యానికి , చీదరింపుకు, భయానికి ,వెలివేతకు గురవుతున్న హిజ్రాల పట్ల ఈ సమాజం ఎంత క్రూరంగా వ్యహరిస్తుందో " నిజం చెప్తున్నా .." చదివితే మనకు అర్ధం అవుతుంది.
వర్గ సమాజంలో ఆర్ధిక స్థితిగతులు మనిషి బతుకును శాసిస్తాయి. కాని హిజ్రాలు కుటుంబంతో గడపలేని పరిస్థితులవలన ఎంతోకొంత ఆర్థిక వనరులు ఉన్న కుటుంబం నించి వచ్చినా ఆ వనరులను అనుభవించలేరు. వారి భౌతిక రూపం, ఆర్థిక వెనుకబాటుతనం, వారిని స్వతంత్రం గా ఉండనివ్వవు. వారికోసం వారుఏర్పరుచుకున్న సమూహాలలో మాత్రమే వారు బ్రతకగలుగుతారు. అయితే అంతటా విస్తరించిన అవలక్షణాలు వాళ్ళ సమాజాలని కూడా కుదిపేస్తూ ఉంటాయి. కేవలం బ్రతకడం కోసమే అలా సమూహాల్లోంచి ఇంటికీ.. ఇంటినుంచి సమూహాల్లోకీ పారిపోతూంటారు వీళ్ళు.
ఇలాంటి దుఃఖ సముద్రపు అలల ప్రయాణాన్ని రేవతి నిరాలంకారంగా , ఉన్నది ఉన్నట్లుగా ఈ పుస్తకం లో వర్ణించింది. ఆమె సంతోషాలను, ఘర్షణలను, దుఃఖాలను బలహీనతనలను నిజాయితీ గా చెప్పింది. రేవతి ఈ పుస్తకంలో స్రవించిన జీవిత ప్రవాహానికీ, అక్కడక్కడ తోడయ్యే ఆమె వ్యాఖ్యానాలు,ఆపుకోలేక ఆమె చేసినఉద్వేగ ప్రకటనలు మనల్ని కుదిపి దుఃఖంలో ముంచెత్తుతాయి. ఖచ్చితంగా ఈ జీవిత కథ ఈమాత్రం సౌందర్యవంతంగా ఉండదు. ఈ కథ సుఖాంతం అవ్వదని కూడా మనస్సు చెపుతూనే ఉంటుంది. అయినా ఈ రేవతి ప్రయాణంలో ఉండే భిన్నత్వం, ఆమెకు బతుకులో ప్రతీ మలుపూ చూపించే కొత్త కోణం.. చదువుతున్నంతసేపూమనకి తీవ్రమయిన భావోద్వేగాన్ని కలిగిస్తుంది.
మగవాడిగా పుట్టి స్త్రీ మానసిక ప్రవృత్తి కలిగి ఉండటం చిన్నతనాన్ని కలిగించే గందరగోళాన్ని అర్ధంకావాలంటే ఆమె హృదయాన్ని అక్షరాలతో చూడాల్సిందే. రేవతి తన జీవితన్నే ప్రదర్శనగా చూపిస్తూ చట్టాలను, రాజ్యాంగ యంత్రాంగాలను చాలా ప్రశ్నలు వేసింది. ఆడపిల్లగా కుటుంబంలో కొంత స్థానం ఉంటుంది. మగపిల్లవాడుసహజంగానే కొన్ని హక్కులు పొందుతాడు. హిజ్రాలు ఇటు కుటుంబంలోనూ , అటు న్యాయస్థానాలలోనూ తిరస్కృతులు అవుతుంటారు. చివరకు రేషన్ కార్డు కోసం, డ్రైవింగ్ లైసెన్సు కోసం కూడా రేవతి ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక దశలో అంత పోరాటం చేసే ఆమె విరక్తి చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.
రేవతి గడిపిన కాన్నాళ్ళ వైవాహిక బంధం.. అందులో ఆమె అనుభవాలు కూడా మనలో కొన్ని ప్రశ్నలు లేపుతాయి. స్త్రీ తరహా మానసిక ప్రవృత్తితో వాళ్ళు పురుషుల పట్ల ఆకర్షితమవ్వడం... అంతే కాకుండా స్త్రీత్వం అని ఈ సమాజం ఆపాదించిన ప్రతీదీ తాము అనుభవించాలని తాపత్రయ పడడం.. అందులో హిజ్రాలుఎదుర్కొంటున్న మానసిక వత్తిడీ సంఘర్షణా.. మనల్ని కుదిపేస్తాయి.
ప్రేమ, పెళ్ళి విషయంలో రేవతి పొందిన వైఫల్యాన్ని, అందువల్ల కలిగిన దుఃఖాన్ని ఆమె తన మనసునుండి పుస్తకంలోకి, పుస్తకం నుండి మన మనసులోకి బదిలీ చేసిందని చెప్పవచ్చు. హిజ్రాలకు ప్రేమోద్వేగాలు ఉంటాయనే విషయం అర్ధం అయ్యాక మనం వారిని చూసే దృష్టి తప్పకుండా మారుతుంది.
మనిషి మనుగడ కోసం ప్రకృతి పై పోరాటం చేయాలి. అది సహజం. అవసరం. కానీ ప్రకృతి ప్రసాదించిన శరీరాకృతి పైపోరాటం వాళ్ళకి సర్వస్వమయిపోవటమే ఒక పెద్ద విషాదం. " నిజం చెప్తున్నా..
" పుస్తకం రాసిన రేవతి ఒక మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. ఈ సమాజం ప్రభుత్వం కొన్ని రోజులుఆమెగురించి, ఆమె సమూహాల గురించి కొంత తీరికా, ఓపికా చేసుకుని చర్చించుకున్నాయి. అయితే ఇప్పటికీ ఆమె మళ్ళీ జీవనం కోసం సెక్స్ వర్క్ చేయ వలిసి రావడం ఒక కఠిన వాస్తవం. ప్రభుత్వం నిర్లక్ష్యానికీ, సమాజ నిర్లిప్తతకీ ఒక నిదర్శనం. ఈ గడ్డ మీద ప్రతీ మానవ పుటకా హుందాయైన బ్రతుకు తెరువు,గౌరవనీయమయిన జీవనం అభయంగా పొందాలి. అలా పొందలేనప్పుడు వందల సమూహాల అస్థిత్వాలు వాటి ఉనికి కోసం ఆక్రోశిస్తాయి. ఆ సామూహాల్లో ఒక సమూహం రేవతి మన కళ్ళ ముందుంచిన ఈ హిజ్రా సమూహం. ఈ పుస్తకం చదివాకయినా ఈ సమూహాల పట్ల వాళ్ళు చేస్తున్న పోరాటాలపట్ల ఒక సానుకూల వైఖరిఏర్పరుచుకోగలితే రేవతి కృషి ఫలించినట్లే..
Post a Comment