నీకు కాక ఎవరికి…?
తెలుగు వెలుగు లో బహుమతి గెలుచుకున్న నా లేఖ!!!
ప్రాణమా....
గోదారి ఒడ్డున, దూరంగా అందమైన సంగీతం.. ఎంత గొప్పగా… ఎంత అందంగా ఉందో తెలుసా. సంగీతం అందంగా ఏమిటీ అని నవ్వుతున్నావా... అవును . ఈ నిశ్శబ్దం కూడా చాలా మాటలు చెప్తోంది నాకు. ఈ మాటలు సంగీతంలా ఎంత అందంగా ఉన్నాయో. సాయంత్రం వేళ వచ్చీరాని ఈ చీకటిలో ఆ సంగీతం మధ్య నీ గుండె చప్పుడు వినిపిస్తోంది నాకు. పడవ కింద నీళ్ళ శబ్దం గలగల మంటూ నీ నవ్వుని గుర్తు చేస్తోంది.
ఇంకా ఉదయించని చంద్రుడి కోసం నక్షత్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అచ్చం నాలాగే. ఇలా ఈ పడవ మీద కూర్చుని అవతల గట్టుకేసి చూస్తుంటా నేను. కాసేపట్లో చంద్రుడినెక్కి నువ్వొస్తావని ఒక గట్టి నమ్మకం.
నాదనుకునే ఏకాంతాన్ని సవరించే సవ్వడి నువ్వేగా చెయ్యగలవ్ మరి. ఈ నది పై మబ్బులు రాస్తున్న చినుకుల సంతకం అచ్చంగా నీ చేవ్రాలుగా అనిపిస్తున్నప్పుడు నీకూ నాకూ మధ్య ఉన్న దగ్గరితనం ఇంకా ఒక చిన్ని చినుకంత దూరమా అనిపిస్తుంది.
ఎంత దూరం అయితేనేం… అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందంటే ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను తెలుసా. అలాంటి ఒక్క క్షణం ఇచ్చే సంతోషం ముందు ఎన్ని యుగాల దుఃఖం అయినా భరించవచ్చు కదా. అప్పటి ఆ క్షణం లో గడచిన దినాల కన్నీళ్ళు ఇక గుర్తు ఉంటాయా అని ఆశ్చర్యం నాకు.
జనాలు ఎంత వెర్రి వాళ్ళు నేస్తం. ఎప్పుడూ దుఃఖానికున్న జీవిత కాలం సంతోషానికుండదు కదా. వ్యర్ధమైన మాటలతో అనవసరమైన దిగుళ్ళతో ఎంత అందాన్ని ఎంత ఆనందాన్ని దూరం చేసుకుంటారో కదా !
ఇలాంటప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా… ఇదిగో ఈ వెన్నెలని చాప చుట్టేసి మనతో పట్టుకెళ్లి కావాలనుకున్నప్పుడల్లా వాళ్ళ ముందు పరిచేసి కాసిన్ని నెమలీకలతో ఒక్కొక్కరి నుదిటి పై ప్రకృతిని ప్రేమించేలా కొత్త రాతలు రాసేద్దాం అని … పిచ్చి కోరికేం కాదు కదా…
ఇలా ఒక్క సారి రమ్మందామా…
విశాలమైన ఈ నదీ, దూరంగా రెండో ఒడ్డున మెరుస్తున్న ఇసుకా, పైన నీలమైన ఆకాశమూ.. ఈ శరత్కాలపు వెండి వెన్నెలా.. మంచులో కడిగిన ఈ గడ్డిపూలూ...దూరంగా ఎక్కడో వినిపిస్తున్న పాట… విశ్వమోహన రహస్యపు తీరానికి తోడ్కొని వెళ్లాలని నీ కోసం ఎదురుచూస్తూ నా పడవా....
ఒక్కోసారి ప్రయాణమూ పరిమళిస్తుంది అనిపిస్తుంది . నిజం ! ఇలాంటి ఒక్క పడవ తోడున్నప్పుడు ఇష్టమైన క్షణాలు ఇంకాస్త పొడుగు ఉంటే… అవి కనిపించే ప్రతి శూన్యాన్నీ వెలివేసుకుంటూ వస్తుంటే బాగుండు అనిపిస్తుంది.
ప్రపంచంతో నాకున్న లెక్కలన్నిటినీ ముగించేస్తూ
నా నిరీక్షణలకి సమాధానం తెలిసిన అభివ్యక్తిలా
నన్ను తోడ్కొని వెళుతుంది…
అచ్చంగా నాకు నువ్వు దొరికే చోటుకి … నాకు నేను మిగిలే చోటుకి… నవ్వు మాత్రమే పూసే చోటికి.
ఇవి మాత్రమే నా అక్కడ దొరికేది? ఊహూఁ
పదాలకి చిక్కనంత ఆనందం
ప్రకృతికీ ఇంకా చిక్కని వేవేల స్వరాల గానం…
ఇదిగో ఇలాంటి ఒక అందమైన సాయంత్రం నువ్వొస్తావు నాకోసం. గడిపే ఆ క్షణాల ఆనందం కోసం.. ఎన్ని యుగాలైనా ఎదురు చూడొచ్చు కదా.
నిశ్శబ్దం పట్టిన ఒక్క క్షణం చాలదూ …
నీ రహస్య ధ్వనిని నాలో ఎలుగెత్తడానికి
కొలతకు రాని నిరీక్షణల దూరాన్ని నీకు చేరవేయడానికి
టాగోర్ ఏమంటాడు.....
" From you he only dares to crave
For his service, and his sorrow
A smile to day, a song tomorrow
నా సంతోషం నా దుఃఖం నీకు కాక ఎవరికి…?
నీ
ప్రాణం
Post a Comment