BLOCK THE DIRT!!!

మనతో రాని వాళ్ళందరినీ.
ఆగి దుమ్మెత్తిపోయడం మొదలు పెడితే...
మన నడక సాగేదెప్పుడు మిత్రమా.
నాలెడ్జ్ వేరు.. సంస్కారం వేరు. చదువుకున్న ప్రతీ వాడికి కాస్త అటూ ఇటూగా నాలెడ్జ్ వస్తుంది. కానీ సంస్కారం ఎలావస్తుంది. అది చదువుకున్నంత మాత్రానో.. చూడడానికి నాగరీకంగా ఆహార్యం మలచుకున్నంత మాత్రానో రాదు. అది పుట్టుకతో రావాలి అని కూడా నేను అనను. ఎందుకంటే మన పుట్టుక మన చేతుల్లో లేదు. మనుష్యులుగా పుట్టిన తర్వాత సమాజం లో జంతువులకి మనకి తేడా చూపించగల ఒకే ఒక లక్షణం .. విచక్షణ అనే లక్షణం.. ఇదిగో ఈ విచక్షణ మన ఆలోచనల్లో ప్రవర్తనలో చూపించడం మొదలు పెట్టాకే సంస్కారం అబ్బుతుంది ఎవరికైనా.
ఈరోజున సమాజమెలా ఉందంటే… మనతో కలసిరాని ప్రతివారూ పనికిరానివారే అన్నట్లు తయారవుతుంది. అలా అనుకున్నా పర్లేదు కానీ ఆ క్రమంలో కొన్ని సార్లు విజ్ఞతని ముంచేసిన సంస్కారహీనత బయటకి వస్తూ ఉంటుంది.
భిన్న సమస్యలు… భిన్న పోరాటాలు… విభిన్న పోరాట నేపథ్యాలు ఉన్నప్పుడు ప్రతి సమస్య మీద లోతైన అవగాహన అన్నది అత్యంత కష్టం. సమస్య పరిచయం అవటం వేరు… సమస్య లోతుల్లోకి వెళ్లి… వేళ్ళ నుండి పెకలించి వెయ్యటం వేరు. మొదటి దానికి వార్తామాధ్యమాలు చాలు. కానీ రెండవదానికి మాత్రం ఆ జీవనంలోని లోతుపాతులు తెలియాలి. రోగకారకమేదో తెలిస్తేనే కదా దాన్ని తగ్గించడానికి అంటూ ఒక మందు ఇవ్వగలిగేది. తరతరాలుగా ఉన్న కొన్ని సమస్యలని రూపుమాపడానికి ఒక్క తరం సరిపోతుందా? తమకున్న అనుభవాన్ని బట్టి, నాయక లక్షణాలని బట్టి సమాజం లోని ఒక వివక్ష మీద దృష్టి సారించి దాన్ని తొలగించటానికి సాగే మార్గంలో, ఇతర సమస్యల మీద దృష్టి సారించలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళ చిత్తశుద్ధిని శంకించటం ఎంతవరకూ సమంజసం ?
నిజానికి ప్రతి పోరాటానికి ఒక నాయకత్వం ఉంటుంది. అదెప్పుడు బలంగా ఉంటుందంటే ఆ పోరాట మూలాలు తమ ప్రతి శ్వాసలో తెలుస్తున్నప్పుడు. ఒకసారి పోరాటం మొదలయ్యాక… ఒక్కొక్కరుగా అందరూ కలసి వస్తారు. అది తమ సమస్య కాకపోయినా సరే పోరాటంలోని నిజాయితీకి తామూ కదిలిపోతూ వచ్చేవారు ఎందరో. కానీ ఆ కదలిక ఏ రూపంలో అన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పరిధులలోని విషయం.
ప్రతి అన్యాయం మీద మాట సాయమో… చేతసాయమో చేయనంత మాత్రాన వారి వారి ప్రవర్తనలో చిత్తశుద్ధి లేనట్లు కాదు. విజ్ఞత ఉన్న ఎవరికైనా అన్యాయం అనిపించిన ప్రతిదాని మీదా సానుభూతి ఉంటుంది. అది వారి సహజ లక్షణం కూడా. కాకపోతే ఎవరికి వారు పెరిగిన పరిస్థితులని బట్టి, ఒక సమస్యలో వారికున్న అనుభవాల గాఢతని బట్టి తమ పోరాట పంథాని ఎంచుకుంటారు. ఆ మార్గంలో చిన్న చిన్న ముళ్ళ నుండి పెద్ద పెద్ద దుంగలని ఏరివేసే శక్తిని కూడగట్టుకుని నడవటానికి ప్రయత్నిస్తుంటారు. ఆ యత్నంలో వేరే మార్గాల మీద వేరే పోరాటాల మీద దృష్టి నిలపటం ఎంత కష్టమో చేతల్లో పోరాటం చేసే వారికే తెలుస్తుంది.
కాని వాళ్ళతో మాటలు పడుతూ... అయిన వాళ్ళూ కలసి రాని మానసిక వేదనలోనూ తామెంచుకున్న మార్గం నుండి వెనుదిరగని ఆత్మబలం వారి సొంతమయ్యే ఉంటుంది. అది ఉన్నంత కాలం ఆ అడుగులు అదే మార్గాన్ని మరింత మెరుగు పరిచే మరిన్ని అడుగులకి ఊతమిస్తాయ్.
మనకి ఒక విషయం అన్యాయం అనిపించవచ్చు. పోరాడదాం. అది అన్యాయం అనిపించిన వాళ్ళు మనతో కలిసి వస్తారు. కలిసి నడుద్దాం. అంతే గాని మనతో రాని వాళ్ళందరినీ ఆగి దుమ్మెత్తిపోయడం మొదలు పెడితే... మన నడక సాగేదెప్పుడు మిత్రమా...

No comments