నాన్న...

నాన్న...
పిల్లల చుట్టూ తనకు తాను రక్షణ రేఖ అయ్యే జీవితపు అనంత విలువ.
నిజం... పసితనానికి ఎంత ధైర్యమంటే ప్రపంచమంతా ఎదురు తిరగనీ... నాకు మా నాన్న ఉన్నాడు అని.
తను రహదారిగా మారి మన అడుగులకి ఎదురుదెబ్బలు తగలకుండా చూడటమే తన ఊపిరిగా చేసుకునే నే దైవత్వపు జేగంట నాన్న.
పిల్లలందరికీ నాన్నే మొదటి హీరో.
నాకూ అక్కకీ అయితే ఇంకొంచం ఎక్కువ. ఎంత ఎక్కువంటే ప్రపంచంలో మా నాన్నగారి లాంటి ఫాదర్ ఎవరికీ ఉండరన్నంత ఎక్కువ.
నాన్నగారు... పేరు లక్ష్మీ నారాయణ. రిటైర్డ్ ఇంజనీర్.
నాన్నగారి చేయి పట్టుకుని నడిచిన అడుగులూ...
రాత్రిళ్ళు ఆరు బయట ఆయన పక్కన పడుకుని విన్న బినాకా గీత్‌మాలా..
ఆయనతో ఆడిన చెస్, క్యారంస్..
ఆయన నేర్పిన ఇంగ్లీష్.. 
ప్రతీదీ ఒక అద్భుతమైన జ్ఞాపకం.
మా చిన్నప్పుడు ఒడిషాలో ఉండేవాళ్ళం. చిన్నప్పుడు నాకూ అక్కకీ, ఇది కావాలి.. అది కావాలి అని పేచీలు పెట్టడం అస్సలు గుర్తులేదు. పేచీ పెట్టే అవకాశం అమ్మానాన్న మాకిస్తే కదా. మేమే లోకంగా ఉండే వాళ్ళు ఇద్దరూ. 
అప్పుడు నాకు బహుశా నాలుగేళ్ళు వయసు ఉంటుందేమో. నాన్నగారు ఆఫీస్ పని మీద ఒక సారి వైజాగ్ వెళ్ళారు. నేను చెప్పులు తీసుకురమ్మని అడిగాను. వచ్చేటప్పుడు తేలేదు. ఏవీ.. అని అడిగితే వెనుక లారీలో వస్తున్నాయని చెప్పారు. ఒక్క జత చెప్పులు లారీలో లోడ్ రావడమేంటి!! ఇది తెలుసుకునే వయస్సు కాదు. అలా అని ఆయన అబద్ధం చెప్పారంటే నమ్మేదాన్ని కాదు. 
చిన్నప్పటి జ్ఞాపకాల్లో మొదటి జ్ఞాపకం అదే. నేను వరండాలో కూర్చుని లారీ కోసం అలా ఎన్ని రోజులు ఎదురు చూసానో.. ఇప్పటికీ నేనూ నాన్నగారు ఎక్కడి కైనా వెళ్తుంటే లారీ కనిపిస్తే ఆట పట్టిస్తా... మీరు ప్రామిస్ చేసిన చెప్పులు ఉన్నాయేమో చూద్దామా అని.
నాన్న మాతో భలే స్పెండ్ చేసేవారు.
మేం మంచి వ్యక్తిత్వంతో పెరగాలంటే ఆయన అలా ఉండి మాకు నేర్పించాలని ఆయన నమ్మకం.
తను ట్రాన్స్ఫర్స్ తో ఎన్ని ప్లేసెస్ తిరిగినా మా చదువుకి ఇబ్బంది లేకుండా తాపత్రయ పడే వారు.
ఈ రోజు అంతో ఇంతో మాకు భాష మీద పట్టు ఉందంటే అందుకు కారణం ఆయనే.
చిన్నప్పుడు హిందూ పేపర్ లో ప్రతీ రోజు ఒక కొత్త పదం నేర్చుకుని దానిని స్వంత వాక్యాలతో ప్రయోగించమనే వారు. 
ఇక చూడండి మేం విజృంభించే వాళ్ళం. ఇక రోజంతా ఆ పదం వచ్చేటట్లు ఒకటే మాటలు.
అందరూ నన్ను "నాన్న కూతురు" అంటారు. 
మమ్మల్ని ఆడ పిల్లలమనీ.. అనవసర జాగ్రత్తలూ.. అవీ ఇవీ చెప్పి ఎప్పుడూ పెంచలేదు. ఇంటర్ చదివేటప్పటికే ఆయన బిజీ గా ఉంటే తన బేంక్ పనులూ.. పోస్ట్ ఆఫీస్ పనులూ.. మేం ఇద్దరం కలిసి చక్క బెట్టేసే వాళ్లం.
మమ్మల్ని పెంచడానికి, చదివించడానికి, పెళ్ళిళ్ళకి మాకు మంచి జీవితాన్ని ఇవ్వడనికి అయన ఏం కష్ట పడ్డారో మాకు తెలీదు. ఎందుకంటే తన కష్టం మాకు ఎప్పుడూ తెలిసేది కాదు. 
క్లాస్ మేట్స్.. ఆడ పిల్లలూ మగ పిల్లలూ సమానంగా మా ఇంటికి వచ్చే వాళ్ళు. ఎలాంటి ఆంక్షలూ లేకుండా అలా పెరిగామంటే చాలా గర్వంగా ఉంటుంది.
మా చిన్నప్పుడే కాదు.. ఇప్పటికి కూడా అమ్మ మనసులో ఏ ఒక్క రోజూ.. ఎలాంటి ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్‌నీ చూడలేదు మేం. తను అమ్మని చూసుకునే పద్దతి చాలా గొప్పగా ఉంటుంది.
తన పసితనం మాకు తెలియకపోవచ్చుకానీ ఇప్పుడైతే నాన్న మా పిల్లల్లో ఒక పిల్లాడు... పసి బాలుడు. అలా అనుకుంటే ఎంత సంతోషమో.
ఇది కేవలం మా నాన్న అనే కాదు. బాధ్యత తెలిసిన ప్రతి నాన్నా ఇంతే.
నాన్న కలం లాంటి వాడు. చూడటానికి గట్టిగా కనిపిస్తూ లోపలంతా తడిని నింపుకుని మన జీవితాన్ని అందంగా రాయటానికే చూస్తుంటాడు.
నాన్నంటే నడిచే శిఖరం... నాన్నంటే జీవితపు దీవెన... నాన్నంటే బిడ్డకి తొలి మెలకువ.
మన ఆశే తన శ్వాసగా చేసుకునే తొలి నేస్తం నాన్న.

No comments