దేహం నిదానించిన చోట

అలముకుంటున్న కలతల
తడి సంకేతాల భాషని కంటికి అంటనివ్వకలా
నీ ప్రతి కలనూ కన్నీరుగా కార్చేస్తుంది
గుండెని కొలిమిలా రగిలిస్తుంది
క్షణక్షణమూ  నీలోనుండి నిన్ను బయటకి లాగేయ్యాలనే
తమ ఆశకి దాసోహమవ్వకలా
కాలం పొడుగూతా
నువ్వు  వేద్దామనుకున్న మైలురాళ్ళని విస్మరిస్తూ
నీ పయనాన్ని పరిమితం చేసేస్తుంది

అందుకే
నీ వాకిట్లోకి వలస వస్తున్న భయాలన్నిటినీ
నీ కంటిమెరుపుల వలలోకి లాగేసేయ్
గుండె స్పందన సప్తస్వరమై ఉల్లాసమిచ్చేలా
ప్రతి లయకూ నిబ్బరాన్ని దర్పంగా మలిచేసేయ్
అప్పుడిక  
ఊపిర్ల నిండా ధైర్యాన్ని అద్దుకున్న శ్వాసలన్నీ
కొడగట్టిపోతున్న ప్రతి లెక్కనూ సరి చేస్తాయి  
చేజారిపోతుందనుకున్న  జీవితాన్ని
వెనక్కి మరల్చి నడిపించుకొస్తాయి

కణాలన్నీ శిధిలాలుగా కూలుతున్న వేళ
మనసూ... దేహం నిదానించిన చోట
ధైర్యమొక ఇంధనమై
ప్రతి శిధిలాన్నీ శిల్పంగా మలుస్తుంది
మనిషిని మళ్ళీ  పచ్చగా చిగురిస్తుంది


No comments