హత్య అంటే ?

హత్య అంటే దేహాన్ని నిర్మూలించటమేనా?
హంతకులంటే దేహాస్తిత్వాన్ని చిదిమేసిన వాళ్ళేనా?
లోలోన…
బహుశా అది నాలోనో, నీలోనో, తనలోనో బయటకంటూ తెలియకుండా చిదిమెయ్యబడుతుందే ఒక వ్యక్తిత్వం! మరి తన అస్తిత్వం ఏమైపోతున్నట్లు,
ఏ అపరాధ పరిశోధనలకీ ఆచూకీ దొరకనంతగా మాయమైపోతుందేం?
మరి అది హత్య కాదా?
మనదైన వ్యక్తిత్వాన్ని
ఎవరైనా చిదిమేసారంటే..
మన వ్యక్తిత్వపు హత్య జరిగిందన్న మాటే కదా
రక్తం పారిన వ్యక్తి హత్య కన్నా
కన్నీరు కురిసేలా చేసిన ఈ హత్య ఏమి తక్కువట?
రక్తం పారిన హత్యలో మరణం ఒక్కసారే !
కానీ వ్యక్తిత్వాలపై ఘోషా కప్పుతున్న చోట క్షణానికో మరణం తలుపు తడుతున్నట్లుకాదా?
ఉన్న ఒక్క జీవన యానంలో ఎన్ని వేలసార్లు మరణిస్తున్నామో కదా !
వ్యక్తి హంతకులు కొందరే
మరి వ్యక్తిత్వపు హంతకులు కోకొల్లలు
మొదటి దానికి జైలు శిక్ష
మరి రెండవదానికి???
సమాధానం ఎక్కడ?
వ్యక్తిత్వాల గణింపు లింగ భేదాలని బట్టి మారిపోతున్నప్పుడు,
అంతులేని వివక్ష అలా కొనసాగుతున్నప్పుడు
సగం సమాజం కోసం ప్రత్యకంగా సదస్సులు పెట్టుకోవాల్సిన అవసరమే వస్తున్నప్పుడు
అప్పుడు తెలుస్తుంది...
ఎవరో ఒక్కరే ఎక్కువ సమానంగా మారి సమాజాన్ని తమకి నచ్చినట్లుగా చిత్రిక పట్టేస్తూ, కాసిన్ని ప్రతిఫలాలని ఆశగా చూపిస్తూ మహిళా సమాజాన్నే ఖండ ఖండాలుగా విభజించేస్తూ ఉన్నారని.
ఇక్కడ మనం బాధ పడాల్సింది ఉందా అంటే...
నిజంగా పెద్దగా బాధ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే
జరుగుతున్నది మన వ్యక్తిత్వపు హత్య మాత్రమే కాదు,
మనుష్యులుగా మనలో కనుమరుగవుతున్న వారి అస్తిత్వపు ఛాయలు కూడా.
మనవైన ఆలోచనలో వాళ్ళు కనుమరుగువుతున్నప్పుడు తెలియటం లేదా మనకి? వాళ్ళు చిదిమేస్తున్నామనుకున్న మన వ్యక్తిత్వాలతో పాటు, తమ అస్తిత్వాలకే స్థానం లేకుండా చేసుకుంటున్నారని.
ఈ కోణాన్ని దాటి చూస్తే
మనకి మనమే ధైర్య వచనాలం .
నిజమే కదా ! దేహపు చిరునామాలుగా ఎవరు ఎంత గొప్ప అయితేనేం
ఒక్క మనసులో మనిషితనపు అస్తిత్వం నిలుపుకోలేకపోయాక..
నిజానికి మనకి కావాల్సింది ఎవరూ మనల్ని ప్రత్యేకంగా చూడటం కాదు. ప్రత్యేకభేదాలు చూపకపోవడం. తామూ మనమూ ఒకే నాణెం పై చిత్రించబడ్డ రెండు ముఖచిత్రాలమన్న సంగతి గుర్తెరగడం. ఏ చిత్రం లేకున్నా అది చెల్లని నాణెమే కదా. మరి మనిషీ అంతే. మహిళని కలుపుకుపోలేనిదే మానవ వికాసానికి మనుగడేలేదు.


No comments