దీపంతో కాసిని మాటలు...


పొడుగాటి రెల్లు దుబ్బుల మధ్య
సన్నటి కాంతి రేఖల్లాంటి వేళ్ళని దీపానికడ్డుపెట్టి మెల్లగా వస్తోందామె!!
ప్రశాంతమైన ఏటి ఒడ్డు వాలులో
సంజెమసకలో కాంతిరేఖలా మెరసి
నా హృదయాంతరాళంలో నిరంతరం నిలిచి
మేలిముసుగుని తొలగించి క్షణిక దర్శనమైనా ఇవ్వని ఆమెను
ఆశగా అడిగా..
“మిత్రమా! నా హృదయం చీకటిగా ఉంది.
. నీ దీపంతో అక్కడ వెలుగునివ్వవూ!”
ఓ నిముషం తన నల్లని కళ్ళు పైకెత్తి ,
మసక చీకట్లో నా వంక చూస్తూ అంది
” నా దీపాన్ని నదికి అర్పించడానికి వచ్చాను”
రెల్లు పొదల మధ్యనుంచుని తడబడుతున్న దీపం
కొట్టుకు పోవడం నిరాశగా చూస్తూ నేను..
“నీ దీపం అర్పించావుగా..  ఈ దివ్వెని ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
నా ఇల్లంతా చీకటిగా ఉంది నీ దివ్వెని తీసుకుని అక్కడకి రావూ”
అడిగానామెని చుట్టూ ఆవరిస్తున్న నిశి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ
“ఈ దివ్వె ఆకాశానికి అంకితం “
తన నల్లని కళ్ళని పైకెత్తి నిర్లిప్తంగా అందామె.
“నేస్తమా! లోకమంతా  వెలుగు రేఖల్ని నింపావు.,
ఇంకా నీ హృదయంలో అనంతమైన వెలుగుంది కదా.
ఇక్కడ నా ఇల్లేమో చీకటిగా,
నా హృదయం ఒంటరిగా ఉంది.
నీ వెలుగుతో నన్ను నింపెయ్యవూ “
గుబులుగా అడిగానామెని,
చిక్కడిపోయిన తిమిరపు నావని భయంగా చూస్తూ.
ఓ నిమిషం తన ముసుగు తీసి ఆర్ద్రంగా నవ్వుతూ అందామె…
“వెన్నెలలో కలిసిపోవడానికే ఇక్కడకి వచ్చాను…”
చందమామలో కనిపిస్తున్న తన నవ్వుని చూస్తూ…
చీకటికి ఆలవాలమై నేను.
*

No comments