సరస్సు

కొండల్లో చిన్ని చిన్ని నీటి సరస్సులు ఉంటుంటాయి..
కొత్త రోడ్డు వేసినప్పుడు ఆ బుజ్జి సరస్సుకి వెళ్ళేదారి మరగున పడిపోతుంది.
ఎవరైనా ఆ దారి చూడడం కూడా అరుదైపోతుంది. ముళ్ళ చెట్లూ అడవి మొక్కలూ అక్కడ మొలచిపోతాయి...
ఆ తర్వాత ఆ ప్రదేశం చూసామంటే అక్కడ ఒక బుల్లి అందమైన సరస్సు ఉండేదన్న సంగతే కనిపించదు.
ఎప్పుడో ఒక సారి, హఠాత్తుగా దాహానికి ఎండిపోతున్నప్పుడు మనకే ఆ సరస్సు గురించి జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఒక తీయటి నీళ్ళున్న సరస్సుండాలని మనకి చెళ్ళున గుర్తొస్తుంది.
ప్రతీ రోజూ తిరిగే ఆ చోటులోనే వెతుక్కుంటూ.. తడుముకుంటూ.. కలియతిరుగుతాం...
చిట్టడవిలో మొలచిన పొదల్లో అలా అలా వెతికాక,
అక్కడ..
అప్పుడు కనిపిస్తుంది మనకి..
రవంతైనా బురద లేకుండా.. తేటగా.. చల్లగా తీయగా ఉన్న సరస్సు!!
ప్రశాంతంగా ఉన్న ఆ బుజ్జి నీటి కొలనులో ఒక సారి తొంగి చూసుకుంటే..
మనమే కనిపిస్తాం... మనతో పాటు సూర్యుడూ.. పర్వతాలూ.. చుట్టూ ఉన్న ప్రకృతీ...
ఇదంతా... మనం అప్పటిదాకా పట్టించుకోకుండా వదిలేసిన మన బలం...
మన అంతరంగం...
కొత్త స్నేహాలతో.. కొత్త ఆకర్షణల్లో మనం మరచి పోయిన..
మనం..
జీవితం ఎప్పుడూ అంతే.
అసలు జీవితం అంటే ఇదే కాబోలు.
కొన్ని స్నేహాలు అంతే మనల్ని మనం మర్చిపోయేటట్లు చేస్తాయి.
అవి దూరం అయ్యాక.. కోల్పోవలసినంత కోల్పోయాక..
అంతా ఇంకిపోయి... జీవితం అంతా ఎడారి అయిపోయిందనుకున్నప్పుడు...
అప్పుడు మనలోకి మనం తొంగి చూసుకుంటే..
మనం ఏమీ కోల్పోలేదని మన మనసు లోనే .. తీయని.. స్వచ్ఛమైన ఎప్పటికీ చెరగని.. తరగనీ.. బుల్లి సరస్సు లాంటి జీవం ఇంకా మిగిలుందనీ మనకు అర్ధం అవుతుంది.
అప్పుడు మళ్ళీ కొత్త జీవితం మొదలవుతుంది.
విశ్వప్రేమ పునాదిగా..



No comments