ఆ...'తను'


కొన్ని భావాలంతే
ఆస్వాదించడమే.. చెప్పుకోవడానికేం ఉండవు..
"నువ్వు నా ప్రాణం" అంటాడతను .
చీకట్లో గాలికి పారిజాతం జలదరించినట్లు.
ఒక చిన్ని సువాసన..
ఓ తీయని భావన..
మాటని అనెస్తీషియాలా వాడడం
అతనికి కాక ఎవరికి వచ్చు??
గాయపర్చినా మాన్పగలనన్న ధైర్యం,
నా గాయాలను తనవిగా చేసుకునే భరోసా.
తను దగ్గరవగానే
ఇక చీకట్లో మల్లెపందిరికింద
తచ్చట్లాడీ తచ్చట్లాడీ
మెల్లగా కుదురుకునే బుజ్జి కుక్కపిల్లలాగా
ఎంత ధిలాసా ఆ క్షణం లో!!
ఇక అప్పుడు,
అప్పుడు మాత్రమే
పూల ఉయ్యాలలో నన్ను కూర్చోపెట్టి
అలవోకగా
అలా ఊపినట్లు,
మెత్తగా కొన్ని పదాలు రాస్తాడిలా
"నువ్వు నా ప్రాణం"
ఇక జీవితపు అమృతం అంతా
బంగారు కాంతిలో ప్రతిబింబించి
అలల నెలవంకలై ఊగిసలాడతాయి
ఇక అప్పుడు..
అప్పుడు మాత్రమే బ్రతికి వస్తా...
నేను..
నా కలల్లోకీ
ఈ మెలకువలోకి.

~~ మహీ ~~

No comments