నాకు సైతం..


మనం ఎవరం ఎప్పటికీ అతీతులం కాము
ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఒకచోట.
చాలా మందికి చిన్నతనంలో
కొందరికి యవ్వనంలో...
ఇదే చివరిదన్న ఆశా లేదు., ఇక ఎప్పటికీ ఎదురుకాదన్న ధైర్యమూ లేదు.
పుట్టిన దగ్గర్నుంచి, నీ చివరిశ్వాస వరకూ... నీ జీవితం ఎప్పటికైనా వల్నరబుల్.. అంతే.
లోకమంతా నీ కనుసన్నలలో సాగేంత అధికారం నీ సొంతం కానీ... 
ప్రపంచంలో నువ్వెంత ఎత్తు ఎదగనీ… 
నువ్వొక స్త్రీ.. అతనొక పురుషుడు.
అంతకు మించి.. నువ్వు అతను మనుష్యులు కాలేరు. తోటి జీవులు అస్సలు కాలేరు.
మనం ఒంటరిగా ఉన్నప్పుడో, నిస్సహాయంగా ఉన్నప్పుడో మన మీద జరగబోయిన లేక జరిగిన శారీరక దాడుల గురించి అత్యాచార యత్నాల గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు.
నేనిప్పుడు మానసిక అత్యాచార యత్నాల గురించి మాట్లాడతాను.
స్నేహం పేరుతో 
చుట్టరికాల పేరుతో 
పెద్దరికాల పేరుతో 
వృత్తిగత రీత్యా అంటూ 
ఇంకా అనేకానేక కారణాలు చూపుతూ మనకు దగ్గర కావాలని 
మన వ్యక్తిగత జీవితంపైకి విసరడానికి రంగు రంగుల వలలు సిద్ధం చేసుకుని మొదలయ్యే అనేకనేక బంధాలు…
ఇవి మనం ఏమాత్రం ఎదురు తిరిగినా మనల్నే నేరో మైండెడ్ క్రీచర్స్ గా.. మనలోనే ఏవో పెర్వర్షన్స్ ఉన్నట్లుగా... అసలీ బంధాలే పెద్ద ఎబ్యూజ్.
శారీరకంగా మనకి ఎదురైన ఎబ్యూజ్ లు నిరూపించుకోగలం
మానసికంగా ఎదురయ్యే వేధింపులు మనకి తప్ప ఎవరికీ అర్ధం కావు.
బహిరంగంగా మనమీద జరిగే అబ్యూజ్ ని ధైర్యంగా మనం ఎదుర్కొంటే… అప్పటికప్పుడు ఇంకో నలుగురు మనకు తోడు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
కానీ ఎప్పటికప్పుడు… ఎక్కడికక్కడ రకరకాల బంధాల ముసుగులేసుకున్న వాళ్ళు, మన మీద జరిపే మానసిక అత్యాచారాలు ఉన్నాయే… ఇవి మాటల్లో చెప్పలేనంత హేయమైనవి. . ఈ అత్యాచారాలకి ఒక్క సాక్ష్యమూ దొరకదు. అంతేనా… మనల్ని మనకే దోషులుగా చూపే దృశ్యాన్నీ గీసేస్తారు. 
ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వల్నరబుల్ ఏమిటో తెలుసా. విమెన్ క్యారెక్టర్. ఆకాశమంత ఎత్తుకి ఎత్తేసి ఆమెని దేవతని చేసి కొందరు. అగాధమంత లోతుకి తోసేసి ఆమె అసలు మనిషే కాదని కొందరూ... ఇలా ప్రతీ ఒక్కరు ఆమె నడకని నడవడికనీ కొలమానం పట్టేవాళ్ళే.
మొన్నా… నిన్నా… అంతకు ముందు… స్త్రీ అణచివేతకు గురయిన ప్రతికాలంలోనూ, ఎంతో కొంత ధైర్యంగా మెసలగలిగిన మనకే ఇలా అనిపిస్తూ ఉంటే గడప దాటాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వస్తున్న మన వారసత్వం పరిస్థితి ఏమిటి? 
వాళ్లకి భవిష్యత్తు మిగిలి ఉందా? వాళ్లీ ప్రపంచంలో ఇమడగలరా?
ఇప్పుడు ఈ క్షణం నాకేమనిపిస్తుందో తెలుసా… 
మన కథలిక్కడే ఇలాగే ముగిసిపోవాలని… 
ఎందుకంటే ఏం చెప్పను?
భయమేస్తుంది... చాలా భయమేస్తుంది…
ఇంకెప్పటికీ కలవలేనంతగా...
నిన్న నడచిన నడకలన్నిటికీ ఇప్పుడు దారులు మూసుకుపోయాయని. 
అప్పుడు ప్రతిదారిలోనూ మనమున్నాం… 
ఇప్పుడేమో ప్రతి దారిలోనూ ఉంటే వాళ్ళూ.. లేదంటే మనం. కలసి నడవడానికంటూ ఒక్క దారీ మిగలటం లేదు. 
ఎందుకంటే బహుశా మన నరనరాల్లోనూ.. తర తరాలుగా మగవాడంటే ఒక భరోసా అని స్త్రీ అంటే ఒక బేలతనం అని నమ్మకాన్ని ఆపాదించుకున్నాం.
ఏం చేద్దాం మరి?
ఒక్కసారి ముగిసిపోతే… మళ్ళీ కొత్తగా ఏమైనా మొదలవుతామేమో...
ఊహూఁ
ముగిసి పోవద్దు... 
ముగించేద్దాం... 
ప్రతీ భేదాన్నీ... ప్రతీ భయాన్నీ...
నేటి నుండి... ప్రతి నిమిషం... ప్రతి చోటా... మనకి మనమే ఆయుధం.
మనలోని స్త్రీనీ... పురుషుడినీ ముగించేసి
మళ్ళీ మనిషిలోకి మనిషిని తెచ్చేవరకూ...


No comments