The Last Leaf (ది లాస్ట్ లీఫ్) - O. Henry

ఒక కథ ముగింపు చివరి నుండి, మన బ్రతుకుకి ఒక కొత్త అర్థం కల్పించుకునే అవకాశం ఎన్ని కథలనుండి మనకు లభిస్తుంది?
నిజంగా అలాంటి కథలు ఉంటాయా?
ఎందుకుండవూ… ఉంటాయి. కావాలంటే మీరూ ఓ హెన్రీ కథ ‘ ది లాస్ట్ లీఫ్ ‘ చదివి చూడండి. ఒక చిన్న కథ మనకు జీవితాన్ని ఎన్ని రకాలుగా పరిచయం చేస్తుందో మీకే అర్థం అవుతుంది. నిబద్ధత, త్యాగం, స్నేహం, కరుణ, ఆశ మరియు అంకితభావం నిండిన ఒక నేపథ్యం ఈ కథలో మనకి పరిచయం అవుతుంది.
ఇది ప్రధానంగా మూడు పాత్రల మధ్య జరిగే కథ. మూడు పాత్రలూ కూడా విభిన్న వ్యక్తిత్వాలతో ఉంటాయి.
న్యూయార్క్ సిటీ లో గ్రీన్విచ్ విలేజ్ లో ఒక అపార్ట్మెంట్ లో స్యూ , జాన్సీ అనే వర్ధమాన చిత్రకారిణులు కలిసి ఉంటారు. వాళ్ళిద్దరి అభిరుచులూ ఒక్కటే. వివిధ మ్యాగజైన్ లలో కథలకి చిత్రాలు వేస్తూ ఉంటుంది స్యూ . జాన్సీ కేమో ఇటలీకి వెళ్లి ‘ బే అఫ్ నేపుల్స్’ పెయింటింగ్ వెయ్యాలని కోరిక. 
ఇంతలో న్యూయార్క్ సిటీ అంతా న్యుమోనియా వ్యాపిస్తుంది. అందులోనూ గ్రీన్విచ్ విలేజ్ ప్రాంతం మరీ ఇరుకవ్వటం వలన అది అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది.
జాన్సీకి న్యుమోనియా వస్తుంది. స్యూ దగ్గర ఉండి తనను చూసుకుంటూ ఉంటుంది. డాక్టర్ ఇంటికే వచ్చి చూసి వెళుతూ ఉంటాడు. కాకుంటే తనకున్న నిరాశావాదంతో ఈ న్యుమోనియా వలన తాను చనిపోవటం తప్పదు అనే భావనలోకి వెళుతుంది జాన్సీ.
తాను బతుకుతాను అనే నమ్మకం జాన్సీకి ఉంటే తప్ప , న్యుమోనియా నుండి కోలుకోవడం చాలా కష్టం అని డాక్టర్ స్యూ ని పక్కకి పిలిచి చెపుతాడు.
తరువాత, స్యూ జాన్సీ ఉన్న గదిలో పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటే , జాన్సీ తనలో తాను మాట్లాడుకునేది స్యూ కి వినిపిస్తూ ఉంటుంది
“పన్నెండు” అని జాన్సీ తనలో తానే అనుకుంది.
కొంచెం ఆగి పదకొండు, 
ఆ తరువాత పది, 
తరువాత తొమ్మిది…
అలా లెక్క బెడుతూ చివరగా అయిదు అని అనుకుంటుంది.
ఏమి లెక్క వేస్తుందా అని స్యూ జాన్సీ వైపు చూస్తే , జాన్సీ కిటికీ లో నుండి కనబడే చెట్టునుండి రాలిపడే ఆకులని చూస్తూ మిగిలిన ఆకులని లెక్క వేస్తూ ఉంటుంది. ఎందుకలా లెక్క వేస్తున్నావని స్యూ అడిగితే, మొన్న చూస్తే ఆ చెట్టుకి వందకు పైగా ఆకులున్నాయి, ఇప్పుడేమో 5 మాత్రమే మిగిలాయి. చివరి ఆకు రాలేసమయానికి నేనూ చనిపోతాను అంటుంది ఆ రాలే ఆకులని తన చివరి క్షణాలకి ప్రతీకగా భావిస్తూ.
“అలా ఏమీ జరగదు. నువ్వు ఇలాంటి ఆలోచనలు చెయ్యకుండా కిటికీ వైపు చూడటం మానేసి కళ్ళు మూసుకుని పడుకో . నువ్వు త్వరలోనే కోలుకుంటావని డాక్టర్ చెప్పాడు. నేను వేసే పెయింటింగ్ లో ఒక మనిషిని గీయాల్సిన అవసరం ఉంది, నువ్వు పడుకుంటే నేను కింద ఉండే బెర్మాన్ ని పిలుచుకుని వస్తాను. ” అని అంటుంది స్యూ.
తనకిష్టం లేకపోయినా స్యూ మాటని కాదనలేక పడుకుంటుంది జాన్సీ.
బెర్మాన్ పెద్ద తాగుబోతు. వృత్తిరీత్యా తను కూడా చిత్రకారుడే అయినా తన 40 ఏళ్ళ వృత్తి జీవితంలో ఏ నాడూ ఒక్క మంచి చిత్రమూ గీయలేదు. తానూ చనిపోయేలోపున ఒక ‘మాస్టర్ పీస్ ‘ లాంటి చిత్రాన్ని గీస్తానని అందరితో అంటూ ఉంటాడు.
స్యూ , జాన్సీ గురించి తన ఆలోచనా విధానం గురించి బెర్మాన్ తో చెబుతుంది. అతను ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటాడు. ఆ రాత్రి మంచు విపరీతంగా కురుస్తుంది. ఆ రాత్రి గడిచాక, కిటికీ తెరచి చూస్తే గోడవారగా చెట్టుమీద చివరి ఆకు కనిపిస్తూ ఉంటుంది. అంత మంచు వానలో కూడా అది రాలలేదు, ఇక ఏ క్షణాన అయినా అది రాలిపోతుంది, అదే సమయానికి తానూ చనిపోతుంది అన్న భావన ఇంకా జాన్సీలో కొనసాగుతుంది. గాలితో కూడిన మంచు వానతో పాటే మరో పగలూ రాత్రీ గడుస్తాయి. అయినా ఆ ఆకు అక్కడే ఉంటుంది.
జాన్సీ లో నెమ్మదిగా ఆశ అంకురిస్తుంది. తానూ బతుకుతానన్న నమ్మకం కలుగుతుంది. మరునాటికి ఆమెకి పూర్తిగా నయమయిపోతుంది. కానీ అదే సమయానికి బెర్మాన్ న్యు మోనియాతో చనిపోతాడు.
జాన్సీ పూర్తిగా కోలుకున్నాక ఆమెని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి చివరి ఆకుని చూపిస్తూ అది నిజమైన ఆకు కాదని. జాన్సీలో జీవితంపై నమ్మకాన్ని బతికించడానికి బెర్మాన్ ఆ ఆకు బొమ్మను గీసాడని. రాత్రంతా మంచులో ఉండి అలా ఆకుని గీయడం వల్ల అతను న్యూమోనియాకు బలైపోయాడని స్యూ చెప్తుంది.
ఈ కథ నిండా పరిపూర్ణమైన స్నేహ పరిమళం వీస్తూ ఉంటుంది. మనిషికి ఆశావాద దృక్పథం ఎంత ముఖ్యమో ఈ కథ చదివితే మనకి అర్థం అవుతుంది. ఎలాంటి పరిస్థితిలోనూ మనం నమ్మకం కోల్పోగూడదు అన్న విషయాన్ని మనకి కళ్ళకి కట్టేలా చెపుతుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులోని మూడు పాత్రలకీ తమదైన గమ్యం ఒకటి ఉంటుంది. ఆ గమ్యం పట్ల తమదైన నిబద్ధతా ఉంది. అది ప్రత్యేకంగాచర్చించినట్లు కాకుండా చిన్న చిన్న పదాలతోనే మనకి సూటిగా చేరుతూ ఉంటుంది.
ఇందులో జాన్సీ పాత్ర ద్వారా చర్చించ బడిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే, రాలిపోయే ఆకుల మీద కంటే తన మీద తాను దృష్టి పెట్టుకుని న్యుమోనియా నుండి బయట పడే ప్రయత్నం చెయ్యాలని. తన వైపు నుండి ఒక నమ్మకం మొదలైతేనే తాను ఇచ్చే మందులు రోగాన్ని నయం చేస్తాయి అని డాక్టర్ స్యూ కి చెప్పటాన్ని జీవితాలకి అన్వయించుకుని చూస్తే, మన ప్రయత్నం మనం చెయ్యకుండా బయట వ్యక్తులెవ్వరూ మన జీవితాలని వెలిగించలేరు అని తెలుస్తుంది.
కథ పొడుగూతా స్యూ తన పని చేసుకుంటూనే స్నేహితురాలిని ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉంటుంది. స్నేహితురాలి కోసం తాను పడే తపన, కథ పొడుగూతా ప్రతి చోటా మనకి ప్రస్ఫుటం గా మనకి చేరుతూనే ఉంటుంది
ఒక తాగుబోతు చిత్రకారుడు ‘మాస్టర్ పీస్ ‘ లాంటి పెయింటింగ్ వెయ్యాలనుకోవటం మామూలు మనుష్యు లకి నవ్వులాటగా అనిపించవచ్చు. కానీ అతను అనుకున్నదానికన్నా గొప్ప పనే చేశాడు . ఒక ప్రాణాన్ని నిలబెట్టే చిత్రం కన్నా గొప్ప చిత్రం మరేముంటుంది.
అతను గోడపై పెయింట్ చేసిన ఏకైక ఆకు అతని కళాఖండం. ఇది జాన్సీని పునర్నిర్మించింది.
జీవితాన్ని చాలా తేలికగా తీసుకునే తాగుబోతు చిత్రకారుడిగా పరిచయమయ్యే బెర్మాన్ వర్ధమాన చిత్రకారిణుల పట్ల తన అభిమానాన్ని తన ఆత్మత్యాగంతో పరిపూర్ణం చేసుకున్న ఉదాత్తజీవిగా మారటంలో, మనిషి అంతరాలలో ఉండే వాస్తవిక విలువలు తగిన సమయంలోనే బహిరంగమవుతాయనే విషయాన్ని ‘ ఓ హెన్రీ ‘ చాలా చిక్కగా చెప్పినట్లే అనిపిస్తుంది.
1862లో నార్త్ కరోలినాలో జన్మించిన ‘ ఓ హెన్రీ ‘ ఒక ప్రముఖ కథకుడు. చిన్న చిన్న కథలతో చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పగలిగే శైలి అతని స్వంతం. 1904 లో కాబెజెస్ & కింగ్స్ అనే కథాసంకలనంతో మొదలైన అతని రచనా జీవితం అతి త్వరలోనే రచనా రంగంలో తనకో విస్తృత మైన స్థానాన్ని కట్టబెట్టింది.
కథగా చదివితే చాలా చిన్నది. నిమిషాలలోనే ముగిసిపోయేంత చిన్నది. కానీ జీవితంలోకి ఒంపుకుని చూసుకుంటే తన విలువ ఆకాశమంత.

చివరిగా ఏమనిపిస్తుందో తెలుసా… ఒక్క ఆకైనా చాలుకదా… మనిషి శ్వాసను కొనసాగించడానికి అని.








No comments